Share News

పోలీసుల నోటీసులపై హైకోర్టుకు రమణదీక్షితులు

ABN , Publish Date - Mar 08 , 2024 | 03:40 AM

తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకులు

పోలీసుల నోటీసులపై హైకోర్టుకు రమణదీక్షితులు

వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన కోర్టు

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు దాఖలు చేసిన పిటిషన్‌ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఆదేశాలిచ్చారు. శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారుల ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీటీడీ ఐటీ శాఖ జీఎం సందీ్‌పరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమణదీక్షితులపై తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీహెచ్‌ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇవ్వలేరని పేర్కొన్నారు. ఆయన వయసు 76 ఏళ్లు అని, 65ఏళ్లు దాటిన నిందితులను ఇంటి వద్దే విచారించాలని నిబంధనల్లో స్పష్టంగా ఉందని వివరించారు.

Updated Date - Mar 08 , 2024 | 08:27 AM