Share News

ఉద్యోగం మానేసి మాతో తిరగండి!

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:06 AM

ఎన్నికల విధులు, పింఛన్లు, సంక్షేమ పథకాల పంపిణీకి దూరమైన వలంటీర్లను వైసీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు.

ఉద్యోగం మానేసి మాతో తిరగండి!

నెలకు రూ.15 వేలు.. అంతకంటే ఎక్కువే ఇస్తాం

‘తూర్పు’న వలంటీర్లకు వైసీపీ నేతల ప్రలోభాలు

పెన్షన్‌దారులను సచివాలయాలకు తీసుకురండి

వలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆదేశం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఎన్నికల విధులు, పింఛన్లు, సంక్షేమ పథకాల పంపిణీకి దూరమైన వలంటీర్లను వైసీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.5వేల గౌరవ వేతనం కంటే ఎక్కువ ఇస్తామని, రాజీనామా చేసి తమ వెంట తిరగాలని ఒత్తిడి తెస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లో ఉద్యోగం మానేసి తమ కూడా ప్రచారం చేస్తే నెలకు రూ.15వేలు ఇస్తామని, అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇస్తామని, మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తామని కూడా చెబుతూ ఒకవైపు ఒత్తిడి, మరోవైపు ప్రలోభాలు పెడుతూ వలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత పోస్టు పెట్టిన వలంటీర్‌పై కేసు నమోదైంది. ‘‘శభాష్‌ చంద్రన్న.. నీ టాలెంట్‌ ఉపయోగించి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛనుఆపగలిగావు. దాని పర్యవసానం అనుభవిస్తావు’’ అంటూ నల్లజర్ల మండలం కవులూరు గ్రామ సచివాలయం క్లస్టర్‌-1కు చెందిన వలంటీర్‌ జాలాది శ్రీనివాసరావు తన పరిధిలోని 50 కుటుంబాలకు చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో గతనెల 31న పోస్టు పెట్టాడు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. వలంటీర్‌ శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించినట్టు ఎంసీసీ నోడల్‌ అధికారి, ఎంపీడీవో నరే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ‘పింఛనుదారులను వలంటీర్లే సచివాలయాల వద్దకు ఆటోల్లో తీసుకురావాలి. ఆటో ఖర్చులు మనం మనం చూసుకుందాం’... అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పంపిన వాయిప్‌ మెసేజ్‌ లీకయింది. పింఛనుదారులను తీసుకువచ్చి మళ్లీ వారు ఇంటి వద్దకు చేరేవరకు వలంటీర్లే బాధ్యత వహించాలంటూ ఆయన చెప్పిన ఆడియో హల్‌చల్‌ చేస్తోంది. ఎమ్మెల్యే పేర్ని ఒత్తిడితో 860మంది వలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. తన కుమారుడిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే తమను బలిపశువుల్ని చేశారని, వలంటీర్లతో రాజీనామా చేయించడం వెనుక కుట్ర దాగి ఉందని వారు వాపోతున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 07:49 AM