Share News

ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయండి

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:57 AM

వచ్చే సాధారణ ఎన్నికలు పటిష్టంగా, సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయండి

అధికారులకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం

అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): వచ్చే సాధారణ ఎన్నికలు పటిష్టంగా, సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే్‌షకుమార్‌ మీనాతో చర్చించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఉండాల్సిన కనీస సౌకర్యాలపై సీఎస్‌ సమీక్షించారు. రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటివి అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు పోలీస్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, రవాణా, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, విద్య, మున్సిపల్‌ శాఖలన్నీ తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. సీఈవో ముఖే్‌షకుమార్‌ మీనా మాట్లాడుతూ... ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9న రాష్ట్రానికి రానుందని తెలిపారు. 10న విజయవాడలో వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రవి ప్రకాశ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో 29 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులున్నాయని వాటిని పటిష్టంగా నిర్వహించడం ద్వారా డబ్బు, మద్యం, గంజాయి, మత్తుపదార్థాల అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 03:57 AM