Share News

రాష్ట్రంలో ‘రాజ్యసభ’ వేడి

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:14 AM

రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఏకగ్రీవంగా జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి పోటీ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

రాష్ట్రంలో ‘రాజ్యసభ’ వేడి

3 స్థానాలకు వచ్చే నెల 27న పోలింగ్‌

అన్నీ గెలుచుకోగల బలం ఉన్నా వైసీపీ పెద్దల్లో భయం

పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడమే కారణం

వారు పార్టీ అభ్యర్థులకు ఓటేయరేమోనని ఆందోళన

సానుకూలంగా మలచుకునేందుకు టీడీపీ పావులు

వైసీపీ అసంతృప్తులతో మంతనాలు.. ఇది తెలిసి ‘అనర్హత’

అస్త్రంతో టీడీపీ బలం తగ్గించేందుకు వైసీపీ యత్నాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఏకగ్రీవంగా జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి పోటీ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వైసీపీలో అంతర్గత సంక్షోభాన్ని ఆసరా చేసుకొని ఒక సీటు కైవసం చేసుకోవడానికి కోసం టీడీపీ పావులు కదుపుతోంది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవడానికి అధికార పక్షం తిప్పలు పడుతోంది. ఈసారి రాష్ట్రం నుంచి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రిటైరయ్యారు. వారి స్ధానాలకు ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్‌ వెలువడింది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరుగుతుంది. అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా ఈ మూడు సీట్లను వైసీపీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. కానీ కొందరు సిటింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడం, కొందరు ఎమ్మెల్యేలను వేరే చోటకు మార్చడం వంటి కారణాలతో ఆ పార్టీలో అసమ్మతి తీవ్రరూపం దాల్చింది. కనీసం 40-50 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో కొందరికి ఇప్పటికే ఈ విషయం చెప్పేశారు. వీరిలో కొందరు వేరే పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులకు ఈ ఎమ్మెల్యేలు ఎంత మంది ఓట్లు వేస్తారన్నది ఉత్కంఠగా మారింది. వైసీపీ అధినాయకత్వం తమ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు చేజారకుండా చూసుకుని మూడు సీట్లనూ గెలిపించే బాధ్యతను టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించింది. ఆయన కూడా ఒక అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఆయన కొద్ది రోజులుగా అసమ్మతి ఎమ్మెల్యేలను దువ్వుతున్నారు.

ఆళ్ల ఓటు కోసం..

వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం.. సుబ్బారెడ్డి ఇటీవల తమ పార్టీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రె్‌సలో చేరిన ఆయన సోదరుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి ఓటేసేలా చూడాలని కోరారు. ఆయన తన మాట వినే పరిస్థితి లేదని, షర్మిలతో మాట్లాడితే రావచ్చని ఎంపీ బదులిచ్చినట్లు తెలిసింది. షర్మిలతో మాట్లాడతానని సుబ్బారెడ్డి ఆయనతో అన్నట్లు వినవస్తోంది. అలాగే.. రాయలసీమలో టికెట్‌ ఇవ్వని ఒక ఎమ్మెల్యేకు సుబ్బారెడ్డి ఫోన్‌ చేయగా.. ఆయన జగన్‌ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌తో టికెట్‌ హామీ ఇప్పిస్తేనే తాను పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తానని, లేకపోతే లేదని మరో ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. ఈ పరిణామాలను టీడీపీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో ఉంది. ఒక స్థానానికి పోటీ పెట్టి వైసీపీ అసమ్మతుల మద్దతుతో గెలుచుకోవడం సాధ్యమేనా అన్న కోణంలో కసరత్తు చేస్తోంది. ‘వైసీపీ 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. వారిలో సగం మంది మాకు వేసినా ఒక రాజ్యసభ సీటు మాకు వస్తుంది. వచ్చే ప్రభుత్వం మాదే నని ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది. అందుకే మేం మాట్లాడుతుంటే సానుకూల స్పందన కనిపిస్తోంది’ అని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. టీడీపీ ప్రయత్నాలను గమనించిన వైసీపీ నాయకత్వం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో ఓడిన విషయాన్ని గమనంలో ఉంచుకుని.. అసెంబ్లీలో టీడీపీ బలాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మూడేళ్ల కిందట ఎమ్మెల్యే పదవికి ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఆయన రాసిన లేఖను ఆకస్మికంగా ఇప్పుడు బయటకు లాగి.. ఆయనకు సమాచారం ఇవ్వకుండానే ఆమోదించేశారు. వైసీపీ నుంచి టీడీపీ వైపు మారిన నలుగురు ఎమ్మెల్యేలపై ఆగమేఘాలపై అనర్హత వేటు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో మాత్రం ఇంత వేగం కనిపించడం లేదు. వారు తమ వాదన వినిపించుకోవడానికి సమయం ఇస్తున్నామనే పేరుతో వాయిదాలు వేస్తున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 06:49 AM