Share News

రైతన్నతోనూ రాజకీయమే!

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:39 AM

రాష్ట్రవ్యాప్తంగా కరువు, తుఫాన్‌కు నష్టపోయిన లక్షలాది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపుల కోసం సీఎం జగన్‌ బటన్‌ నొక్కి, నెల రోజులైనా.

రైతన్నతోనూ రాజకీయమే!

ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఉత్తుత్తి నొక్కుడు

కోడ్‌కు 10రోజుల ముందు నొక్కిన సీఎం

ఇప్పుడు ఈసీ అనుమతిస్తేనే.. చెల్లింపులట!

అస్మదీయ కాంట్రాక్టర్ల కోసం ఖజానా ఖాళీ

ఆ విషయం దాచి ‘విపత్తు’ రైతులకు మోసం

ఇరవై రోజులుగా తిరుగుతున్న బాధితులు

పోలింగ్‌కు ముందు ఖాతాల్లోకి వేసే ‘వ్యూహం’?

జగన్‌ ఓటు ఎత్తుగడలతో రైతులకు అవస్థలు!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా కరువు, తుఫాన్‌కు నష్టపోయిన లక్షలాది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపుల కోసం సీఎం జగన్‌ బటన్‌ నొక్కి, నెల రోజులైనా.. ఖాతాలకు నయాపైసా జమ కాలేదు. 2023 ఖరీఫ్‌లో కరువు, డిసెంబరులో మిచౌంగ్‌ తుఫాన్‌తో నష్టపోయిన 11.59లక్షలమంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,294కోట్లు విడుదల చేస్తున్నట్లు గత నెల ఆరో తేదీన జగన్‌ క్యాంప్‌ కార్యాలయం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కారు. కానీ అసలు నిధులే విడుదల చేయకుండా, బటన్‌ నొక్కడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్‌కు పది రోజుల ముందు సీఎం బటన్‌ నొక్కినా.. డబ్బులు విడుదల చేయలేదు. తీరా ఎన్నికల కోడ్‌ వచ్చాక.. నిధుల మంజూరుకు ఈసీ అనుమతి కావాలంటున్నారు. దీంతో రైతులు 20 రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు నిధులు ఇవ్వకుండా, ఆదరాబాదరాగా బటన్‌ నొక్కి, రైతుల్ని మోసం చేశారని మండిపడుతున్నారు. నిజానికి ఖజానాలో నిధులు నిండుకుని, బ్యాంకులకు సొమ్ము చేరలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

సీఎస్‌ తీర్మానం మర్మం ఏమిటో?: ఎన్నికల కోడ్‌కు ముందే ఖజానాలో ఉన్న సొమ్మంతా అధికార పార్టీకి అనుకూలమైన కాంట్రాక్టర్లకు ఊడ్చిపెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే పింఛన్ల పంపిణీకి కూడా సొమ్ము లేక జాప్యం చేశారని చెబుతున్నారు. అయితే, పోలింగ్‌కు ముందు రైతుల ఖాతాలకు జమ చేయడం ద్వారా రైతులను ఆకర్షించవచ్చనేది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా, ప్రభుత్వం నుంచి ఎవరికైనా వ్యక్తిగత లబ్ధి చేకూర్చాలంటే.. ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. అయితే కరువు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులతో నష్టపోయిన వారికి సాయం చేయడానికి కేంద్ర విపత్తుల నిర్వహణ చట్టంలో వెసులుబాటు ఉంది. ఈ నిబంధనతో నిధులు విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. కానీ ఖజానాలో నిధులు లేకపోయినా.. ముందు బటన్‌ నొక్కి, ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు నగదు చెల్లింపులు ఆపితే.. తర్వాత ఎన్నికల సంఘం అనుమతితో పోలింగ్‌ సమయంలో సొమ్ము విడుదల చేయవచ్చన్న ఉద్ధేశంతోనే ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్ర్కీనింగ్‌ కమిటీ తీర్మానం చేసి, తాజాగా ఈసీఐకి లేఖ రాసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ పోలింగ్‌కు ముందు నగదు చెల్లింపులకు ఎన్నికల సంఘం అనుమతిస్తే.. రైతులకు నగదు బదిలీ ద్వారా అధికార పార్టీకి సానుకూలత ఏర్పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం నిధులు విడుదలకు ఎప్పుడు అనుమతిస్తుందో స్పష్టత లేదు.

Updated Date - Apr 06 , 2024 | 03:39 AM