Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

‘సరస్వతి’ పేరిట దోపిడీ

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:14 AM

సరస్వతి పవర్‌ కంపెనీ రెవెన్యూ సున్నా అని.. టర్నోవర్‌ లేని కంపెనీలో రూ.80 లక్షల పెట్టుబడి అరవై రోజుల్లో రూ.18.87 కోట్లకు ఎలా పెరుగుతుందని టీడీపీ ప్రశ్నించింది,

‘సరస్వతి’ పేరిట దోపిడీ

టర్నోవరే లేని సంస్థలో జగన్‌ దంపతుల వాటా: ఆనం

నెల్లూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): సరస్వతి పవర్‌ కంపెనీ రెవెన్యూ సున్నా అని.. టర్నోవర్‌ లేని కంపెనీలో రూ.80 లక్షల పెట్టుబడి అరవై రోజుల్లో రూ.18.87 కోట్లకు ఎలా పెరుగుతుందని టీడీపీ ప్రశ్నించింది, నల్లఽధనాన్ని వైట్‌ చేసుకునేందుకు ఇలాంటి కంపెనీలు పెట్టి సీఎం జగన్‌ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని.. ఆయన కడిగిన ముత్యం కాదని.. బురదలో తిరిగే పంది అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘1999లో సరస్వతి పవర్‌ను రూ.కోటి ఆథరైజ్జ్‌ కేపిటల్‌తో ప్రారంభించగా.. 2009 వచ్చే సరికి ఆ కంపెనీ షేర్‌ కేపిటల్‌ రూ.35 కోట్లకు చేరుకుంది. ఆ కంపెనీలో 2009 జూన్‌లో జగన్‌ రూ.87.08 లక్షలు, భారతీరెడ్డి రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. అప్పటికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి సీఎం అయ్యారు. 2009 సెప్టెంబరునాటికి వీరి పెట్టుబడి రూ.18.87 కోట్లకు పెరిగింది. ఏమిటీ మ్యాజిక్‌.? సరస్వతి పవర్‌కు ఆఫీసు భవనం కాదు కదా. గుడిసె కూడా లేదు. షేర్‌ విలువ మాత్రం రాకెట్‌లా దూసుకుపోయింది. పవర్‌ కంపెనీకి లైమ్‌స్టోన్‌తో ఏం పని..? 2008 జూన్‌ 12న వైఎస్‌ భారతి డైరెక్టర్‌గా లైమ్‌స్టోన్‌కు అనుమతులు కోరారు. అప్పటికి సిమెంట్‌ ఫ్యాక్టరీ పెట్టే పర్మిషన్‌ కూడా ఆ కంపెనీకి లేదు. కానీ 2008 జూలై 15న సిమెంటు కంపెనీ కూడా పెట్టవచ్చని మెమోరాండమ్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌లో అనుమతి వచ్చింది.

వైఎస్‌ మళ్లీ సీఎం అవుతున్నారని డిక్లేర్‌ అయ్యాక ఆ తర్వాత రెండు రోజులకే సరస్వతి పవర్‌కు 1515.80 ఎకరాల్లో లైమ్‌స్టోన్‌ను లీజుకు ఇస్తూ జీవో 107 జారీఅయింది. దాచేపల్లి, మాచవరం మండలాల్లో 1515.80 ఎకరాలను సరస్వతి పవర్‌ కంపెనీకు లీజుకు ఇచ్చారు. టన్నుకు రాయల్టీ రూ.5, ప్రభుత్వ సెస్‌ రూ.3, హెక్టారుకు లీజు ఏడాదికి రూ.200గా నిర్ణయించారు. ఏమిటీ దోపిడీ..? ఆ మాత్రం దానికి ఉచితంగా ఇచ్చుకోవచ్చుగా..? లీజు ఇచ్చే సమయంలో గ్రామసభలు పెట్టి స్థానికులకు ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగం అని నమ్మించారు. ఇప్పటికీ ఫ్యాకరీకట్టకుండా, ఉద్యోగం ఇవ్వకుండా రైతులను అన్యాయం చేసింది జగన్‌, వైఎస్‌ భారతి కాదా? ఫ్యాక్టరీ ఏర్పాటుకాక, ఉద్యోగం లేక ఇళ్లు గడవడం కష్టంగా ఉందని, తమ భూములు సాగు చేసుకుంటామని రైతులు వేడుకుంటే వారిపై 2014లో దాడులు చేశారు. పెట్రోల్‌ బాంబులతో భయభ్రాంతులు చేశారు. ఆ భూములను వెనక్కు తీసుకోరా..? మిగతా వాళ్లకు ఒక న్యాయం సీఎం దంపతులకు మరో న్యాయ మా..? పరస్వతి పవర్‌ కంపెనీ పెట్టబోయే ఫ్యాక్టరీకు జీవితకాలం కృష్ణ జలాలను ఇచ్చేలా 2020 మే 15న ఇరిగేషన్‌ శాఖ జీవో జారీ చేసింది. కృష్ణా నదినే తీసేసుకోవచ్చుగా.? గుడిసె కూడా లేని కంపెనీకు జీవితాంతం నీళ్లు ఇవ్వాలంటూ జీవో ఇవ్వడం క్విడ్‌ ప్రోకో కాదా..’ అని ఆనం నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ భూములను వెనక్కి తీసుకుంటామని, నీళ్లు కేటాయించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Mar 04 , 2024 | 03:14 AM