Share News

ఆర్టీసీ సొమ్ముకు ఎసరు!

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:52 AM

ఎన్నికల ముందు మే 2వ తేదీన ఏదేమైనా సరే రూ.7,000 కోట్ల అప్పు తేవడం కోసం జగన్‌ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ నిధులపై కన్నేసింది. ముందుగా ప్లాన్‌ చేసి పెట్టుకున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏసీఎండీసీ) బాండ్ల గుట్టు రట్టవడంతో ఉలిక్కిపడింది. చివరి నిమిషంలో

ఆర్టీసీ సొమ్ముకు ఎసరు!

పీఎఫ్‌సీ బాండ్లకు మళ్లించేందుకు జగన్‌ సర్కారు రెడీ!

ఏపీఎండీసీలో వాటాల అమ్మకం

బయటకు రావడంతో ఉలికిపాటు

ప్రత్యామ్నాయంగా ఏపీపీఎఫ్‌సీ ద్వారా

రూ.7,000 కోట్ల అప్పు తెచ్చే యత్నం

గ్యారెంటీ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సిద్ధం

చకచకా కదులుతున్న పీఎఫ్‌సీ ఫైలు

రేపోమాపో గ్యారెంటీ లభించే అవకాశం

ఆర్టీసీ నిధులతో ఈ బాండ్ల కొనుగోలు?

గతంలోనూ విద్యుత్‌ ఉద్యోగుల పీఎఫ్‌ ఫండ్‌

మళ్లించి బేవరేజెస్‌ ఎన్‌సీడీల కొనుగోలు

ఆ సొమ్ము సొంత అవసరాలకు వాడకం

ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల వంతు?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల ముందు మే 2వ తేదీన ఏదేమైనా సరే రూ.7,000 కోట్ల అప్పు తేవడం కోసం జగన్‌ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ నిధులపై కన్నేసింది. ముందుగా ప్లాన్‌ చేసి పెట్టుకున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏసీఎండీసీ) బాండ్ల గుట్టు రట్టవడంతో ఉలిక్కిపడింది. చివరి నిమిషంలో ఆ అప్పురాకపోతే ఎలా అనుకుని.. రాష్ట్ర పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) ద్వారా ఇంకో రూ.7,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు గ్యారెంటీ ఇచ్చేందుకు ఆర్థికశాఖ సిద్ధమైంది. ఇందుకోసం ఆర్టీసీ నిధులను మళ్లించబోతోంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశలో ఉంది. రేపోమాపో సంతకాలు కూడా జరిగిపోయే అవకాశాలున్నాయి. వాస్తవానికి మార్చి 4న తమకు రూ.7,000 కోట్ల రుణం తెచ్చుకోవడానికి గ్యారెంటీ కావాలని విద్యుత్‌శాఖ.. ఆర్థిక శాఖను లిఖితపూర్వకంగా కోరింది. అప్పటి నుంచి పెద్దగా కదలిక లేని ఆ ఫైలు.. నాలుగు రోజులుగా చకచకా కదులుతోంది. ప్రస్తుతం ఈ కార్పొరేషన్‌లో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు ఫండ్‌ ఉందని సమాచారం. పీఎఫ్‌ నిధులు వడ్డీతో కలుపుకొని దాదాపు రూ.2,000 కోట్లు, సీసీఎస్‌ ఫండ్‌ రూ.400-500 కోట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.600 కోట్లు, ఎస్సార్‌బీఎస్‌, ఎస్‌బీఎస్‌ నిధులు రూ.600 కోట్ల వరకు ఆ సంస్థలో ఉన్న ట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎండీసీ ద్వారా విదేశీ అప్పు తెచ్చుకోలేకపోతే, ప్రత్యామ్నాయంగా పీఎ్‌ఫసీ చేత బాండ్లు జారీ చేయించి ఆర్టీసీ నుంచి, ఇతర కార్పొరేషన్ల నుంచి డబ్బు మళ్లించి ఆ బాండ్లు కొని.. ఆ ఉద్యోగుల డబ్బు వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో మారిన ప్లాను

ఎండీసీలో వాటాల అమ్మకం ద్వారా రూ.14,000 కోట్ల అప్పు తేవాలని జగన్‌ ప్రభుత్వం రహస్యంగా పావులు కదిపిన సంగతి తెలిసిందే. ఇందులో మార్చి 1న తెచ్చిన రూ.7,000 కోట్ల విదేశీ రుణానికి మార్చి 15న కేబినెట్‌ ఆమోదం తీసుకున్నారు. మే 2న ఇంకో రూ.7,000 కోట్ల అప్పు తీసుకురాబోతున్నట్లు ఎన్‌ఎ్‌సడీఎల్‌ బాండ్స్‌ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేశారు. ఇలా ఊరూపేరూ తెలియని ఇన్వెస్టర్‌కు ఎండీసీలో వాటాల అమ్మకం ద్వారా అప్పులు తేవాలన్న ప్రభుత్వ కుట్రపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. వాటాలు అమ్మాలన్న నిర్ణయాన్ని కేబినెట్‌ నోట్‌లో దాచడాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. దీంతో జగన్‌ ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే ప్లాను మార్చింది. కొంతకాలం నుంచి ఆర్థిక శాఖ గ్యారెంటీ కోసం ఎదురుచూస్తున్న ఏపీపీఎ్‌ఫసీ ఫైలుపై దృష్టిసారించింది. ఒకవేళ ఎండీసీ బాండ్ల ద్వారా అప్పు తేలేకపోతే.. ప్రత్యామ్నాయంగా పీఎ్‌ఫసీ ద్వారా అప్పు తెచ్చుకోవాలనేది ప్లాన్‌.

బాండ్లు జారీచేసినా కొనేదెవరు?

జగన్‌ ప్రభుత్వంపై బ్యాంకులకు, మార్కెట్లో ఇన్వెస్టర్లకు నమ్మకం లేదు. అందుకే రుణాల రూపంలో కాకుండా.. మార్కెట్లో బాండ్ల జారీ ద్వారా అప్పుల సమీకరణకే ఆర్థిక శాఖ మొగ్గు చూపుతోంది. అయితే మార్కెట్లో కూడా రాష్ట్రానికి అప్పులిచ్చే ఇన్వెస్టర్లు లేరు. గతేడాది బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రెండు సార్లు నాన్‌-కన్వర్టిబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీలు) విడుదల చేయగా.. ఒకసారి ఇష్యూ ఫెయిలైంది. మరోసారి ఇన్వెస్టర్లు ముందుకు రాలేదు. 2018లో సీఆర్‌డీఏ బాండ్ల రేటింగ్‌ను క్రిసిల్‌ వరుసగా తగ్గిస్తుండడం, 2021లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా విడుదల చేసిన బాండ్లు మార్కెట్లో తక్కువ రేటింగ్‌తో ట్రేడవుతుండడంతో ఇన్వెస్టర్లు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇలా రెండుసార్లు బాండ్లు విఫలమైన తర్వాత విద్యుత్‌ కార్పొరేషన్ల ఉద్యోగుల పీఎఫ్‌ ఫండ్‌ను మళ్లించి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ జారీచేసిన ఎన్‌సీడీలు కొన్నారు. వచ్చిన ఆ డబ్బును ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంది. ఇప్పుడు ఆర్టీసీ నిధులను కూడా ఇలాగే వాడుకునే ఎత్తువేస్తున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 02:52 AM