Share News

బీసీ కార్పొరేషన్‌ పునర్వ్యవస్థీకరణ

ABN , Publish Date - Sep 18 , 2024 | 05:10 AM

బీసీ కార్పొరేషన్‌ను పునర్వ్యవస్థీకరించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

బీసీ కార్పొరేషన్‌ పునర్వ్యవస్థీకరణ

కమ్యూనిటీలవారీగా అభివృద్ధి ప్రణాళికలు

బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో నిర్ణయం

‘డైట్‌’ బకాయిలకు మోక్షం

రూ.110 కోట్ల విడుదలకు ఆమోదం

కాస్మొటిక్‌ చార్జీల బకాయిలు కూడా..

ప్రీ, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులకు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాల విడుదల

ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం పునరుద్ధరణ

బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి 10 కోట్లు

బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు సీఎం ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): బీసీ కార్పొరేషన్‌ను పునర్వ్యవస్థీకరించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కమ్యూనిటీలవారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించనుంది. బీసీ ఉపకులాలవారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు.. వారి వృత్తులు, తలసరి ఆదాయం వంటి వివరాలపై ఆరా తీసేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని నిశ్చయించింది. బీసీ కార్పొరేషన్‌, ఈడబ్ల్యూఎస్‌ శాఖపై మంగళవారమిక్కడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీ సంక్షేమ మంత్రి ఎస్‌.సవిత విలేకరులకు తెలిపారు. గడచిన ఐదేళ్లలో బీసీలు పూర్తిగా చితికిపోయారని.. చంద్రబాబు రాకతో వారికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. జాతీయ బీసీ కార్పొరేషన్‌ నుంచి ఏటా రూ.100 కోట్లు రాబట్టడానికి అవసరమైన మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తామని చెప్పారు. బీసీల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చే విధంగా వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేలా ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్స్‌ను రూపొందిస్తామన్నారు. బీసీ-ఏలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రణాళికకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీసీల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచి పీఎం-విశ్వకర్మ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. చట్ట సభల్లో వారి ప్రాతినిధ్యం పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు సీఎం ఆదేశించారన్నారు. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపై నివేదిక కోరినట్లు చెప్పారు.

కీలక నిర్ణయాలివీ..

గత ప్రభుత్వంలో ఉన్న రూ.110 కోట్ల డైట్‌ చార్జీల బకాయిల విడుదల.

రూ.20.52 కోట్ల కాస్మోటిక్‌ చార్జీల బకాయిలు కూడా.

వసతి గృహాల విద్యార్థులకు వ్యక్తిగతంగా ఇస్తున్న ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్డింగ్‌ మెటీరియల్‌ కోసం రూ.25 కోట్లు.

హాస్టళ్లలో డిజిటల్‌ కంటెంట్‌ విద్యా ప్రమాణాళ పెంపుదలకు ఎస్‌ఆర్‌ శంకరన్‌ రిసోర్స్‌ సెంటర్ల ఏర్పాటు..

ప్రీ-మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్పుల నిమిత్తం కేంద్రం వాటా రూ.133.78 కోట్లతోపాటు రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంటు రూ.89.18 కోట్లు విడుదల.

100 మంది బీసీ విద్యార్థులతో ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌.

ఎన్టీఆర్‌ విదేశీ విద్యా పథకం కింద నాణ్యమైన విదేశీ విద్యా సంస్థల్లో అత్యధిక విద్యార్థులకు అవకాశం కల్పించేలా చర్యలు.

ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం పునరుద్ధరణ.

బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి రూ.10 కోట్లు

చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలులో అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ భవనాల నిర్మాణానికి రూ.8 కోట్లు.

మిగిలిన 23 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన నిర్మాణానికి స్థలాలు గుర్తించి నిర్మాణాలు.

అన్ని బీసీ గురుకుల విద్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు.. ఆర్టీజీఎ్‌సతో అనుసంధానం.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్మాణంలో ఉన్న 4 రెసిడెన్షియల్‌ స్కూళ్ల పూర్తికి 75 కోట్లు. ఈ విద్యాసంవత్సరంలోనే ప్రారంభం.

రాష్ట్రంలో 5 చోట్ల ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ సెంటర్లు.

కులాలవారీగా తలసరి ఆదాయం ఆధారంగా బీపీఎల్‌ కుటుంబాల గుర్తింపు.. వారి ఆర్థికాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక.

గత టీడీపీ ప్రభుత్వంలో 68 కాపు భవనాలకు అనుమతులు మంజూరు. వాటిలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన 2 భవనాల పూర్తికి రూ.2.36 కోట్లు విడుదల. మిగిలిన 66 కాపు భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు.

నీరు-చెట్టు బిల్లులు తక్షణమే చెల్లించండి

అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు పథకం కింద రైతులకు చెల్లించాల్సిన రూ.256 కోట్లను తక్షణమే చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ పథకంలో పెండింగ్‌ బిల్లులన్నింటినీ విడతల వారీగా విడుదల చేయాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నీరు-చెట్టు కార్యక్రమంపై మంగళవారం ఆయన వెలగపూడి సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్‌ బిల్లులపై ఆర్థిక, జల వనరుల శాఖ అధికారుల నుంచి సమాచారం కోరారు. కాగా, నీరు-చెట్టు బిల్లులపై సీఎం ప్రకటనను సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు స్వాగతించారు. జగన్‌ నాడు బిల్లులు చెల్లించకుండా రైతులను నానా అగచాట్లకు చేశారని, కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో వాటికి మోక్షం కలిగిందన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 05:10 AM