Share News

కేసీ కెనాల్‌ భూముల పరాధీనం కేసులో 20 మంది అధికారులపై చర్యలకు సిద్ధం

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:29 AM

కడప జిల్లాలోని కేసీ కెనాల్‌ భూముల పరాధీనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఐదేళ్లు జగన్‌ సర్కారు తొక్కిపెట్టిన విజిలెన్స్‌ నివేదికను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది.

కేసీ కెనాల్‌ భూముల పరాధీనం కేసులో 20 మంది అధికారులపై చర్యలకు సిద్ధం

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా రెవెన్యూ శాఖ చర్యలు

2019లోనే నివేదిక.. తొక్కిపెట్టిన జగన్‌ సర్కారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కడప జిల్లాలోని కేసీ కెనాల్‌ భూముల పరాధీనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఐదేళ్లు జగన్‌ సర్కారు తొక్కిపెట్టిన విజిలెన్స్‌ నివేదికను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. భూములు పరాధీనం అవడానికి, ఆతర్వాత ఆ భూములను పరిరక్షించడంలో 20 మంది అధికారులు తీవ్ర వైఫల్యం చెందారని విజిలెన్స్‌ గుర్తించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఫారసుల మేరకు 20 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు (జీవో-241) జారీ చేశారు. నాలుగు శాఖల అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. కాబట్టి ఆయా శాఖలు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారు 2019కు ముందు కడప జిల్లా పరిధిలో పని చేశారు. ప్రస్తుతం వీరంతా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.

ఐదేళ్ల తర్వాత చర్యలు

కడప జిల్లాలో విలువైన కేసీ కెనాల్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వాటి పరిరక్షణలో ఆయా శాఖల అధికారులు విఫలమయ్యారు. దీంతో గత తె లుగుదేశం ప్రభుత్వ హయాంలో విచారణ జరిపింది. అధికారుల పాత్ర ఉందని అనుమానాలు రావడంతో విజిలెన్స్‌ విచారణ జరిపించింది. ఈమేరకు విజిలెన్స్‌ విచారణ జరిపి 2019 మే 20న సర్కారుకు నివేదిక ఇచ్చింది. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జగన్‌ సర్కారు వచ్చాక ఈ ఫైలుపై ఐదేళ్లపాటు ఏ చర్యలూ తీసుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం పెండింగ్‌ ఫైళ్ల బూజు దులిపి పరిశీలిస్తోంది. ఈ కేసులో చర్యలు తీసుకుంటూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది.

వీరిపైనే క్రమశిక్షణ చర్యలు!

ఇరిగేషన్‌ శాఖ అధికారులు: 1. ఎస్‌.సుధాకర్‌- ఈఈ, మైలవరం, 2.మల్లికార్జున-ఈఈ, కెసీ కెనాల్‌ నంద్యాల, 3.కె.సుబ్బయ్య-ఈఈ, ధవళేశ్వరం, 4.ఎస్‌.జిలాని బాష-డీఈ, మైదుకూరు.

పురపాలకశాఖ: 5.బి.విజయభాస్కర్‌-అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌, గూడూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌, 6. టీఎం.రామ్మోహన్‌-టౌన్‌ ప్లానింగ్‌, కదిరి మున్సిపాలిటీ. 7.జి.నాగశివప్రసాద్‌-టౌన్‌ప్లానింగ్‌, కడప మున్సిపాలిటీ. 8.జి.శారదాంబ-ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌, రాజంపేట. 9.సీటీ కష్ణసింగ్‌-టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌, పులివెందుల మున్సిపాలిటీ. 10. ఎ.సలీమ్‌బాషా-కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌, 11.డి. జాన్‌శామ్‌సన్‌-కమిషనర్‌, రామగుండం మున్సిపాలిటీ(తెలంగాణ), 12.సి.ఓబులేసు-కమిషనర్‌, అనంతపురం మున్సిపాలిటి.

హోంశాఖ: 13. టి.రెడ్డప్ప-సీఐ, 14. ఎస్‌.రామకృష్ణుడు-సీఐ, 15.ఎస్‌.రామకృష్ణ-సీఐ, 16. వి.నారాయణస్వామిరెడ్డి-డీఎస్పీ.

రెవెన్యూ శాఖ: 17. ఎ.శ్రీనివా్‌స-తహసీల్దార్‌, వేంపల్లి, 18.ఎన్‌.రవిశంకర్‌రెడ్డి -తహసీల్దార్‌, దువ్వూరు, 19. ఎస్‌.ప్రేమానంతకుమార్‌, తహసీల్దార్‌.

పంచాయతీరాజ్‌ శాఖ: 20.ఎన్‌.శివరామిరెడ్డి-సూపరింటెండెంట్‌, కడప జెడ్‌పీ.

Updated Date - Oct 31 , 2024 | 04:29 AM