చంద్రబాబును మందలించండి
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:08 AM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రం అబద్ధాలమయమని, అదో తప్పుడు పత్రమని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు.

బడ్జెట్‌లో అప్పులపై వక్రీకరణ
గవర్నర్ నజీర్‌కు వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రం అబద్ధాలమయమని, అదో తప్పుడు పత్రమని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. తన జమానాలో అప్పులు రూ.7.48 లక్షల కోట్లేనని, కానీ 14 లక్షల కోట్లంటూ చంద్రబాబు ప్రచారం చేశారని, గవర్నర్ ప్రసంగంలో రూ.10లక్షల కోట్లంటూ పేర్కొన్నారని తెలిపారు. ఈ మేరకు శనివారం గవర్నర్ నజీర్‌కు లేఖ రాశారు. అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్‌తో అబద్ధాలు ధర్మమేనా? అంటూ.... అబద్ధాలు చెప్పించిన చంద్రబాబును మందలించాలని లేఖలో కోరారు. 2019 మేలో తాను అధికారంలోనికి వచ్చేనాటికి ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని, అయినా రూ.2.27 లక్షల కోట్లతో 2019-20 పూర్తి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టానని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారపగ్గాలు చేపట్టేనాటికి ఖజానాలో ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్నా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఏమిటని జగన్ సందేహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడితే గత ప్రభుత్వం చేసిన అప్పులపై వాస్తవాలు భయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో క్యాలెండర్‌ను విడుదల చేస్తూ అర్హులందరికీ పథకాలు అందించామని తెలిపారు. ధర్మం వైపు నిలబడాలని గవర్నర్ నజీర్‌కు తన లేఖలో జగన్ కోరారు.