Share News

గామన్‌ బ్రిడ్జికి మరోసారి మరమ్మతులు

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:38 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య ఉన్న గామన్‌ బ్రిడ్జి నెల రోజుల వ్యవధిలో మరోసారి మరమ్మతులకు గురైంది.

గామన్‌ బ్రిడ్జికి మరోసారి మరమ్మతులు

నేటి నుంచి మే 3 వరకు వంతెనపై ఒకవైపే రాకపోకలు

కొవ్వూరు, ఏప్రిల్‌ 25: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య ఉన్న గామన్‌ బ్రిడ్జి నెల రోజుల వ్యవధిలో మరోసారి మరమ్మతులకు గురైంది. మార్చి 24న గామన్‌ బ్రిడ్జి 52వ స్తంభం వద్ద వంతెనకు యాక్షన్‌ ఇచ్చే బాల్‌ మరమ్మతులకు గురి కావడంతో వంతెనపై ఒకవైపు రాకపోకలను నిలుపుదల చేశారు. మరమ్మతులు పూర్తిచేసి సుమారు నెల రోజుల తరువాత ఈ నెల 23న రెండువైపులా వాహన రాకపోకలను అనుమతించారు. అయితే ప్రస్తుతం రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు వచ్చే మార్గంలో 28వ స్తంభం వద్ద అమర్చిన బేరింగ్‌లో ఎటువంటి ప్రేజర్‌ రావడం లేదని గుర్తించారు. దీంతో ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు ఈ మార్గంలో వాహన రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు సమాచారం. బేరింగ్‌ మార్పు చేయడానికి 10 రోజుల పాటు వంతెనపై ఒక మార్గంలోనే వాహన రాకపోకలకు అనుమతించనున్నారు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో నిర్మించిన వంతెనలు వందేళ్లకు పైగా సేవలందించాయి. ఆధునిక సాంకేతికతతో నిర్మించిన గామన్‌ వంతెనపై రాకపోకలు ప్రారంభించిన పదేళ్లకే మరమ్మతులకు గురి కావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 05:38 AM