Share News

సీఈసీ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు జరపాలి

ABN , Publish Date - May 03 , 2024 | 05:07 AM

పుంగనూరులో హింసాత్మక ఘటనలు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి.

సీఈసీ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు జరపాలి

పెద్దిరెడ్డి అరాచకాలతో భయపడుతున్న ఓటర్లు

ఈసీకి మాజీ సీఎం కిరణ్‌ ఫిర్యాదు

పుంగనూరు, కలికిరి, మే 2: ‘పుంగనూరులో హింసాత్మక ఘటనలు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్వీయ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు నిర్వహించాలి’ అని మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి కోరారు. గురువారం ఈమేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత నెల 14, 15తేదీల్లో సైతం తాను ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ‘పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారాలు ఎన్నికల కమిషన్‌ను సవాలు చేసే విధంగా ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, వారి కుటుంబీకులు తీవ్ర స్థాయిలో హింసను ప్రేరేపిస్తున్నారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అధికార పార్టీలో ఉండటం వల్ల పెద్దిరెడ్డి తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ, పోలీస్‌ అధికారులను ఎన్నికల కంటే ముందుగా నియమించుకున్నారు. వారు వైసీపీకి మద్దతుగా ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి మద్దతుగా ఏకపక్షంగా పనిచేస్తున్న అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గం ఓటర్లలో విశ్వాసం పెరగడానికి, స్వేచ్ఛగా ఓటు వేయడానికి, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి, పుంగనూరు నియోజకవర్గాన్ని పూర్తిగా ఎన్నికల కమిషన్‌ తన ఆధీనంలోకి తీసుకోవాలి. ఎన్నికల కేంద్ర పరిశీలకులను ప్రత్యేకంగా నియమించాలి. అన్ని సమస్యాత్మక, కీలకమైన పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు అమర్చాలి. కేంద్ర పారా మిలిటరీ బలగాలను వెంటనే మోహరించాలి. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు కొనసాగించాలి. పుంగనూరుకు ప్రత్యేకంగా ఎన్నికల పరిశీలకుడిని నియమించాలి. పెద్దిరెడ్డికి మద్దతుగా ఏకపక్షంగా ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించి బదిలీ చేసి తటస్థ ప్రవర్తన గల అధికారులను వెంటనే నియమించాలి’ అని కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈసీకి విజ్ఞప్తి చేశారు. తన లేఖకు ఇటీవల కాలంలో జరిగిన విధ్వంసాలు, దాడులు, హత్యాయత్నాలకు సంబంధించిన వివరాలను జతపరిచారు.

Updated Date - May 03 , 2024 | 05:07 AM