Share News

సమస్యల ‘కొత్తపల్లి’

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:40 AM

కొత్తపల్లి మండల కేంద్రమైనప్పటికీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. 35 ఏళ్ల క్రితమే కొత్తపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసినప్పటికీ మారుమూల పల్లెలకన్నా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది.

సమస్యల ‘కొత్తపల్లి’
బురదమయంగా గ్రామంలోని రహదారి

అభివృద్ధి ఆమడ దూరంలో ఈ మండల కేంద్రం ఫ పట్టించుకోని పాలకులు, అధికారులు

ఆందోళనలో గ్రామస్థులు

కొత్తపల్లి, జనవరి 10: కొత్తపల్లి మండల కేంద్రమైనప్పటికీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. 35 ఏళ్ల క్రితమే కొత్తపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసినప్పటికీ మారుమూల పల్లెలకన్నా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. మండలానికి 12 గ్రామ పంచాయతీలతో పాటు 18 మజరా గ్రామాలున్నాయి. గ్రామాలే కొద్దో గొప్పో అభివృద్ధి చెందుతున్నప్పటికీ మండల కేంద్రం కొత్తపల్లిని మాత్రం పట్టించుకునే అధికారులు, పాలకులే లేరని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కొత్తపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీ కావడంతో 4,800 జనాభాతో పాటు సుమారు 13 కుటుంబాలున్నాయి. మండల కేంద్రం కావడంతో అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం పలు గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ వీధి చూసినా బురదమయం. ప్రధాన రహదారులతో పాటు బీసీ, ఎస్సీ, ఓసీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం బురదలోనే తిరగాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. వర్షం నీటితో పాటు గృహాల్లోని నీరు ప్రధాన వీధుల్లో పారుతూనే ఉంటుంది. వీధుల్లో పారిశుధ్యం లోపించి రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారు.

చేసిన పనులకే బిల్లులు ఇస్తలేరు

రెండేళ్ల క్రితం కొత్తపల్లిలో వివిధ అభివృద్ధి పనులు చేశాం. వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. సుమారు రూ.7 లక్షలకు పైగా ఖర్చు చేసి రైతుభరోసా కేంద్ర నిర్మాణం, రెండు తాగునీటి బోర్లు, పైపులైన్‌ నిర్మాణం, బోర్ల మరమ్మతులు చేయించాం. ఇంతవరకూ వాటికి బిల్లులు చెల్లించలేదు. పనుల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నాం. ప్రభుత్వం ఏమైనా నిధులు ఇస్తే కొత్తపల్లి అభివృద్ధికి కేటాయిస్తాం.

- లక్ష్మిదేవి సర్పంచు

Updated Date - Jan 11 , 2024 | 12:40 AM