Share News

వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.4 లక్షల ఆస్తి నష్టం

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:01 AM

జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో నాలుగు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.4 లక్షల ఆస్తి నష్టం

జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో నాలుగు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

రచ్చుమర్రిలో గ్రాసం, ట్రాక్టర్‌ ఇంజన్‌ దగ్ధం

మంత్రాలయం, మార్చి 10: మండలంలోని రచ్చుమర్రి గ్రామంలో బూదూరు గ్రామానికి వేళ్లే దారిలో ఉన్న కోసిగి తిక్కయ్య జొన్నచొప్ప గ్రాసం అగ్నికి దగ్ధం కాగా.. తమ్ముడైన కోసిగి ఉరుకుందుకు చెందిన ట్రాక్టర్‌ ఇంజిన్‌ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని అగ్నికి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మంటలను ఆర్పేసి పక్కనే ఉన్న గడ్డివాములకు వ్యాప్తి చెందకుండా ఆర్పేశారు. వీటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. మాధవరం ఎస్‌ఐ క్రిష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని గ్రాసాన్ని, కాలిపోయిన ట్రాక్టర్‌ ఇంజిన్‌ను పరిశీలించారు.

గుడెసె దగ్ధం - రూ. లక్ష ఆస్తి నష్టం

ఎమ్మిగనూరుటౌన్‌ : పట్టణంలోని 10వ వార్డులో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి మాలినమ్మ అనే వృద్ధురాలి గుడిసె దగ్ధమైంది. అగ్నిప్రమాదంలో గుడిసెలోని వస్తువులన్ని కాలి బూడిదయ్యాయి.దీంతో దాదాపు రూ. లక్షకు పైగా వాటిల్లినట్లు బాధితురాలు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశర రెడ్డి బాధితురాలు మాలినమ్మను కలిసి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజే శారు. ప్రభుత్వం మాలినమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అలాగే టీడీపీ నాయకులు మాచాని సోంనాథ్‌ మాలినమ్మను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక మాలినమ్మను కలిసి సాయం అందజేశారు.

రూ. 2లక్షల విలువైన గ్రాసం బుగ్గిపాలు

గోనెగండ్ల : వేముగోడు గ్రామ ప్రఽధాన రహదారి పక్కనే ఉన్న గడ్డి వాములకు శనివారం రాత్రి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని చాకలి మందకల్లుకు చెందిన రూ. 2 లక్షల విలువ చేసే వరి, వేరుశనగ, కొర్ర గడ్డి వాములు దగ్ధమయ్యాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసింది. రైతు తన పశువులకు గ్రాసం ఎక్కడి నుంచి తేవాలని కన్నీరు పెట్టారు. రైతు బాధను తెలుసుకున్న గ్రామస్ధులు తమకు తోచినంత గ్రాసం ఇచ్చారు. అలాగే మరి కొందరు కొంత నగదును కూడా అందజేశారు. విషయాన్ని తెలుసుకున్ను టీడీపీ నాయకులు డాక్టర్‌ సోమనాఽథ్‌, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి బాధిత రైతుకు రూ. 60 వేల ఆర్థిక సాయం అందజేశారు.

Updated Date - Mar 11 , 2024 | 12:01 AM