Share News

మేదరిమెట్ల సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:46 PM

మహాశివరాత్రి పండుగ పూట ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు దొరక్క అవస్థలు పడ్డారు. శనివారం ఆదోని ఆర్టీసీ డిపో నుంచి 18 బస్సులు బాపట్ల జిల్లా మేదరిమెట్లలో జరిగే సీఎం సిద్ధం సభకు ఈ బస్సులను తరలించారు.

మేదరిమెట్ల సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు

బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

ఆదోని (అగ్రికల్చర్‌), మార్చి 9: మహాశివరాత్రి పండుగ పూట ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు దొరక్క అవస్థలు పడ్డారు. శనివారం ఆదోని ఆర్టీసీ డిపో నుంచి 18 బస్సులు బాపట్ల జిల్లా మేదరిమెట్లలో జరిగే సీఎం సిద్ధం సభకు ఈ బస్సులను తరలించారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులకు బస్సులు దొరక్క ఇబ్బందులు పడ్డారు. శ్రీశైలం స్వామి వారిని దర్శించుకుని స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా భక్తులకు బస్సులు లేవు. ఉదయం వందలాది మంది ఆదోని ఆర్టీసీ కొత్త బస్టాండ్‌ వద్ద ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాచారు. ఎంతసేపటికి బస్సులు రాకపోవడంతో పక్కనే ఉన్న ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి తాము శ్రీశైలం నుంచి ఎలాగోలాగా ఆదోనికి చేరుకున్నామని ఇక్కడి నుంచైనా హొలగుంద మండలం గజ్జహల్లి గ్రామానికి పంపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. బస్సులు లేవంటూ అధికారులు తేల్చి చెప్పారు. బస్సులన్నీ సీఎం జగన్‌ సిద్ధం సభ మేదరిమెట్లకు పంపామని సాయంత్రం మూడు గంటలకు మీ గ్రామానికి బసు ఉందని చెప్పారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఉండలేమని, ఎలాగైనా బస్సును ఏర్పాటు చేయాలని కోరారు. తాము ఏమి చేయలేమని అధికారులు తేల్చిచెప్పడంతో అక్కడే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు అక్కడ చేరుకొని ప్రయాణికులకు నచ్చచెప్పి బస్టాండ్‌కు పంపారు. ప్రయాణికులు సిద్ధం సభకు బస్సులో తరలించడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసి గ్రామాలకు పంపారు.

Updated Date - Mar 09 , 2024 | 11:46 PM