Share News

తేలుస్తారా..? మడతపెట్టేస్తారా....!

ABN , Publish Date - May 16 , 2024 | 11:19 PM

అధ్వాన్న రహదారులు, ఇళ్ల ముందు నిత్యం మురుగు ప్రవాహం, మౌలిక వసతుల కరువు. ఇది కంబదూరు మండల పరిస్థితి. అభివృద్ధి అంటే ఎరుగని ఈ మండలం గ్రామీణ, పట్టణీకరణ కింద శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ రూర్బన పథకం కింద ఎంపికైంది.

తేలుస్తారా..? మడతపెట్టేస్తారా....!
రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు( ఫైల్‌ఫోటో)

రూర్బన పథకంలో అవినీతిని తేల్చడంతో అధికారులు విఫలం

కళ్యాణదుర్గం, మే 16 : అధ్వాన్న రహదారులు, ఇళ్ల ముందు నిత్యం మురుగు ప్రవాహం, మౌలిక వసతుల కరువు. ఇది కంబదూరు మండల పరిస్థితి. అభివృద్ధి అంటే ఎరుగని ఈ మండలం గ్రామీణ, పట్టణీకరణ కింద శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ రూర్బన పథకం కింద ఎంపికైంది. దీని ప్రకారం రూ. 127 కోట్లతో కంబదూరు మండలంలోని 12 పంచాయతీల్లో అన్ని అభివృద్ధి పనులు మూడేళ్లలో పూర్తి చేయాలి. అయితే ఏడేళ్లు పూర్తయినా మండలం అభివృద్ధికి నోచుకోలేదు. ఆ పథకం నాయకులకు, అధికారులకు వరంగా, అభివృద్ధికి శాపంగా మారింది. కంబదూరు రూర్బన పథకంలో జరిగిన అవినీతిని తేల్చడంలో మండల పరిషత, సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. చేసిన పనులకు కొలతలు లేవు. దాచిపెట్టిన రికార్డులు వెలుగు చూడలేదు. పాత పనులను కొత్తగా చూపారు. నిర్మించిన భవనాలకు లెక్కలు లేవు. మండలంలో చేపట్టిన రూర్బన మిషన పనులకు సంబంధించి రికార్డులు ఏ మాత్రం లేనట్లు 2021 అక్టోబరులో చేసిన సామాజిక తనిఖీల్లో తేలింది. అప్పటికే సుమారు రూ. 21 కోట్ల వరకు రికార్డులను దాచిపెట్టి ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి తెరలేపినట్లు విమర్శలు గుప్పుమన్నాయి. ఇలా గత కొన్ని రోజుల నుంచి రూర్బన అక్రమాలపై ఫిర్యాదులు, సామాజికి తనిఖీ బృందాలు తేల్చిన అవినీతిపై జిల్లా యంత్రాంగం ముగ్గురు సభ్యులతో తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిర్ధేశిత సమయంలోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. అయితే ఈ బృందం రోజూ రావడం, రెండు మూడు రికార్డులు ముందరేసుకుని వెళ్లిపోవడం.. ఇదే తంతు కొనసాగుతోంది. కోట్ల పనుల్లో పలు చోట్ల పనులు లేకపోవడం, రికార్డులు కనిపించకపోవడంతో షరామామాలై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రూర్బన పనులు ప్రారంభమైనప్పటి నుంచి కోట్ల అవినీతిపై ఆరోపణలు వస్తూనే ఉన్నా ఏ అధికారిపై చర్యలు తీసుకోకపోగా ఒక్క రూ పాయి కూడా రికవరీ చేయలేదంటే జిల్లా యంత్రాంగం ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చునని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పథకం లక్ష్యమిదే...!

కంబదూరులో రూ. 127 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకాన్ని ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల కొరతతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగాయి. ఈ పథకంలో రూ. 5 లక్షల విలువకు లోబడిన పనులను నామినేటెడ్‌ పద్ధతిన అప్పగించారు. వాటికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. మొదట్లో పనులు పూర్తయిన వెంటనే సంబంధిత ఇంజనీర్‌ ధృవీకరించి ఎంబుక్‌ రికార్డు చేశాక మండల స్థా యిలో ఎంపీడీవో ద్వారా బిల్లుల చెల్లింపులు జరగాలి. ఆ నిధులు ఎంపీడీవో ఖాతాలో వుండేవి. దీంతో పనులు పథకం ప్రారంభమైన కొన్ని రోజుల తరువాత జోరుగా సాగేవి. బిల్లులను సీఎంఎ్‌ఫఎస్‌ విధానంలోకి మార్చగా నిధులను పూర్తిగా వినియోగించుకోలేక పోయారు.

Updated Date - May 16 , 2024 | 11:20 PM