Share News

తీవ్ర తుఫాన్‌గా రీమల్‌

ABN , Publish Date - May 27 , 2024 | 04:09 AM

ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్‌ రీమల్‌ మరింత బలపడి ఆదివారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారింది.

తీవ్ర తుఫాన్‌గా రీమల్‌

పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ దిశగా పయనం.. అర్ధరాత్రి మంగ్లా వద్ద తీరం దాటే అవకాశం

ఓడరేవుల్లో 2వ నంబరు భద్రతా సూచిక ఎగురవేత

ఏపీలో పెరిగిన వేడి.. నేడు, రేపు తీవ్ర ఎండలు

ఉత్తర భారతంలో తీవ్ర ఎండలు, వడగాడ్పులు

విశాఖపట్నం, అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్‌ రీమల్‌ మరింత బలపడి ఆదివారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఈ క్రమంలో గడచిన ఆరు గంటల్లో గంటకు 13 కి.మీ. వేగంతో ఉత్తరంగా పయనించి ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నానికి తీవ్ర తుఫాన్‌ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌కు చేరువ కావడంతో ఆ ప్రాంతంలో గంటకు 95 నుంచి 105 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పెనుతుఫాన్‌ ఉత్తరంగా పయనించి ఆదివారం రాత్రి 11.30 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట మధ్య సాగర్‌దీవులు (పశ్చిమబెంగాల్‌), కేపుపురా (బంగ్లాదేశ్‌) మధ్యన మంగ్లాకు అతి చేరువలో తీరం దాటనుంది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 110 కి.మీ నుంచి 120 వరకూ, అప్పుడప్పుడూ 135 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు. కాగా, తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని ప్రధాన ఓడరేవుల్లో ఆదివారం రెండవ నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. తుఫాన్‌ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కాగా, రీమల్‌ తుఫాన్‌ ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పాడ బీచ్‌ర ోడ్డు నుంచి కాకినాడ వెళ్లే వివిధ వాహనాల రాకపోకలను నియంత్రించారు. కాకినాడ వెళ్లే ప్రయాణికులను గోర్స, పండూరు, పిఠాపురం మీదుగా చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బంగ్లాలో లక్ష మందికిపైగా శిబిరాలకు

రీమల్‌ తీవ్ర తుఫాను నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని తీరప్రాంత గ్రామాల నుంచి లక్షా 15 వేల మందిని సురక్షిత శిబిరాలలోకి తరలించారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 130 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అధికారులు అత్యున్నతస్థాయి తుఫాను ప్రమాద హెచ్చరికను జారీచేశారు. బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాల్లో అత్యధిక గ్రామాలు సముద్ర మట్టానికి ఒకటి లేదా రెండు మీటర్ల ఎత్తులోనే ఉంటాయి. దీంతో ఎత్తయిన ఉప్పెనలు ఆ గ్రామాలను తుడిచి పెట్టేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ముప్పు అంచున ఉన్న ప్రజలందరినీ తుఫాను షెల్టర్లలోకి తరలించాలని ఆదేశించామని బంగ్లాదేశ్‌ విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి కమ్ముల్‌ హసన్‌ తెలిపారు. సుమారు 4 వేల తుఫాను షెల్టర్లు సిద్ధం చేశామన్నారు.

తుఫాను సహాయక చర్యలపై మోదీ సమీక్ష

రీమల్‌ తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలు, సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ తీవ్ర తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాలు, కోల్‌కతాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటలపాటు విమాన సర్వీసులను నిలిపివేసినట్టు కోల్‌కతా విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు పలు రైళ్లను రద్దు చేశారు. సుందర్‌బన్స్‌, సాగర్‌ ద్వీపం ప్రాంతాల నుంచి సుమారు 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎ్‌ఫకు చెందిన 16 బెటాలియన్లను తీర ప్రాంతాల్లో మోహరించినట్టు తెలిపారు.

ఏపీలో పెరిగిన ఎండ తీవ్రత

భూ ఉపరితలం నుంచి తీవ్ర తుఫాన్‌ దిశగా గాలులు ప్రయాణిస్తున్నందున దేశంలో వాయవ్య, మధ్య, ఉత్తర, తూర్పు భారతంతోపాటు దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగింది. పలుచోట్ల మేఘాలు ఆవరించినా వేడి వాతావరణానికి ప్రజలు ఉడికిపోయారు. సోమ, మంగళవారాలు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదుకానున్నాయి. ఎండ తీవ్రతతో పాటు పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. కాగా ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. కాగా, ఆదివారం ఇబ్రహీంపట్నంలో 40.9 డిగ్రీలు, నరసరావుపేటలో 40.8, కనిగిరిలో 40.7, నాయుడుపేటలో 40.6, తుని, కంకిపాడులో 40.5, పెదవేగిలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండతీవ్రత, వడగాడ్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ హెచ్చరించారు.

ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి

ఉత్తర భారతాన్ని వేడి వాతావరణం, వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఫలోడిలో ఆదివారం కూడా 50 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్‌లో ఐదేళ్ల తర్వాత ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటడం ఇదే తొలిసారి. 2019లో జూన్‌ 1న రాజస్థాన్‌లోని చురులో 50.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు ప్రభావం చూపాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలోని కొండ ప్రాంతాలపై విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బెహర్‌లో 40.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, అసోంలోని లుండింగ్‌లో 43, సిల్చార్‌లో 40, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో 40.5 డిగ్రీల ఆల్‌టైమ్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని బర్మర్‌లో 48.8, జైసల్మేర్‌లో 48, బికనీర్‌లో 47.2 డిగ్రీలు నమోదయ్యాయి. ఢిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 29 వరకు తీవ్రమైన వేడి వాతావరణ కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు ‘రెడ్‌’ హెచ్చరికలు జారీ చేశారు.

అకోలాలో 144 సెక్షన్‌

మహారష్ట్రలోని అకోలా నగరంలో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఐఎండీ గణాంకాల ప్రకారం విదర్భ ప్రాంతంలోని అకోలా నగరంలో శుక్రవారం 45.8, శనివారం 45.6 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇక్కడ ఇదే అత్యధికమని ఐఎండీ తెలిపింది. పెరిగిన ఎండలు, వడగాలుల తీవ్రత నేపథ్యంలో ఈనెల 31 వరకు నగరంలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ అజిత్‌ కుంభర్‌ వెల్లడించారు.

Updated Date - May 27 , 2024 | 04:09 AM