స్టాప్‌లాక్ సిద్ధం!
ABN , Publish Date - Aug 13 , 2024 | 04:13 AM
కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రైతుల ప్రాణాధారమైన తుంగభద్ర డ్యాం గేటు మరమ్మతుల్లో ప్రాజెక్టు బోర్డు, కర్ణాటక, ఆంధ్ర ఇంజనీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు.
కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు స్థానంలో తాత్కాలికంగా
బిగింపునకు ఏర్పాట్లు.. 4 రోజులు పట్టే చాన్సు
20 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో అమర్చడం కష్టం
అందుకే ఐదు బ్లాక్‌లుగా విడివిడి భాగాలుగా తయారీ
స్పిల్‌వే లెవెల్ వరకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు
ఆందోళనలో రాయలసీమ కరువు రైతులు
స్టాప్‌లాక్ బిగించాక మళ్లీ వరదొస్తేనే సాగు, తాగునీరు
కర్నూలు, అనంతల్లో ప్రశ్నార్థకంగా మారిన ఖరీఫ్ సాగు
కర్నూలు/అమరావతి/బళ్లారి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రైతుల ప్రాణాధారమైన తుంగభద్ర డ్యాం గేటు మరమ్మతుల్లో ప్రాజెక్టు బోర్డు, కర్ణాటక, ఆంధ్ర ఇంజనీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు. వరద నీరు వృథాగా సముద్రంపాలుకాకుండా అడ్డుకోవడానికి.. చైన్ లింక్ తెగిపోయి కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేట్ అమర్చి.. దానిని పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు. తుంగభద్ర బోర్డు సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. మరమ్మతులపై హైదరాబాద్‌కు చెందిన ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, కర్ణాటక నిపుణుల ఆధ్వర్యంలో సమాలోచనలు జరిపింది. డ్యాంకు ఐదారు కిలోమీటర్ల దూరంలోని ఓ వర్క్‌షాపులో స్టాప్‌లాక్ గేట్ తయారు చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. స్టాప్‌లాక్ గేట్ ఏర్పాటు చేయాలన్నా స్పిల్‌వే లెవల్ 1,613 అడుగుల వరకు జలాశయాన్ని ఖాళీ చేయక తప్పదు. అంటే.. దాదాపు 62-65 టీఎంసీలు సముద్రానికి వదిలేయాల్సిందే. దీనివల్ల రాయలసీమ జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఖరీఫ్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయకట్టు రైతులకు ఖరీఫ్ పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులపై సమీక్షిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్‌ఈ శ్రీకాంత్‌రెడ్డి సహా హైదరాబాద్‌కు చెందిన ప్రాజెక్టు గేట్స్ ఎక్స్‌పర్ట్ కన్నయ్యనాయుడు, కర్ణాటక గేట్ల నిపుణుడు కులకర్ణి, ఆంధ్ర సీడీవో సీఈ కుమార్, ఎస్‌ఈ శివకుమార్ బృందం ప్రాజెక్టు వద్దే మకాం వేసి మరమ్మతుల్లో నిమగ్నమయ్యారు. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ దగ్గరుండి మరమ్మతులను పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటక మంత్రి శివరాజ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆలూరు, మంత్రాలయం టీడీపీ నేతలు బి.వీరభద్రగౌడ్, ఎన్.రాఘవేంద్రరెడ్డి తుంగభద్ర డ్యాంను పరిశీలించి కర్ణాటక మంత్రి శివరాజ్‌తో చర్చించారు. సిద్దరామయ్య మంగళవారం డ్యాంను సందర్శిస్తారు. మరమ్మతులు, స్టాప్‌లాక్‌పై ఏర్పాటుపై నిపుణులతో సమావేశమవుతారు. ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయడు, కల్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు తదితరులు కూడా అక్కడకు వెళ్లనున్నారు. సిద్దరామయ్య బెంగళూరు నుంచి నేరుగా డ్యాం వద్దకు చేరుకుంటారు. ఏపీ మంత్రులు హోస్పేటకు వెళ్లి.. ఏపీ, కర్ణాటక అధికారులతో సమావేశమవుతారు. కన్నయ్యనాయుడు బృందం విజయనగరలో వర్క్‌షాపు వద్దకు వెళ్లి తయారవుతున్న క్రస్ట్ గేటును పరిశీలించింది.
గేట్ల యాజమాన్య నిర్వహణలో లోపం లేదు
డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంలో యాజమాన్య నిర్వహణ లోపమేమీలేదని తుంగభద్ర బోర్డు తేల్చిచెప్పింది. గేటు నిర్మాణం కోసం వినియోగించిన స్టీల్ నాణ్యతతో ఉందని ధ్రువీకరించింది. డ్యాం నిర్మాణం జరిగి 55 ఏళ్లు గడచినందున సహజంగానే కాలపరిమితి దాటిందని పేర్కొంది. ప్రాజెక్టుల గేట్ల రూపకల్పనలో 30 ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్ ఇంజనీరు కన్నయ్యనాయుడికి కొత్త గేటును బిగించే బాధ్యతలను అప్పగించామని వెల్లడించింది. ఇందుకోసం డ్రాయింగ్‌లు, డిజైన్లు ఆయన పర్యవేక్షణలో జరుగుతాయని తెలిపింది.
అప్పటిదాకా నీటి వృథాను నివారించేందుకు స్టాప్‌లాక్ అమర్చుతామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారాలపై తుంగభద్ర బోర్డు కార్యదర్శి, డ్యాం చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, హెచ్‌ఎల్‌సీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో కూడిన ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని నియమించారు. కమిటీ డ్యాం గేటు డిజైన్లను పరిశీలించి, ఆమోదిస్తుంది. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ను నియమిస్తుంది. గేట్ల డిజైన్లను కేంద్ర జల సంఘానికి పంపి ఆమోదం పొందుతుంది. ఇంకోవైపు.. డ్యాం గేటు 60 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉంటుంది. అంత పెద్ద స్టాప్‌లాక్ గేట్‌ను అమర్చడం కష్టం కావడంతో ఐదు బ్లాకులుగా తయారు చేసి ఒక్కొక్క బ్లాక్‌ను అమర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. బ్రిడ్జి పైనుంచి క్రేన్ సాయంతో ప్రస్తుత గేట్ గాడి (గ్రూవ్)లో ఒక్కో బ్లాక్ కిందకు దించి.. ఆ గేటును పూర్తిగా క్లోజ్ చేస్తామని బోర్డు ఇంజనీర్లు తెలిపారు. నారాయణ ఇంజనీరింగ్, హిందూస్థాన్ ఇంజనీరింగ్ సంస్థలు ఈ బ్లాక్‌లను తయారు చేశాయి. మంగళవారం నుంచి బిగించడం ప్రారంభిస్తారు. ఇది పూర్తి కావడానికి 4 రోజులు పట్టవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియ మొదలు పెట్టాలంటే స్పిల్ లెవల్ 1,613 అడుగుల వరకు డ్యాంలో ఉన్న నీటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 1630.97 అడుగుల వరకు నీటినిల్వ ఉంది. నదీ పరివాహక గ్రామాలకు ముంపు సమస్యలు తలెత్తకుండా లక్ష క్యూసెక్కులు మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు.
కరువు సీమ ఆందోళన..
తుంగభద్ర గేటు కొట్టుకుపోవడం, వరద నీరు దిగువకు వదిలేస్తుండడంతో రాయలసీమ కరువు రైతుల్లో ఆందోళన నెలకొంది. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూడు నియోజకవర్గాల్లో ఎల్లెల్సీ కింద ఖరీఫ్ 43,519 ఎకరాల్లో ఆయకట్టు ఉంది. డ్యాంలో ఆశాజనకంగా వరద చేరడంతో ఈ సీజన్‌లో 35 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని జూలై 19న జిల్లా కలెక్టరు పి.రంజిత్‌బాషా అధ్యక్షతన జరిగిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీర్మానించారు. దీంతో రైతులు వరి,పత్తి, మిరప సాగు చేపట్టారు. అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ కింద రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో 1.45 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కణేకల్లు డివిజన్ పరిధిలో 35,600 ఎకరాలు, గంతకల్లు బ్రాంచ్ కెనాల్ పరిధిలో 31 వేలఎకరాలు, ఎంపీఆర్ దక్షిణ కాలువ కింద 36 వేలు, ఉత్తర కాలువ కింద 14 వేలు, తాడిపత్రి బ్రాంచి కాలువ కింద 28 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తడంతో 75-85శాతం ఆయకట్టు కింద భూముల్లో పంటల సాగు చేపట్టారు. కేసీ కెనాల్ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కేసీ కాలువకు తుంగభద్ర డ్యాం నుంచి 10టీఎంసీల వాటా ఉంది. మిగిలిన నీటిని వరద ప్రవాహం నుంచి తీసుకోవాలి. తాజా పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ సాగైనా గట్టెక్కుతుందా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే నిధులు
బళ్లారి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం నిర్వహణకు గత ప్రభుత్వం నిధుల కేటాయిచలేదు. అత్యవసర పరిస్థితుల్లో బోర్డు వాడుకోవడానికి బడ్జెట్‌లో ప్రకటించిన నిధులను మంజూరు చేయలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కొట్టుకుపోయిన క్రస్ట్ గేటు పునరుద్ధరణకు బోర్డు ఖాతాలో డబ్బులు లేకపోవడంతో ఇంజనీరింగ్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసినట్లు సమాచారం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక శ్రద్ధతో నిధులు విడుదల చేయించినట్లు తెలిసింది.
70 ఏళ్లలో తొలి ప్రమాదం..
తుంగభద్ర డ్యాంకు 6.50 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల (డిశ్చార్జ్) చేసే సామర్థ్యంతో 33 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశారు. ఊహించని విధంగా శనివారం రాత్రి ఎత్తిన 19వ గేటు చైన్‌లింక్ తెగిపోవడంతో గేటు వరద ఉఽధృతికి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. 70 ఏళ్లలో డ్యాంలో జరిగిన తొలి ప్రమాదమిదే. గేటు కొట్టుకుపోయిన సమయంలో డ్యాంలో గరిష్ఠ నీటిమట్టం 1,633 అడుగుల్లో 105.788 టీఎంసీలు నిల్వ చేసి.. ఎగువ నుంచి డ్యాంలోకి వచ్చి చేరుతున్న 30,689 క్యూసెక్కుల వరద (ఇన్‌ఫ్లో)ను వివిధ కాలువలు, నదికి విడుదల చేస్తున్నారు. 19వ గేటుపై ఒత్తిడి తగ్గించేందుకు మిగిలిన 32 గేట్లు కూడా ఎత్తి 99,567 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా, రిపేర్ చేయాల్సి వచ్చినా నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేయకుండా స్టాప్‌లాక్ ఎలిమెంట్ ఏర్పాటు చేసే సౌలభ్యం ఉంటుంది.
ఎవరీ కన్నయ్యనాయుడు!
సర్దార్ సరోవర్, పోలవరం, శ్రీశైలం, సాగర్ గేట్ల రూపకల్పనలో కీలక పాత్ర
ఎస్వీ వర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం గేటు తయారీ బాధ్యతలను గేట్ల తయారీ నిపుణుడు ఎన్.కన్నయ్య నాయుడికి అప్పగించడంతో.. ఒక్కసారిగా ఎవరీయన అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. చిత్తూరు జిల్లా గుడిపాలలో రైతు బిడ్డగా పుట్టిన ఆయన.. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తమిళనాడులోని మెసర్స్ సదరన్ స్ట్రక్చరల్ సంస్థలో ఐదేళ్లు, తుంగభద్ర జలాశయం సమీపంలో నిర్మించిన తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్‌లో 27 ఏళ్లపాటు పనిచేశారు. దేశంలో పలు సాగునీటి ప్రాజెక్టులకు క్రస్ట్ గేట్లు, ఫిక్సెడ్ వీల్ గేట్లు, రేడియల్ గేట్లు, హైడ్రాలిక్ గేట్లు, రోస్‌డ్రమ్ హైడ్రాలిక్ హాయి్‌సల తయారీలో అనుభవం గడించారు. 1976 నుంచి 2002 వరకూ టీఎ్‌సపీల్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా డిజైన్ విభాగంలో పనిచేశారు. అంతర్జాతీయ స్థాయిలో 250 సాగునీరు, ఇతర ప్రాజెక్టుల గేట్ల అమరికలో ప్రధాన పాత్ర పోషించారు. కన్నయ్యనాయుడి పేరు చెబితే.. పోలవరం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు.. గుజరాత్‌లో నర్మదానదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టులకు బిగించిన క్రస్ట్ గేట్లు గుర్తుకొస్తాయి. కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం, ఆలమట్టి డ్యాం పవర్ హౌస్, సూపా జలాశయం (స్టేజ్-1, 2), బొమ్మనహళ్లి ప్రాజెక్టు, భద్ర జలాశయం, తుంగ ఆనకట్ట, హేమావతి ఆనకట్ట, హారంగి, తుంగభద్ర, మలప్రభ, మస్కినాళ తదితర ప్రాజెక్టుల గేట్ల రూపకల్పనలో ప్రధానపాత్ర పోషించారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికీ సాంకేతికతను అందించారు.