Share News

రీసర్వే తెచ్చిన తిప్పలు

ABN , Publish Date - May 21 , 2024 | 12:20 AM

భూ సమస్యల పరిష్కారం పేరిట వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే కార్యక్రమం రైతులకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.

రీసర్వే తెచ్చిన తిప్పలు
తుగ్గలిలో సర్వేయర్లతో వాగ్వాదానికి దిగిన రైతులు

సమగ్ర భూసర్వేలో మారిన కొలతలు, రికార్డులు

వెబ్‌ల్యాండ్‌లో చూపని 1బీ, అడంగల్‌ వివరాలు

బ్యాంకు లోన్‌ రెన్యూవల్‌ కోసం రైతుల అగచాట్లు

మరోసారి సర్వే చేస్తే తప్ప సమస్యను

పరిష్కరించలేమంటున్న అధికారులు

పత్తికొండ, మే 20 : భూ సమస్యల పరిష్కారం పేరిట వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే కార్యక్రమం రైతులకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. కొత్తగాచేసిన సర్వేలో కొందరు రైతుల భూవిస్తీర్ణం కొలతలు తారుమారుకావడంతో అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో ఆ భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయకుండా అధికారులు పెండింగ్‌లో ఉంచారు. దీంతో రుణాల షెడ్యూల్‌కు వెళ్లాలంటే తమరికార్డులు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా మరోసారి ఆ భూములను రీసర్వే చేస్తే తప్ప సమస్యను పరిష్కరించలేమని చావుకబురు చల్లగా చెబుతున్నారు. దీంతో తమభూములకు సంబంధించి రుణాల రీషెడ్యూల్‌ పరిస్థితి ఏమిటో అర్థంగాక రైతులు రీసర్వే తెచ్చిన తిప్పలపై మండిపడుతున్నారు.

సర్వేనంబర్‌ కాకుండా ఎల్‌పీవో నంబర్‌

బ్రిటిష్‌ కాలం నుంచి అందుబాటులో ఉన్న సర్వేనంబర్ల విధానాన్ని మార్పుచేసి ఎల్‌పీవో నంబర్‌ విధానం అందుబాటులోకి తేవడం ముఖ్యఉద్దేశంగా సమగ్ర భూసర్వేను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా రీసర్వేను డ్రోన్‌ సర్వే, ఏరియల్‌ సర్వేద్వారాచేపట్టింది. ఈ రెండు సర్వేలే చేయలేని ప్రాంతంలో డీజీపీఎస్‌ సర్వేద్వారా భూముల విస్తీర్ణాన్ని కొలిచింది. పత్తికొండ నియోజకవర్గంలో ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తిచేసి వెబ్‌ల్యాండ్‌లో ఎల్‌పీవో నంబర్లకింద రికార్డులు నమోదుచేశారు.

కొలతలలో మార్పులు, రికార్డుల మార్పులు..

రీసర్వే నిర్వహించిన గ్రామాలలో పొలాలకు సంబంధించిన రికార్డులలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు రైతుల భూవిస్తీర్ణం తక్కువగా మరికొందరి భూవిస్తీర్ణం ఎక్కువగా చూపడంతో తమ భూవిస్తీర్ణం సరిగా చూపాలని రైతులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో అలాంటి భూముల వివరాలను అధికారులు ఆ భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించకుండా పెండింగ్‌లో పెట్టారు. దీంతో రుణాల రీషెడ్యూల్‌కు వెళ్లాలంటే భూమికి సంబంధించని వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించక రీషెడ్యూల్‌ చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం వారి సమస్య పరిష్కారం కావాలంటే పెండింగ్‌ ఉన్న రీసర్వే పూర్తి కావాల్సిందేనని తెల్చిచెబుతున్నారు.

నా భూమి విస్తీర్ణం తక్కువగా చూపారు

మాది తుగ్గలి మండల రాతన గ్రామం. మాకు చక్కరాళ్ల గ్రామ సర్వేనంబర్‌ 465/2లో 3.70 ఎకరాల భూమి ఉంది. రీసర్వే చేసిన అధికారులు నాకున్న భూమి 2.79 ఎకరాలుగా చూపారు. దీంతో నా భూవిస్తీర్ణం నాకు చూపాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌లో నాపేరిట అసలు ఎలాంటి భూమి వివరాలను చూపడం లేదు. బ్యాంకులో రుణం రీషెడ్యూల్‌ చేసుకోవాలని నెలరోజులుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. సమస్యను పరిష్కరంచడంలేదు.

- చాంద్‌మియా బాబుసాహెబ్‌, చక్కరాళ్ల రైతు

మరోసారీ రీ సర్వే చేయాల్సిందే

సమగ్ర భూసర్వేలో కొన్నిపొలాల్లో ఇబ్బందులు వచ్చాయి. రైతుల ఫిర్యాదుల మేరకు వాటిని పెండింగ్‌లో ఉంచాం. మరోసారి ఆ భూములలో రీసర్వే చేయాల్సి ఉంది. త్వరలో రీ సర్వేచేసి సమస్యను పరిష్కరిస్తాం. అప్పటి వరకు వారి సమస్యను పరిష్కరించలేం.

- మాధవరాజు, తహసీల్దార్‌

తుగ్గలి, మే 20 : సోమవారం తుగ్గలి తహసీల్దార్‌ కార్యాలయంలో సర్వేయర్‌ కార్యాలయం వద్ద మండలంలోని మామళ్ల కుంట, అమీనాబాద్‌, సూర్యతండా తదితర గ్రామాల రైతులు సర్వేయర్లతో ఘర్షణకు దిగారు. రీసర్వేలో తమ భూములు మాయం చేశారంటూ సర్వేయర్లను నిలదీశారు. ‘‘మా భూముల కొలతలు ఎందుకు తగ్గించారు. ఏళ్లతరబడి మా భూముల్లో మేము సాగులో ఉన్నాం. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో మాత్రం ఎందుకు తగ్గించారు అంటూ సర్వేయర్లను చుట్టుముట్టారు.

సర్వే పేరుతో 3.40 ఎకరాలను మాయం చేశారు

నాకు 902, 903 సర్వేల్లో ఐదెకరాల 74 సెంట్లు పొలం ఉంది. అందుకు సంబంధించిన రిజిస్ర్టేషన్‌, ఆన్‌లైన్‌, పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. భూసర్వే తర్వాత కేవలం రెండెకరాల 34 సెంట్లు మాత్రమే చూపుతోంది. మిగిలిన 3.40 ఎకరాలను మాయం చేశారు. ఏమి చేయాలో అర్థం కాక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం.

- తిమ్మప్ప యాదవ్‌, మామళ్లకుంట రైతు

డబ్బు తీసుకొని భూమిని మాయం చేశారు

తనకున్న కాస్త పొలంలో బ్యాంకు రుణం తీసుకొని పెట్టుబడులు పెట్టి ఇంటిల్లిపాది కూలీ పనులు చేస్తూ బతుకుతున్నాం. సర్వేయర్లు భూసర్వే పేరుతో ఇతర రైతులతో డబ్బు తీసుకొని నాకున్న సర్వే నెంబర్‌ 144లో మూడెకరాల పొలాన్ని రికార్డుల్లో లేకుండా మాయం చేశారు. కేవలం 15 సెంట్లు మాత్రమే ఉందని రికార్డుల్లో చూపిస్తున్నారు. బ్యాంకుకు వెళితే.. మీరు రుణం మొత్తం చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగైనా నా భూమిని నాకు ఇప్పించండి.. ఏమి చేయాలో అర్థం కాలేదు.

- సునీత, సూర్యతండా, రైతు

Updated Date - May 21 , 2024 | 12:21 AM