Share News

Purandheshwari : బాబు- పవన్‌తోనే వెళ్దాం!

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:25 AM

జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఇటువంటి అవినీతి, అరాచక పాలనకు మంగళం పాడాలంటే పొత్తు ఉండాల్సిందే..

Purandheshwari : బాబు- పవన్‌తోనే వెళ్దాం!

ఒంటరి పోరుతో సీట్లు రావు!!

మెజారిటీ కమలనాథుల మనోగతం

కోర్‌ కమిటీ భేటీకి 40 మంది హాజరు

శివప్రకాశ్‌తో నాదెండ్ల మనోహర్‌ భేటీ

అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఇటువంటి అవినీతి, అరాచక పాలనకు మంగళం పాడాలంటే పొత్తు ఉండాల్సిందే.. మన మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ అటు వెళ్లిపోయారు.. మనం ఒంటరిగా వెళ్తే కాసిన్ని ఓట్లు పెరగొచ్చేమోగానీ సీట్లు రావడం కష్టమే’ అని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో రాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ సమావేశమైంది. దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహా సుమారు 40 మంది కీలక నేతలు హాజరయ్యారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది.. జనం ఎటు మొగ్గు చూపుతున్నారు.. టీడీపీ-జనసేన కలిసి వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయి.. బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి.. అనే అంశాలపై చర్చ జరిగింది. ఎవరికి వారు పరిస్థితులు వివరించగా.. అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని శివప్రకాశ్‌ సూచించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెజారిటీ నేతలు టీడీపీ-జనసేనతో బీజేపీ జట్టుకడితేనే మంచి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసినట్లు జాతీయ స్థాయిలో సర్వేలు నిర్వహించే ఒక ప్రజాప్రతినిధి.. పొత్తు ఉంటేనే సీట్లు వస్తాయనగా..

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మరికొందరు సమర్థించినట్లు తెలిసింది. గోదావరి జిల్లాలకు చెందిన ఓ నాయకుడు మాట్లాడుతూ.. ‘పొత్తుతో పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లే పదవులు పొందుతారు.. ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ల పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది’ అని అన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘పార్టీల్లో చేరికలు ప్రతి చోటా ఉంటాయి.. మీకు చేతనైతే మమ్మల్నెందుకు చేర్చుకుంటారు’ అని అనడం సమావేశంలో వేడి పెంచింది. కాగా.. వైసీపీ-బీజేపీ ఒక్కటేననే భావన ప్రజల్లో పోగొట్టకపోతే.. జగన్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీపైనా ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. తమిళనాడులో ఇసుక అక్రమాలు, ఢిల్లీలో లిక్కర్‌ లాబీపై చర్యలు తీసుకున్న కేంద్రం.. ఏపీలో ఆ రెండింటిపై విచారణకు వేయకుంటే ప్రజల్లోకి ఎటువంటి సంకేతం వెళ్తుందని ఒక నాయకుడు ప్రశ్నించారు. అనంతరం పురందేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ.. పొత్తులతో పాటు చాలా అంశాలపై చర్చించామని, తుది నిర్ణయం అధిష్ఠానం తీసుకుంటుందని చెప్పారు. షర్మిల ఏ పార్టీలో చేరినా బీజేపీకి అనవసరమన్నారు. సత్యకుమార్‌, మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మాతో పొత్తు పెట్టుకోవాలనుకునే వాళ్లు మా అగ్ర నాయకత్వాన్ని కలిసి చర్చించాలి. దేశంలో బీజేపీ బలమైనదే గానీ ఈ రాష్ట్రంలో బలహీన పార్టీ కదా..! బలవంతుల చేతులూ కలిస్తేనే కదా ఉపయోగం.. ఒక చేత్తోనే సాధ్యం కాదుగా..’ అని వ్యాఖ్యానించారు.

మేధావి అన్నకు మేధావి చెల్లెలు

మణిపూర్‌ హింసపై షర్మిల వ్యాఖ్యలపై సత్యకుమార్‌ ఘాటుగా స్పందించారు. ‘మేధావి అన్నకు మేధావి చెల్లెలు.. పాదాలపై నడిచేదే పాదయాత్ర అని చెప్పే షర్మిల కాంగ్రెస్‌ పాలనలో ఈ దేశంలో ఎన్ని అరాచకాలు జరిగాయో తెలుసుకుని మాట్లాడాలి.. ఇందిర హయాంలో వేల ఘర్షణలు జరిగితే రాజీవ్‌ గాంధీ హయాంలో సిక్కుల ఊచకోత జరిగింది.. హైదరాబాద్‌లో అల్లర్లకు కారణం వైఎస్‌ అని ఆ పార్టీ నేతలే గతంలో చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఏమంటారు’ అని ప్రశ్నించారు.

వైసీపీ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

శివప్రకాశ్‌కు నాదెండ్ల మనోహర్‌వినతి

శివప్రకాశ్‌తో జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. కోర్‌ కమిటీ సమావేశం తర్వాత ఆయన వచ్చి కలిశారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకు సెంటు స్థలం ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. భూ సేకరణ, చదును చేయడంలో వేల కోట్ల అవినీతికి పాల్పడిన తీరును వివరించారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ కేంద్రానికి రాసిన లేఖ ప్రతిని కూడా ఈ సందర్భంగా శివప్రకాశ్‌కు అందజేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అధికార పార్టీ దోపిడీకి కేంద్రం అడ్డుకట్ట వేసేలా పార్టీ, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలని మనోహర్‌ కోరినట్లు తెలిసింది. అయితే మిత్రపక్షం నేత మర్యాద పూర్వకంగా వచ్చారు తప్ప అంతకు మించి ఏమీ లేదని పురందేశ్వరి విలేకరులకు చెప్పారు.

Updated Date - Jan 05 , 2024 | 04:25 AM