పోస్టల్ బ్యాలెట్ మరింత సులభం!
ABN , Publish Date - Apr 21 , 2024 | 04:04 AM
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసింది.
ఎలక్షన్ డ్యూటీ ఉన్నచోటే వినియోగం
సెంట్రల్ ఎక్స్చేంజ్ విధానంలో ఉద్యోగి
సొంత నియోజకవర్గానికి ఓటు చేరవేత
దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 26
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసింది. ఉద్యోగి ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనా తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలోని ఫెసిలిటేషన్ సెంటర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా జిల్లా ఎన్నికల అధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విఽధుల్లో ఉన్న పీవోలు, ఏపీవోలు, పోలీసు సిబ్బంది, సెక్టార్ ఆఫీసర్లు, వీడియోగ్రాఫర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎ్‌స డ్రైవర్లు, ఇతర అధికారులు ఈ నెల 26 లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12ను తాము పనిచేసే ప్రాంతంలోని ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు. వాటిని అధికారులు వారి సొంత నియోజకవర్గానికి పంపుతారు. ఒక జిల్లాలో విధుల్లో ఉన్న ఉద్యోగికి మరో జిల్లాలో ఓటు ఉంటే తాను పనిచేస్తున్న జిల్లా కేంద్రంలోని ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఈ పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు. ఇదే నిబంధన నియోజకవర్గాలకు కూడా వర్తిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మే 8 చివరి తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటు హక్కును వినియోగించుకోని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లను మే 10న మూడో విడత ఎక్స్‌చేంజ్ ద్వారా ఆయా జిల్లాల నోడల్ అధికారులు సీఈవో కార్యాలయంలో మార్చుకుంటారు. కాగా, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్‌లో వినియోగించుకునేందుకు వీలుగా ఒక రోజు క్యాజువల్ లీవ్‌ను మంజూరు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.