Share News

‘నైరుతి’లో వానలే వానలు..!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:20 AM

కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాల సీజన్‌ (జూన్‌ నుంచి సెప్టెంబరు)లో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని

‘నైరుతి’లో  వానలే వానలు..!

  • ఈ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

  • దీర్ఘకాలిక సగటులో 106% నమోదయ్యే అవకాశం

  • ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య భారతంలో అధిక వర్షపాతం

  • తూర్పు, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువ..

  • భారత వాతావరణ శాఖ తొలిదశ దీర్ఘకాలిక అంచనా

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాల సీజన్‌ (జూన్‌ నుంచి సెప్టెంబరు)లో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని తెలిపింది. దీర్ఘకాలిక సగటులో 106 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. నాలుగు నెలల నైరుతి రుతువనాల సీజన్‌కు సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తొలిదశ దీర్ఘకాలిక అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల దీర్ఘకాలిక సగటు (1971 నుంచి 2020 వరకు 87 సెంటీమీటర్లు)లో 106 శాతం (ఐదు శాతం అటు ఇటుగా) నమోదవుతుందని అంచనా వేసింది. దేశంలో దక్షిణ, మధ్య, పశ్చిమ, ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని, తూర్పు భారతంలో ఒడిశా, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌తోపాటు ఈ రాష్ట్రాలకు ఆనుకుని దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌, విదర్భ, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం, ఈశాన్య భారతంలో అనేక ప్రాంతాలు, జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని, రైస్‌ బెల్ట్‌గా పిలిచే గంగా మైదానంలో వర్షాలు తక్కువగా కురుస్తాయని ఐఎండీ నివేదిక స్పష్టం చేసింది. కాగా.. తాజా నివేదికపై సవరించిన బులెటిన్‌ను వచ్చే నెల చివరి వారంలో విడుదల చేయనుంది.

బలహీనపడిన ఎల్‌నినో

ఎల్‌నినో ప్రభావంతో గతేడాది నైరుతి సీజన్‌లో 868.6 మిల్లీమీటర్లకుగాను 820 మి.మీ. వర్షపాతం నమోదుతో అనేక ప్రాంతాల్లో పంటల దిగుబడి తగ్గింది. జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అయితే మధ్య పసిఫిక్‌ మహాసముద్రంలో గతేడాది చివరిలో సూపర్‌ ఎల్‌నినో ఈ ఏడాది తొలి రెండు నెలల వరకు సాగి తర్వాత క్రమేపీ బలహీనపడింది. తాజా మోడళ్ల మేరకు మధ్యపసిఫిక్‌ సముద్రంలో ఎల్‌నినో బలహీనపడిందని, వచ్చే నెలాఖరుకల్లా తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని, నైరుతి సీజన్‌ రెండో భాగం (ఆగస్టు-సెప్టెంబరు)లో లానినా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంకా హిందూమహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ (ఐవోడీ) రుతుపవనాల సీజన్‌ చివరికల్లా పాజిటివ్‌గా మారనుంది. గత మూడు నెలల కాలంలో ఉత్తరార్ధ గోళంలో మంచు సాధారణం కంటే తక్కువగా కురిసింది. ఎల్‌నినో బలహీనపడడం, ఐవోడీ తటస్థం నుంచి పాజిటివ్‌ దిశగా మారడం, యురేషియాపై మంచు కవచం తక్కువగా ఉండడం వంటివి నైరుతి రుతుపవనాల సీజన్‌కు సానుకూలంగా పేర్కొంటున్నారు. కాగా, ఎల్‌నినో తర్వాత వచ్చే లానినా సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ శాఖ వద్ద ఉన్న వివరాల మేరకు 1951 నుంచి 2023 వరకు తొమ్మిది పర్యాయాలు ఎల్‌నినో తర్వాత లానినా ఏర్పడిన సంవత్సరాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఇదిలావుండగా నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ వారం క్రితమే తొలి అంచనా నివేదిక విడుదల చేసింది.

ఎక్కువ వర్షపాతానికే అవకాశాలెక్కువ..

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకు అవకాశాలు అధికంగా ఉండగా, లోటు వర్షపాతానికి అతి తక్కువ అవకాశాలున్నాయి. వర్షాలకు సంబంధించి అంచనా నివేదిక (ఫోర్‌కాస్ట్‌ ప్రాబబిలిటీ) ప్రకారం సాధారణం కంటే అత్యంత ఎక్కువ వరర్షపాతం నమోదయ్యేందుకు 30 శాతం, సాధారణం కంటే ఎక్కువగా 31 శాతం, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం 29 శాతం ఉంది. సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం 8 శాతం, లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం కేవలం 2 శాతంగా ఉందని ఐఎండీ విశ్లేషించింది. క్లైమటాలజీకల్‌ ప్రాబబిలిటీ ప్రకారమైతే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం 33 శాతం, సాధారణం కంటే తక్కువ నమోదుకు 17 శాతం, లోటు వర్షపాతం నమోదుకు 16 శాతం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకు 16 శాతం, అతిగా వర్షాలు కురిసేందుకు 17 శాతం అవకాశం ఉందని వివరించింది.

శ్రీకాకుళం మినహా రాష్ట్రంలో మంచి వర్షాలు

గతేడాది తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్న రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది మంచి వర్షాలు కురవనున్నాయి. ఒడిశాకు ఆనుకుని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ప్రాంతం తప్ప రాష్ట్రంలో కోస్తా, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. నైరుతి సీజన్‌లో ఒడిశా, దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయని, బహుశా ఆ ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలకు బంగాళాఖాతం అత్యంత కీలకం. సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు/వాయుగుండాలు ఒడిశా, పశ్చిమబెంగాల్‌ మీదుగా తూర్పు, మధ్య భారతం అక్కడ నుంచి వాయవ్య భారతం వైపుగా పయనించడంతో వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది నైరుతి సీజన్‌లో ఒడిశా, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో తూర్పుభాగం, దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌లలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ తాజా బులెటిన్‌ స్పష్టం చేయడంపై వాతావరణ నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ ఏడాది నైరుతి సీజన్‌లో బంగాళాఖాతం బలహీనం కానుందా..? అల్పపీడనాలు/వాయుగుండాల పరంపర తక్కువగా ఉంటుందా..? లేక బంగాళాఖాతంలో మాన్‌సూన్‌ తీవ్రత తగ్గుతుందా..? అన్న సందేహాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఒకవేళ అల్పపీడనాలు, వాయుగుండాలు బంగాళాఖాతం ముఖ ద్వారం గుండా ఉత్తరాది వైపు పయనిస్తాయా? అని సందేహం వ్యక్తంచేశారు. కాగా తాజా బులెటిన్‌ పరిశీలిస్తే.. ఈ ఏడాది అరేబియా సముద్రం మరింత బలపడి పశ్చిమ భారతం, దానికి ఆనుకుని మధ్య, దక్షిణ భారతంలో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 03:20 AM