Share News

ఎన్నికల వేళ.. పీపీఏ ఆమోదాల మేళా!

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:45 AM

: రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న వేళ.. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ సంస్థ(ఏపీఈఆర్‌సీ) విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు చేసుకున్న కొనుగోలు ఒప్పందా(పీపీఏ)ల మేళాను చేపట్టింది. సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) ద్వారా అదానీ, అజూర్‌లతో చేసుకున్న

ఎన్నికల వేళ.. పీపీఏ ఆమోదాల మేళా!

7000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోళ్లకు ఈఆర్‌సీ ఓకే

డిస్కమ్‌ల అప్పు 87,524 కోట్లు.. నష్టాలు 29,546 కోట్లు

రెవెన్యూ లోటు 13,589 కోట్లు.. దీని బాధ్యత సర్కారుదే

విద్యుత్‌ వాహనాలకు చార్జింగ్‌ షాక్‌.. యూనిట్‌కు 6.70

2024-25 నివేదికను వెల్లడించిన ఏపీఈఆర్‌సీ

కేసు కోర్టులో ఉండగా నిర్ణయాలా?: ప్రజాసంఘాలు

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న వేళ.. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ సంస్థ(ఏపీఈఆర్‌సీ) విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు చేసుకున్న కొనుగోలు ఒప్పందా(పీపీఏ)ల మేళాను చేపట్టింది. సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) ద్వారా అదానీ, అజూర్‌లతో చేసుకున్న ఒప్పందాలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు డిస్కమ్‌లు ప్రతిపాదించిన 2024-25 టారి్‌ఫను సోమవారం ఏపీఈఆర్‌సీ ప్రకటించింది. అదేవిధంగా వార్షిక ఆదాయ, వ్యయ నివేదికను విడుదల చేసింది. డిస్కమ్‌లు రూ.87,824 కోట్ల అప్పుల్లోను, రూ.29,546 కోట్ల నష్టాల్లోనూ ఉన్నాయని ఈ నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ఆదాయ, వ్యయ నివేదికలో రూ.13,589 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈఆర్‌సీ వెల్లడించింది. వినియోగదారుల నుంచి వసూలు చేసిన చార్జీల నుంచి డిస్కమ్‌లు రూ.1,710 కోట్లను ట్రూడౌన్‌ చార్జీలుగా గుర్తించాయని, వీటిని రాబడిగా లెక్కించి వినియోగించుకోవచ్చని ఈఆర్‌సీ పేర్కొంది. విద్యుత్తు సంస్థలు సెకీ ద్వారా అదానీ, అజూర్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు 7000 మెగావాట్ల సౌర విద్యుత్తునకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం మేరకు సెకీ ఈ ఏడాది అక్టోబరులో 3000 మెగావాట్లు, వచ్చే ఏడాది అక్టోబరులో మరో 3000 మెగావాట్లు, 2027 అక్టోబరులో మిగిలిన వెయ్యి మెగావాట్ల విద్యుత్తును డిస్కమ్‌లకు సరఫరా చేస్తుందని ఈఆర్‌సీ వెల్లడించింది. అయితే, ఇవి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది. ఇక, రైల్వేలకు అందిస్తున్న విద్యుత్‌ విషయంలో యూనిట్‌కు రూ.1 చొప్పున పెంచడం ద్వారా రూ.250 కోట్ల అదనపు రాబడి వస్తుందని ఈఆర్‌సీ వెల్లడించింది. విద్యుత్తు వాహనాలకు ప్రోత్సాహాన్ని అందిస్తామంటూనే.. విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లలో యూనిట్‌కు రూ.6.70 చొప్పున వసూలు చేయాలని ఆదేశించింది.

నిపుణుల ఆగ్రహం

ఒప్పందాలకు ఆమోదం తెలపడంపై విద్యుత్తు రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిస్కమ్‌లు సెకీతోనూ, సెంబ్‌కార్ప్‌తోనూ చేసుకున్న ఒప్పందాలకు ఏపీఈఆర్‌సీ పచ్చజెండా ఊపడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సెకీతో డిస్కమ్‌ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై తీర్పు వెలువడక ముందే ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. డిస్కమ్‌లు ప్రతిపాదించిన రూ.7200 కోట్ల ఇంధన కొనుగోలు సర్దుబాటు చార్జీలు, ట్రూఅప్‌ చార్జీలపై ఈఆర్‌సీ నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించలేదని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంధన సర్దుబాటు కోసం యూనిట్‌కు 40పైసల చొప్పున ప్రతి నెలా గృహ విద్యుత్తు చార్జీలతో కలపి వసూలుపైనా స్పష్టతను ఎందుకు ఇవ్వలేదని ప్రజా సంఘా లు ప్రశ్నిస్తున్నాయి. డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనల సమయంలో రూ.22,234 కోట్ల మేర ప్రభుత్వం నుంచి సబ్సిడీ మొత్తాలు రావాల్సి ఉందని చెప్పడాన్ని విద్యుత్తు రంగ నిపుణుడు ఎం. వేణుగోపాలరావు ప్రశ్నించారు.

ప్రజాభిప్రాయం లేకుండా అనుమతా?: సీపీఐ

రాజస్థాన్‌లోని అదానీ గ్రూప్‌ ప్లాంట్ల నుంచి 7000 మెగావాట్ల సౌర విద్యుత్తు సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ డిస్కమ్‌లు, సెకీ మధ్య జరిగిన ఒప్పందానికి ఈఆర్‌సీ సమ్మతి తెలిపిన విధానం సహేతుకంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తప్పుబట్టారు. సోలార్‌ పవర్‌ కొనుగోలు కోసం అదానీ గ్రూప్‌ను ఎంపిక చేసినప్పటి నుంచి పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం లేకుండా పోయిందన్నారు. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా సౌర విద్యుత్తు సరఫరా కోసం అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈఆర్‌సీ సమ్మతి తెలపడం సరికాదన్నారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌. బాబూరావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాల చేతిలో ఈఆర్‌సీ పావుగా మారిందని, ఈ ఒప్పందం చెల్లదని స్పష్టం చేశారు.

Updated Date - Apr 16 , 2024 | 02:45 AM