Share News

రేపే పోలింగ్‌

ABN , Publish Date - May 12 , 2024 | 03:50 AM

రాష్ట్రంలో సార్వత్రిక(పార్లమెంటు, అసెంబ్లీ) ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరగనుంది.

రేపే పోలింగ్‌

34 వేల కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి నిఘా

దాడులకు పాల్పడితే అణిచేస్తాం

ఈ విషయంలో ఈసీ సీరియస్‌

సరిహద్దులు తెరిచే ఉంటాయి

ఓటున్న వారు స్వేచ్ఛగా రావొచ్చు

83% పోలింగ్‌ లక్ష్యంగా చైతన్యం

సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా

అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సార్వత్రిక(పార్లమెంటు, అసెంబ్లీ) ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరగనుంది. నాలుగో దశలో నిర్వహిస్తున్న ఈ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని అసెంబ్లీ సహా పార్లమెంటు స్థానాల్లో పోలింగ్‌ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. 169 స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వివరించారు. 34,651 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయనున్నట్టు తెలిపారు. పోలింగ్‌ కేంద్రం మొత్తం కనిపించేలా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 12,438 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్టు తెలిపారు. 14 నియోజకవర్గాల్లో 100ు వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించనున్నట్లు మీనా వివరించారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌క్యాస్టింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్‌ ఏజెంట్‌గా ఉండే వ్యక్తి అదే పోలింగ్‌ స్టేషన్‌, లేదా నియోజకవర్గం ఓటరు అయినా అయి ఉండాలని పేర్కొన్నారు. ఇద్దరు రిలీఫ్‌ ఏజెంట్లను నియమించుకోవచ్చని, అయితే కేంద్రం లోపల ఒక సమయంలో ఒక ఏజెంట్‌ మాత్రమే ఉండాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద రెండంచెల భద్రతా వ్యవస్థ, సీపీటీవీ కవరేజీ ఉంటుందని తెలిపారు.

మీనా ఏమన్నారంటే..

  • పొరుగు రాష్ట్రాల్లోని వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు నిధులు, బహుమతులు, ఆహారం ఉచితంగా పంపిణీ చేయకూడదు.

  • కమ్యూనిటీ హాళ్ల వినియోగం, కూపన్లు, కార్డుల పంపిణీ, కమ్యూనిటీ కిచెన్‌ వంటివి దుర్వినియోగం కాకుండా చర్యలు.

  • ఆదివారం సాయంత్రమే పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో కేటాయించిన ప్రాంతాలకు వెళ్తారు. సోమవారం ఉదయం పోలింగ్‌ సమయానికి 90 నిమిషాల ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ కేంద్రంలోకి పీవో తప్ప ఎవరూ సెల్‌ఫోన్‌ తీసుకెళ్లకూడదు.

  • నియోజకవర్గంలో స్థానికుడైన వ్యక్తి.. పోటీలో ఉన్న అభ్యర్థి నుంచి అనుమతి తీసుకుంటే ఏజెంట్‌గా అవకాశం ఇస్తారు. ఆర్వోకి ఇవ్వడం, పోలీస్‌ ఎంక్వైరీలు ఏమీ ఉండవు.

  • అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికీ వ్యక్తిగతంగా ఒక వాహనం, వారి ఎన్నికల ఏజెంట్‌ కోసం మరో వాహనానికి అనుమతి ఉంటుంది. పార్లమెంటు స్థానంలో పోటీ చేసే అభ్యర్థికి వ్యక్తిగతంగా ఒక వాహనం, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో తన ఎన్నికల ఏజెంట్‌ కోసం మరొక వాహనానికీ అనుమతి ఉంటుంది. అభ్యర్థి వాహనాన్ని మరెవరూ వినియోగించకూడదు.

  • పోలింగ్‌ బూత్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం నిర్వహించకూడదు. రాజకీయ పార్టీలు పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి చిహ్నాలు లేకుండా స్లిప్పులు పంచుకోవచ్చు. పోలింగ్‌ రోజు రాజకీయ పార్టీలు ఓటర్లను బూత్‌కు తీసుకురాకూడదు.

  • మంత్రులు, ప్రజాప్రతినిఽధులు ఎవరూ గన్‌మెన్‌లతో పోలింగ్‌ కేంద్రాల్లోకి రాకూడదు.

  • పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత కోసం 58,948 మంది సివిల్‌ పోలీసులు, 2,038 మంది ఏపీఎస్పీ బలగాలు, 26,550 మంది(295 కంపెనీల) పారామిలిటరీ బలగాలను వినియోగిస్తున్నారు. గతంలో కన్నా 100 కంపెనీల బలగాలు అధికం. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద సీఆర్‌ఫీఎఫ్‌ భద్రత.

  • ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటన జరిగినా కఠినంగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోంది.

  • పోలింగ్‌ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను మూసివేయడం లేదు. ఏపీలో ఓటున్న వారు స్వేచ్ఛగా వచ్చి ఓటు వినియోగించుకోవచ్చు.

  • పోలింగ్‌ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు. ఈసారి రాష్ట్రంలో 10 లక్షల మంది కొత్త ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు.

  • ప్రైవేటు విద్యా సంస్థలకు పోలింగ్‌ రోజు, మరుసటి రోజు కూడా సెలవు ప్రకటించాలని సూచన.

  • పోలింగ్‌ కోసం 1.60 లక్షల ఈవీఎంల వినియోగం. సాంకేతిక సమస్యలు తలెత్తితే 15-20 నిమిషాల్లోపే మరమ్మతుకు, రిప్లే్‌సమెంట్‌కు చర్యలు.

  • 2019 ఎన్నికల్లో 79.84 శాతం మేర పోలింగ్‌ న మోదు కాగా, ఈసారి 82-83 శాతం మేర పోలింగ్‌ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - May 12 , 2024 | 07:48 AM