Share News

తొలిరోజే నామినేషన్ల జోరు

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:23 AM

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజు గురువారమే ఈ ప్రకియ జోరందుకుంది. మొత్తం 25 పార్లమెంటు పార్లమెంటు స్థానాలకుగాను 20 స్థానాల్లో తొలిరోజు 39 మంది

తొలిరోజే నామినేషన్ల జోరు

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజు గురువారమే ఈ ప్రకియ జోరందుకుంది. మొత్తం 25 పార్లమెంటు పార్లమెంటు స్థానాలకుగాను 20 స్థానాల్లో తొలిరోజు 39 మంది అభ్యర్థులు 43 నామినేషన్లు దాఖలు చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 101 స్థానాలకు 190 మంది అభ్యర్థులు 236 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి ఐదుగురు, ఒంగోలుకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. విశాఖపట్నం, కర్నూలుకు ముగ్గురు చొప్పున, విజయనగరం, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, అనంతపురం, కడప, రాజంపేట లోక్‌సభ స్థానాలకు ఇద్దరేసి చొప్పున నామినేషన్లు వేశారు. అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, ఏలూరు, హిందూపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి లోక్‌సభ స్థానాలకు ఒక్కొక్కరు నామినేషన్‌ వేశారు. టీడీపీ తరపున నరసరావుపేట పార్లమెంట్‌ స్థానానికి లావు శ్రీకృష్ణదేవరాయలు, లావు మేఘన, ఒంగోలుకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట గీతాలత, కర్నూలులో బి. నాగరాజు, కె. జయసుధ, కడపలో చదిపిరాళ్ల భూపేశ్‌ సుబ్బరామిరెడ్డి, చిత్తూరులో దగ్గుమళ్ల ప్రసాదరావు నామినేషన్లు వేశారు. వైసీపీ తరఫున హిందూపురం పార్లమెంట్‌ స్థానానికి జె.శాంత, రాజంపేటలో పీవీ మిథున్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున అనకాపల్లిలో షేక్‌ సఫీవుల్లా, నరసాపురంలో సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌, పిరమిడ్‌ పార్టీ నుంచి పి.సత్యవతి, ఇండిపెండెంట్‌గా వడ్డి హరిగణేష్‌ ఒక్కొక్క సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కొందరు ఇతర పార్టీల తరఫున, మరికొందరు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసినట్లు సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి.

అసెంబ్లీ స్థానాలకు..

రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు తొలిరోజే 190 మంది అభ్యర్థులు 236 నామినేషన్లు దాఖలు చేశారు. విశాఖజిల్లా భీమిలి నుంచి టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గంటా రవితేజ రెండేసి సెట్లు దాఖలు చేశారు. నెల్లూరు జిల్లాలో కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి, కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రెండు సెట్లు, వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రెండు సెట్లు, ఆయన కుమారుడు రజత్‌కుమార్‌రెడ్డి మరో రెండు సెట్ల నామినేషన్లు వేశారు. నెల్లూరు రూరల్‌ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తరఫున మాజీ మేయర్‌ భానుశ్రీ నామినేషన్‌ వేశారు. బాపట్లలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే కోన రఘుపతితో పాటు ఆయన సతీమణి రమాదేవి నామినేషన్‌లు దాఖలు చేశారు. ఎచ్చెర్లలో బీజేపీ తరఫున నడుకుదిటి ఈశ్వరరావు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా నేతల ఈశ్వరరావు, నడుపూరు ఈశ్వరరావు నామినేషన్‌ వేశారు. వీరి ముగ్గురు పేర్లు ఒకేలా ఉండడం గమనార్హం. ఎలమంచిలిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ తరఫున ఆయన సతీమణి స్నేహలత, శిగనమలలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి కుటుంబ సభ్యులు, పుట్టపర్తిలో టీడీపీ తరఫున పల్లె సింధూరారెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి, పల్లె వెంకటక్రిష్ణకిశోర్‌రెడ్డి, ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నరసరావుపేటలో కూటమి అభ్యర్థిగా డాక్టర్‌ చదలవాడు అరవిందబాబు నామినేషన్‌ వేశారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌, గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, యార్లగడ్డ జ్ఞానేశ్వరి, పామర్రులో వర్ల కుమార్‌రాజా, జగ్గయ్యపేటలో శ్రీరామ్‌ రాజగోపాల్‌, శ్రీరామ్‌ శ్రీదేవి, మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, బుడ్డా శైలజ, ఎమ్మిగనూరులో బి. జయనాగేశ్వర్‌రెడ్డి, బైరెడ్డి నిత్యాదేవి టీడీపీ తరఫున నామినేషన్లు వేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి బలపరచిన బీజేపీ అభ్యర్థి వై.సుజనాచౌదరి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. వీరితోపాటు పలు చిన్నా చితకా పార్టీలకు చెందిన నాయకులు, ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేశారు.

Updated Date - Apr 19 , 2024 | 04:23 AM