Share News

ప్రశ్నోత్తరాలు ఎలాగూ ఉండవ్‌.. ఓటాన్‌ అకౌంట్‌కు 4 రోజులు చాలవా?

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:55 AM

ప్రశ్నోత్తరాలు ఎలాగూ ఉండవు.. పూర్తి బడ్జెట్‌ సమావేశాలు కావు.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్టేగా.. నాలుగు రోజులు చాలవా..?

ప్రశ్నోత్తరాలు ఎలాగూ ఉండవ్‌.. ఓటాన్‌ అకౌంట్‌కు 4 రోజులు చాలవా?

బీఏసీలో సీఎం జగన్‌ ప్రశ్న.. చాలన్న మంత్రులు

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘ప్రశ్నోత్తరాలు ఎలాగూ ఉండవు.. పూర్తి బడ్జెట్‌ సమావేశాలు కావు.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్టేగా.. నాలుగు రోజులు చాలవా..? మనం ముందు మూడు రోజులనుకున్నాం. ఒక రోజు అదనంగా ఎనిమిదో తేదీ దాకా పెడతాం. సమయం సరిపోతుందిగా’ అని సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులను అడిగారు. వారు కూడా చాలని ముక్తాయించడంతో గురువారం (8వ తేదీ) వరకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించాక.. సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమైంది. సభానాయకుడు జగన్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, వైసీపీ అసెంబ్లీ సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. ప్రతిపక్షం సీటు వైపు జగన్‌ చూసినప్పుడు.. బీఏసీ భేటీని టీడీపీ బాయ్‌కాట్‌ చేసిందని మంత్రులు చెప్పారు. ఆ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండే నిమిషాల్లో బీఏసీ భేటీ ముగిసింది. ఆమోదించిన ఎజెండా ప్రకారం.. మంగళవారం ఉదయం సభలో సంతాప తీర్మానాలు ఉంటాయి. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. చర్చ తర్వాత మధ్యాహ్నం సీఎం సమాధానమిస్తారు. ఇక బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రి బుగ్గన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడుతుంది. గురువారం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. బుగ్గన సమాధానం ఇస్తారు. అనుబంధ పద్దులపై ఓటింగ్‌ జరుగుతుంది. తర్వాత 2024-25 ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెడతారు. మూజువాణి ఓటుతో దానిని సభ ఆమోదిస్తుంది.

Updated Date - Feb 06 , 2024 | 03:55 AM