Share News

పోలవరం ముంపుపై రీసర్వే

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:46 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంవల్ల తెలంగాణ ప్రాంతంలోని 34 వాగుల్లోకి వచ్చే బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం ముంపునకు గురవుతుందని..

పోలవరం ముంపుపై రీసర్వే

పీపీఏ సమావేశంలో తెలంగాణ డిమాండ్‌

సాధ్యం కాదని తేల్చిచెప్పిన ఆంధ్రప్రదేశ్‌

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంవల్ల తెలంగాణ ప్రాంతంలోని 34 వాగుల్లోకి వచ్చే బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం ముంపునకు గురవుతుందని.. దీనిని నివారించేందుకు రీసర్వే చేపట్టాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. అది సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి శివ్‌ నందన్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన పీపీఏ సమావేశంలో ఈ వాదనలు కొనసాగాయి. ఈ సమావేశానికి ఏపీ జల వనరుల శాఖ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు సి.నారాయణరెడ్డి, మురళీధర్‌రావు తదితరులు హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణలోని కిన్నెరసాని, మద్దివాడు వంటి 34 వాగుల్లోకి పోలవరం బ్యాక్‌ వాటర్‌ తన్నుకువచ్చే ప్రమాదం ఉన్నదని తెలంగాణ వాదించింది. అందువల్ల తక్షణమే రీసర్వే చేపట్టి, భూసేకరణ, పునరావాస కార్యక్రమాలను అమలుచేయాలని కోరింది. ఇప్పటికే ఈ అంశంపై తాము స్పందించినందున, రీసర్వే అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ తేల్చి చెప్పింది.

పోలవరం నిర్మాణ తీరుపై అసంతృప్తి

పోలవరంలో పనుల ప్రగతిపై పీపీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయినందున, వాటిని పునఃప్రారంభించాలని పీపీఏ కోరింది. పోలవరం ప నులపైనా .. డిజైన్లపైనా కేంద్ర జలశక్తిశాఖ నేరుగా నిపుణులను నియమించుకుంటుందని ఏపీకి పీపీఏ తేల్చి చెప్పింది. వీరంతా తన ఆధీనంలోనే పనిచేస్తారని కూడా వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహణ కోసం రూ.48 కోట్లను తక్షణమే మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఈ ఏడాది జూన్‌తో స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ గడువు పూర్తవుతున్నందున.. నిషేధాన్ని ఎత్తివేయాలని పీపీఏను ఏపీ కోరింది. ఇదే సమయంలో, కేంద్రం పోలవరం ప్రాజెక్టు అంచనాలను సవరించకపోవడం.. పనుల వారీ అంచనాలను నిర్ధేశించకపోవడంపైనా చర్చ జరిగింది.

Updated Date - Jan 30 , 2024 | 02:46 AM