Share News

రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:06 AM

బీసీ సంఘం నాయకుడు, ఏపీలోని వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. సోమవారమే రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి

రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా

చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆమోదం

రాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలం

జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా కృష్ణయ్య?

అమరావతి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బీసీ సంఘం నాయకుడు, ఏపీలోని వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. సోమవారమే రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేయగా.. మంగళవారం ఆయన ఆమోదం తెలిపారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేశారు. వైసీపీ నుంచి ఇటీవల రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌ రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు. దీంతో, వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11 నుంచి ఎనిమిదికి తగ్గింది.


జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా కృష్ణయ్య?

హైదరాబాద్‌: ఆర్‌.కృష్ణయ్య తదుపరి అడుగు చర్చనీయాంశమైంది. ఆయన్ను మోదీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీసీల హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని రెండ్రోజుల కిందట జరిగిన సమావేశంలో పలు బీసీ సంఘాలు ఆయన్ను కోరాయి. అంతకుముందే బీజేపీ జాతీయ అగ్ర నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీసీ ఓటుబ్యాంకు మరింత పెంచుకోవచ్చన్న అంచనాల్లో భాగంగా వారు ఆయనతో చర్చించినట్లు చెబుతున్నారు. కృష్ణయ్య జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, ర అమిత్‌ షా స్వయంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆయన్ను జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమిస్తారనడానికి సంకేతాలని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Sep 25 , 2024 | 04:06 AM