Share News

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

ABN , Publish Date - May 17 , 2024 | 12:06 AM

ఎమ్మిగనూరు మండలంలో రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు.

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం
వర్షం కురిసి భూములు పదును కావటంతో దుక్కి దున్నుతున్న రైతు

వర్షం కురిసి భూములు పదును కావటంతో దుక్కి దున్నుతున్న రైతు

వర్షం రాకతో భూములను సిద్ధం చేస్తున్న రైతులు

ఖరీఫ్‌ ప్రణాళిక ప్రతిపాదనలు పంపిన అధికారులు

ఎమ్మిగనూరు, మే16: ఎమ్మిగనూరు మండలంలో రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. ఐదురోజుల క్రితం భారీవర్షం కురువటం.. భూములు పదును కావటంతో రైతులు తమ పొలాలను సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దుక్కి దున్నుటంతో పాటు పొలాల్లో గతంలో సాగుచేసిన పంటల ఆనవాళ్లను తొలగిస్తున్నారు. మండల పరిదిలో 18400 హెక్టార్లు వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రైతులు అత్యధికంగా పత్తి, మిరప పంటలు సాగుచేసే అవకాశం ఉంది. స్వల్పంగా వేరుశనగ, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను సాగుచేయనున్నారు. గత ఏడాది సైతం అత్యధికంగా పత్తిపంటను సాగుచేశారు. ఈ ఏడాది కూడా రైతులు పత్తిపంటనే ఎక్కువగా సాగుచేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎమ్మిగనూరు మండలంలో ఖరీఫ్‌, రబీ కలిపి 670 ఎంఎం సాధారణ వర్షపాతం. మరి ఈ ఏడాది ఏ మేరకు నమోదు అవుతుందో చూడాల్సి ఉంది.

వ్యవసాయ అదికారుల ప్రణాళిక.. ప్రతిపాదనలు : ఎమ్మిగనూరు మండలంలో ఖరీఫ్‌ సీజన్‌లో సాగుకానున్న 18400 హెక్టార్లలో దాదాపు 13000 హెక్టార్లలో పత్తి, 4000 వేల హెక్టార్లలో మిరప, 1400 హెకార్టర్ల్లలో ఇతర పంటలు సాగుకానున్నాయి. ఇందుకు గాను మూడు లక్షల పత్తి విత్తన పాకెట్లు, ఐదువేల కిలోల మిరప విత్తనాలు అవసరమని, అలాగే సబ్సిడిపై ఇచ్చే వేరుశనగ 400క్వింటాళ్లు అవసరమని ప్రభుత్వానికి స్థానిక అధికారులు ప్రతిపాదనలు పంపారు. అలాగే 12వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. అయితే ఇప్పటికే మార్కెట్‌లో లక్షన్నర పత్తివిత్తన పాకెట్లు అందుబాటులో ఉండగా ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఫ 60 ఎంఎం వర్షపాతం నమోదైతే విత్తనం వేసుకోవచ్చు

మాములుగా 60 ఎంఎం వర్షపాతం నమోదైతే భూములు పదును అవుతాయి. దీంతో విత్తనం వేసుకోవచ్చు. ప్రస్తుతం కురిసిన వర్షానికి విత్తనం వేసుకోవచ్చు. ఖరాఫ్‌సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.

- మహేశ్వరరెడ్డి, ఏఓ, ఎమ్మిగనూరు

Updated Date - May 17 , 2024 | 12:06 AM