Share News

ఖాకీ స్వాహాపర్వం..?

ABN , Publish Date - May 21 , 2024 | 12:00 AM

ఎన్నికల వేళ నియోజకవర్గంలో పోలీసు స్వాహా పర్వానికి తెరలేపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు రూ.లక్షల్లో పట్టుబడిన డబ్బు స్వాహా చేసినట్లు చర్చ సాగుతోంది.

ఖాకీ స్వాహాపర్వం..?

పోలింగ్‌కు ముందు పలుచోట్ల నగదు పట్టివేత

లెక్కల్లో చూపని పోలీసులు

రూ.లక్షలు ఏమయ్యాయో తేలని వైనం

అధికార పార్టీ కోసం సర్వం ఒడ్డిన

ఓ పోలీసు అధికారి

కదిరి, మే 20: ఎన్నికల వేళ నియోజకవర్గంలో పోలీసు స్వాహా పర్వానికి తెరలేపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు రూ.లక్షల్లో పట్టుబడిన డబ్బు స్వాహా చేసినట్లు చర్చ సాగుతోంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నపుడు నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లరాదు. తీసుకెళ్తే అందుకు లెక్కలు, పత్రాలు ఉండాలి. లేదంటే పోలీసులు సీజ్‌ చేస్తారు. ఎక్కువ మొత్తం పట్టుబడితే కేసు కట్టాల్సి ఉంది. పోలింగ్‌కు రెండురోజుల ముందు పట్టణంలో పట్టుబడిన రూ.లక్షల డబ్బును పోలీసు అధికారులే తీసుకుని, కేసు నమోదు చేయకుండా తమ వద్దే ఉంచుకున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలా నియోజకవర్గం వ్యాప్తంగా పలుచోట్ల పట్టుబడిన నగదు పోలీసు పరమైనట్లు బహిరంగంగానే చర్యలు సాగుతున్నాయి. ఓ పోలీసు అధికార అయితే అధికార పార్టీ కోసం సర్వం ఒడ్డారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు.

11వ తేదీ రాత్రి కదిరిలోని నిజాంవలీ సర్కిల్‌లో చిన్నపాటి వాగ్వాదం సాగుతోంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ పార్టీ నాయకుడు ఓటర్లకు పంచడానికి తనకు తక్కువ ఇచ్చారనీ, రూ.8లక్షలు గ్రామానికి అవసరం కాగా.. రూ.3లక్షలే ఇచ్చారనీ, ఇది తనకవసరం లేదని, డబ్బు తీసుకు వచ్చిన వ్యక్తితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. దీంతో అగ్రహించిన ఆ గ్రామస్థాయి నాయకుడు.. తనకు డబ్బు వద్దంటూ పక్కనే ఉన్న తన కారులోకి విసిరాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసు అధికారి దీనిని గమనించి, కారులోని రూ.3 లక్షలు పట్టుకెళ్లినట్లు సమాచారం. కనీసం ఆ కారు, డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అన్న వివరాలు కూడా విచారించకుండానే డబ్బు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ డబ్బు పట్టుకున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. లెక్కలూ చూపలేదు. ఈ లెక్కన ఆ అధికారే స్వాహా చేశాడన్న మాట.

తలుపుల మండలంలో ఓ పార్టీ నాయకుడు డబ్బు పంచుతుండగా ఓ అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. ఆ డబ్బును స్వాధీనం చేసుకుని, అతడిపై కేసు నమోదు చేయాల్సి ఉంది. డబ్బు పట్టుకున్న అధికారి కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. పై అధికారి రంగప్రవేశం చేసి, ఆ డబ్బు తీసుకుని, కేసు నమోదు చేయకుండా పంపించేసినట్లు సమాచారం.

గాండ్లపెంట మండలంలోని రెక్కమాను వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు దాదాపు రూ.15లక్షలు తీసుకెళ్తూ పట్టుపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారి వెంటనే వారిని స్వయంగా గమ్యస్థానానికి చేర్చినట్లు సమాచారం.

కదిరి పట్టణంలో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బంది దగ్గరుండి తలుపుల మండలానికి మందు సరఫరా చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎన్నికలకు సంబంధంలేని ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టణంలో ఓ పార్టీవారిని వెంటబెట్టుకుని ఓటర్లకు డబ్బు పంచడానికి సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వీరుకూడా డబ్బు వెనకేసుకున్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తరువాత పోలీసుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై పట్టణంలో చర్చ సాగుతోంది. ఈవ్యవహరంలో ఓ పోలీసు అధికారి అన్నీ తానై ఓ పార్టీకి కొమ్ముకాసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ఇలా చేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీటిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, నిజానిజాలు నిగ్గుతేల్చాలని వారు కోరుతున్నారు.

Updated Date - May 21 , 2024 | 12:01 AM