Share News

జగనన్న స్థలాల కబ్జా

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:03 AM

కర్నూలు జిల్లా జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన జగనన్న ఇంటి స్థలాలనే వైసీపీ నాయకులే కబ్జా చేశారు.

జగనన్న స్థలాల కబ్జా

49 ప్లాట్ల ఆక్రమణ.. వైసీపీ నేతల బరితెగింపు

ఏడాదిగా లబ్ధిదారుల గోడు పట్టించుకోని అధికారులు

ఆదోని రూరల్‌, ఫిబ్రవరి 5: కర్నూలు జిల్లా జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన జగనన్న ఇంటి స్థలాలనే వైసీపీ నాయకులే కబ్జా చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు సబ్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. హాలహర్వి గ్రామంలో సర్వే నం.407లో 117 మందికి ఒకటిన్నర సెంటు చొప్పున ప్రభుత్వం ఏడాది క్రితం జగనన్న ఇంటి స్థలాలను కేటాయించింది. హద్దులు ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చి జి యో ట్యాగింగ్‌ కూడా చేశారు. అయితే, ఇందులో 49 మంది లబ్ధిదారుల స్థలాలను స్థానిక వైసీపీ నాయకులు కబ్జా చేశారు. లబ్ధిదారులను బెదిరించి ఆ స్థలాల్లో కొట్టాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గత ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన బాధితులు బుడ్డమ్మ, రామలక్ష్మి, ఉరుకుందమ్మ, ఈరన్న, దస్తగిరి, రామాంజినమ్మతోపాటు మిగిలిన వారు నందవరం తహసీల్దార్‌ నిత్యానంద రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ స్థలాలను గ్రామానికి చెందిన లచ్చుమర్రి మోహన్‌, చిన్నన్న, వెంకటేశులు, హనుమప్ప, ఎర్రన్న, వెంకటస్వామి, రాజు, హనుమన్న, హరికృష్ణ, నాగేంద్ర, కాశీం, జమ్మప్ప, కర్రెన్న, శీను, నాగేష్‌, చాకలి ఉరుకుందు, మునిస్వామి, చాకలి దుబ్బన్న కబ్జా చేశారని తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా తక్షణమే తమ వద్ద హాజరు కావాలని గత ఏడాది ఏప్రిల్‌ 3వ తేదీన ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు. కబ్జా చేసిన వైసీపీ నేతలు హాజరు కాకపోగా, లబ్ధిదారులను స్థలాల్లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నారు. ప్రస్తుతం జగనన్న ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో తమ స్థలాలను కూడా తమ పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయాలని బాధితులు సిబ్బందిని కోరారు. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాలు లేనిదే తాము రిజిస్ట్రేషన్‌ చేయలేమని సిబ్బంది తేల్చి చెప్పడంతో బాధితులు సోమవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.

Updated Date - Feb 06 , 2024 | 04:04 AM