Share News

పురాణపండ ‘శ్రీ పూర్ణిమ’ సమ్మోహనాన్ని తాకలేకపోయిన పబ్లిషర్స్

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:26 AM

‘శ్రీ పూర్ణిమ’ పుస్తకాన్ని హక్కులతో కొనడానికి విజయవాడ, రాజమహేంద్రవరంకి చెందిన ప్రచురణకర్తలు పోటీపడుతున్నారు. అయితే గ్రంధానికి వ్యాపారపు నీడ తాకనివ్వని, రాజీపడని మనస్తత్వపు పురాణపండ శ్రీనివాస్ ప్రచురణకర్తలకు నిర్మొహమాటంగా మొండిచెయ్య చూపడం కొసమెరుపు.

పురాణపండ ‘శ్రీ పూర్ణిమ’ సమ్మోహనాన్ని తాకలేకపోయిన పబ్లిషర్స్

విజయవాడ, ఏప్రిల్ 5: ‘శ్రీ పూర్ణిమ’ పవిత్ర మహా గ్రంధాన్ని పారాయణం చేస్తుంటే ఒక అపూర్వ ఆలయాన్ని ప్రదక్షిణ చేసిన అనుభూతి కలిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ పేర్కొంటే... మరోప్రక్క ‘శ్రీ పూర్ణిమ’లోని మహా నృసింహ ఆవిర్భావ ఘట్టం చదువుతుంటే వొళ్ళు గగుర్పొడిచేలా రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా విశ్వరూపమ్ శబ్ద సౌందర్యంతో ఆకట్టుకుంటుందని రామకృష్ణ మఠాధిపతులు స్వామి జ్ఞానదానంద ప్రశంసించడం పురాణపండ ‘శ్రీ పూర్ణిమ’ మహా గ్రంథ వైభవాన్ని తెలియజేస్తోందని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, సాహిత్య ప్రియులు స్పష్టం చేస్తున్నారు. స్వచ్ఛమైన హృదయంతో, పవిత్ర అంశాలతో... కవిత్వంలో తేలియాడుతున్నట్లు, దిగంతపరివ్యాప్త సందేశ సాన్నిధ్యాన్ని కలిగించే ఆధ్యాత్మికత విశేషాలతో... ఎన్నో యుగాల రహస్యాల వెనుక ఉన్న వేద పురాణ ప్రాకృతిక సౌందర్యాల వెన్నెలలో తడిసినట్లు అనుభూతిని చెందేలా రచనా సౌందర్య సంకలన వైభవంగా పురాణపండ శ్రీనివాస్ అందించిన మంత్రం సంపద అయిన ‘శ్రీ పూర్ణిమ’ ఇరవై ఏడవ ప్రచురణకు.. అనగా మళ్ళీ మళ్ళీ పునర్ముద్రణలకు తెరలేపడం ప్రచురణకర్తలకు సైతం ఆశ్చర్యాన్ని కలుగజేస్తోందనేది నిర్వివాదాంశమంటున్నారు విజ్ఞులైన రసజ్ఞులు.

సుమారు ఎనిమిది వందల పేజీలతో, ఇండియన్ ఆర్ట్ పేపర్‌పై, అతి అరుదైన వర్ణ చిత్రాలతో.. ఆధ్యాత్మిక భావజాల పరివ్యాప్తికి సంబంధించిన విలక్షణ కథలతో, శక్తి సంపన్నమైన స్తోత్ర సంపదలతో, పరమ ఋషుల ప్రార్ధనలతో, పురాణ సంబంధ వచన వ్యాఖ్యాన సౌందర్య పరిమళాలతో.. ఒక సమ్మోహనంగా రచయిత పురాణపండ శ్రీనివాస్ రూపుదిద్దిన ఈ ‘శ్రీపూర్ణిమ’ మహా గ్రంధాన్ని ఆవిష్కరించిన మహా పండితోత్తములు, ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర రావు ఈ గ్రంధానికి తొలుత సమర్పకులుగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి కే.వి.రమణాచారిని రచయిత పురాణపండతో పాటు అభినందించడం విశేషం.

chinajeyar.jpg

ఏ సుముహూర్తంలో పురాణపండ శ్రీనివాస్ ఈ అపురూప గ్రంధానికి ‘శ్రీ పూర్ణిమ’గా నామకరణం చేశారో కానీ, ఏ అద్భుత సమయంలో చాగంటి కోటేశ్వరరావు ఈ పుణ్య మహా గ్రంధాన్ని ఆవిష్కరించారోగానీ... అక్కడి నుండి ఈ మంగళ తత్వాల గ్రంధం అనేకమందిచే సౌజన్య భరితంగా ప్రచురించబడి ఇప్పుడు ఈ ‘శ్రీ పూర్ణిమ’ ఇరవై ఏడవ ప్రచురణకు చేరడం ఈ రోజుల్లో ఈ కంటెంట్ వెనుక బలాన్ని, రచనా సంకలన కర్త పురాణపండ శ్రీనివాస్ సమర్ధతను తెలియజేస్తోందని అతి ప్రాచీన పీఠాలైన శృంగేరి, కంచి కామకోటి పీఠాలకు చెందిన ఇప్పటి కొందరు వేదవేదాంగ పారంగతులైన పండితులు మంగళాశాసనాలు వర్షిస్తున్నారు.

దేశ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధుల్లో అధిక సంఖ్యలో ఉన్న సంస్థలు వార్షికోత్సవాలలో ఈ ‘శ్రీ పూర్ణిమ’ గ్రంధాన్ని అతిధులకు కానుకగా బహూకరించడం వల్ల ఈ వైభవగ్రంధ వైశిష్ట్యం బహిర్గతమవుతోందని ఇటీవల చెన్నైలో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రతినిధులు సైతం ఈ సమ్మోహన గ్రంధాన్ని జ్ఞాపికగా బహూకరించిన అంశం కన్నులముందే స్పష్టంగా కనిపించిన సత్యం. ఇప్పుడీ పుస్తకాన్ని హక్కులతో కొనడానికి విజయవాడ, రాజమహేంద్రవరంకి చెందిన ప్రచురణకర్తలు పోటీపడుతున్నారు. అయితే గ్రంధానికి వ్యాపారపు నీడ తాకనివ్వని, రాజీపడని మనస్తత్వపు పురాణపండ శ్రీనివాస్ ప్రచురణకర్తలకు నిర్మొహమాటంగా మొండిచెయ్య చూపడం కొసమెరుపు.

ramana-chari.jpg

కొందరు వ్యాపార కాలుష్యపు పుస్తక ప్రచురణకర్తలకు పురాణపండ శ్రీనివాస్ వేగవంతమైన ప్రచురణ, నిస్వార్ధ యజ్ఞభావనలే గొప్ప చెంపపెట్టు అంటున్నారు భక్త జన పాఠక ప్రియులు. ఇటీవల ఒక మహా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ సైతం ‘శ్రీపూర్ణిమ’ గ్రంధాన్ని సుమారు పదినిమిషాలపాటు ఎంతో ఆసక్తితో పరిశీలించడం గమనార్హం. ఈ పుస్తకం పట్ల విపరీతమైన ప్రేమతోనే ఏపీ మంత్రి ఆర్కే రోజా తన ఇంటికి వచ్చిన జబర్దస్త్ టీమ్‌కి పురాణపండ శ్రీనివాస్ అమృత రసభరిత గ్రంధం ‘శ్రీ పూర్ణిమ’ను బహూకరించడం విశేషం. అయితే ఇటీవల ‘శ్రీ పూర్ణిమ’ గ్రంధాన్ని రచయిత శ్రీనివాస్ ఆనుమతిలేకుండా ఒక ప్రెస్‌లో వేరే ప్రచురణకర్తలు ముద్రిస్తుండగా... ఈ నకిలీ ప్రతుల ముద్రణ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రెస్‌పై దాడి చేసి ప్రతులను స్వాధీనం చేసుకున్నారంటే ఈ బుక్స్‌కి ఉన్న డిమాండ్ తేటతెల్లమవుతోంది. ఈ అఖండ గ్రంధాన్ని విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ‘జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం’ వారు మాత్రమే ముద్రించారని, మిగిలిన చోట్ల దొరికే గ్రంధాలు నకలు వని ప్రచురణకర్తలు కరాఖండీగా చెప్పేశారు.

Updated Date - Apr 06 , 2024 | 12:27 AM