కోడ్‌కు ఒక్కరోజు ముందు రామ్‌కోకు రాసిచ్చారు
ABN , Publish Date - Apr 16 , 2024 | 03:11 AM
సుదీర్ఘకాలంగా ప్రభుత్వానికి, ప్రైవేటు సిమెంట్ కంపెనీకి మధ్య న్యాయపోరాటం జరుగుతోంది. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు తేలేవరకు పోరాటం చేస్తే విజయం ప్రభుత్వానిదా.. కార్పొరేట్
జగ్గయ్యపేటలో 267 ఎకరాల్లో సున్నపురాయి నిల్వలు
సిమెంట్ కంపెనీకి సంతర్పణ
చేసిన జగన్ సర్కారు
20 ఏళ్లు కాదు.. ఏకంగా 50 ఏళ్లపాటు లీజు
మార్చి 15న రహస్య జీవో
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సుదీర్ఘకాలంగా ప్రభుత్వానికి, ప్రైవేటు సిమెంట్ కంపెనీకి మధ్య న్యాయపోరాటం జరుగుతోంది. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు తేలేవరకు పోరాటం చేస్తే విజయం ప్రభుత్వానిదా.. కార్పొరేట్ సిమెంట్ కంపెనీదా... అని తేలిపోతుంది. కానీ, కంపెనీ ఒక ప్రతిపాదన చేసిందని, దాని ప్రకారం నడుచుకుందామని ఓ న్యాయ సలహా తీసుకున్న వైసీపీ సర్కారు... ఎన్నికల కోడ్ రావడానికి సరిగ్గా 24 గంటల ముందు రామ్‌కో సిమెంట్ కంపెనీకి తగిన మేలు చేసిపెట్టింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో సున్నపురాయి నిల్వలున్న 267.30 ఎకరాల భూమిని ఆ కంపెనీకి కట్టబెట్టింది. 50 ఏళ్లపాటు సుదీర్ఘకాలం లీజు ప్రాతిపదికన ఆ భూములు కట్టబెడుతూ మార్చి 15న గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో ఉత్తర్వులు ఇప్పించింది. ఆ మరుసటి రోజు.. అంటే మార్చిన 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. లీజు విధానాలు ఏమిటో, ఏ ప్రాతిపదికన సున్నపురాయి ఉన్న భూములను కట్టబెడుతున్నారో వివరించకుండానే సర్కారు మార్చి 15న జీవో 36ను విడుదల చేసింది. దీన్ని ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచింది.
ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో రామ్‌కో సిమెంట్ పరిశ్రమ ఉంది. అక్కడ ఆ సంస్థకు సున్నపురాయి నిల్వలున్నాయి, 2008లో మద్రాస్ సిమెంట్స్‌కు జయంతిపురంలో సున్నపురాయి నిల్వలున్న 273.91 ఎకరాల భూమిని మెమో ఆధారంగానే కేటాయించారు. ఇందులో 121.97 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 151.94 ఎకరాలు పట్టా భూమి. 2016లో నాటి ప్రభుత్వం ఆ సంస్థకు ఇచ్చిన భూమిని 267.30 ఎకరాలకు పరిమితం చేసింది. కానీ, నాటి మద్రాస్ సిమెంట్స్ తన పేరును రామ్‌కో సిమెంట్స్‌గా మార్చుకుంది. కంపెనీకి ఇచ్చిన లీజులపై 2017లో నాటి ప్రభుత్వం సవరించిన మైనింగ్‌ప్లాన్‌ను ఆమోదించింది. ఆ తర్వాత భూ కేటాయింపులు, ఇత ర అంశాలపై విబేధాలు రావడంతో ఆ సంస్థ ఇటు హైకోర్టులో, అటు సుప్రీం కోర్టులో కేసులు వేసింది. ఇప్పటికీ ఆ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తమ మైనింగ్ అప్లికేషన్‌ను ఆమోదిస్తే సుప్రీం, హైకోర్టుల్లో ఉన్న కేసులను వెనక్కి తీసుకుంటామని రామ్‌కో ప్రతిపాదించింది. దీనిపై సర్కారు న్యాయ సలహా తీసుకుంది. న్యాయ సలహా ఏమొచ్చిందో కానీ, రామ్‌కో సిమెంట్స్ మైనింగ్ ప్లాన్‌ను ఆమోదించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. తొలుత ప్రతిపాదించినట్లుగా 20 ఏళ్లు కాదు... ఏకంగా 50 ఏళ్లకు లీజు ప్రతిపాదికన క్యాప్టీవ్ మైనింగ్‌కు అనుమతివ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఇదంతా గతేడాది ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లోనే జరిగిపోయింది. కానీ, ఎన్నికల కోడ్ రావడానికి సరిగ్గా 24 గంటల ముందు రామ్‌కోకు 5 ఏళ్లపాటు క్యాప్టీవ్ ప్రతిపాదికన సున్నపురాయి లీజులు ఇస్తూ ఉత్తర్వులు (జీవో-36) ఇచ్చింది.
తెరవెనక ఏం జరిగింది..?
రామ్‌కో సిమెంట్స్‌కు అనుకూలంగా వచ్చిన న్యాయ సలహాను జతచేసి మైనింగ్ ప్లాన్ అనుమతించాలని, 267.30 ఎకరాల్లోని సున్నపురాయి నిల్వలను లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ తగిన నిర్ణయం తీసుకోవాలని గనులశాఖ డైరెక్టర్ గతేడాది ఆగస్టు, సెప్టెంబరులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి సర్కారు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ, అనూహ్యంగా కోడ్‌కు ఒకరోజు ముందు గనుల శాఖ ప్రతిపాదనలను ఆమోదించారు. కోడ్ కు ఒక్కరోజు ముందే ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు...? తెరవెనుక ఏం జరిగింది..? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వ పెద్దలతోపాటు, గనుల శాఖలో ప్రత్యేక అధికారి చక్రం తిప్పినట్లు తెలిసింది.