భూములు కొట్టేయాలనే రీ సర్వే
ABN , Publish Date - May 03 , 2024 | 11:56 PM
ఐదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేశారు.. కనీసం గుంతలు పడిన రోడ్లపై పిడికెడు మట్టిఅయినా వేశారా అంటూ బీవీ జయనాగేశ్వరరెడ్డి వైసీపీ నేతలను నిలదీశారు.
టీడీపీ ఎమ్మిగనూరు అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఐదేళ్లలో రోడ్లపై పిడికెడు మట్టివేశారా?
గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల్లో ప్రచారం
560 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక
పట్టణ వార్డుల్లో టీడీపీ శ్రేణుల పర్యటన
ఎమ్మిగనూరు/రూరల్ : రీ సర్వేల పేరుతో రైతుల భూములను వైసీపీ నాయకులు కొట్టేయాలని చూస్తున్నారని టీడీపీ ఎమ్మిగనూరు అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం పెసలదిన్నె, గార్లదిన్నె, పార్లపల్లి, గువ్వలదొడ్డి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో తిరిగి ప్రజలను కలుసుకొని ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పాసుపుస్తకాలపై రైతుల ఫొటోలు కాకుండ ఏకంగా సీఎం జగన్ ఫొటో వేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవరి ఆస్తిపై ఎవరి ఫొటో వేసుకుంటారని మండిపడ్డారు. మరోసారి జగన్ అధికారంలో వచ్చాడంటే రైతులు భూములు కోల్పోవాల్సిందేనని, ఈ విషయాన్ని రైతులు గ్రహించాలని కోరారు.
ఐదేళ్లలో రోడ్లపై పిడికెడు మట్టి వేశారా?
ఎమ్మిగనూరు : ఐదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేశారు.. కనీసం గుంతలు పడిన రోడ్లపై పిడికెడు మట్టిఅయినా వేశారా అంటూ బీవీ జయనాగేశ్వరరెడ్డి వైసీపీ నేతలను నిలదీశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 31వ వార్డు, గోనేగండ్ల మండలం తిప్పనూరు, ఎన్నెకండ్ల, ఎమ్మిగనూరు మండలం ఏనుగబాల, కోటేకల్లు గ్రామాలనుంచి దాదాపు 560 కుటుంబాలు టీడీపీలో చేరారు. బీవీ ఇంటిదగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని 31వ వార్డునుంచి దాదాపు 400 కుటుంబాలు పెద్దఎత్తున ఊరేగింపుగా బీవీ ఇంటిదగ్గరకు చేరుకొని వార్డు ఇన్‌చార్జి దేవేంద్ర, నాయకులు శ్రీనివాసులు, పట్టా నాగరాజుల ఆద్వర్యంలో బీవీ సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో ఆయా వార్డు, గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
వార్డుల్లో ముమ్మర ప్రచారం : పట్టణంలోని 34వార్డుల్లో ఆయా వార్డు ఇన్‌చార్జీలు, మాజీ కౌన్సిలర్లు, కౌన్సిలర్లు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 21వ వార్డులో టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దయాసాగర్, 5వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ రామదాసు గౌడ్, ఆరో వార్డులో రంగస్వామి గౌడ్, 9వ వార్డులో కటారి రాజేంద్ర, 16వ వార్డులో ముల్లా కలీముల్లా, 17వ వార్డులో జయన్న, 27వ వార్డులో తెలుగు యువత అధ్యక్షుడు కృష్ణతేజ నాయడు, ఎస్సీ కాలనీలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సుందరరాజు బీవీ జయనాగేశ్వరరెడ్డి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.
నందవరంలో విస్తృత ప్రచారం
నందవరం: మండలంలోని గురుజాల, కనకవీడు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ సైకిల్ గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేశాయి మాధవరావు, మాజీ వైస్ ఎంపీపీ రఘుమూర్తిస్వామి, ధర్మాపురం గోపాల్, హలహర్విలో రైస్ మిల్ నారాయణరెడ్డి, ముగతిలో భార్గవ్‌యాదవ్ ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రవేశ పెట్టబోయే సూపర్- 6 పథకాల గురించి వివరించారు.