బండి శ్రీనివాసరావుపై పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Feb 28 , 2024 | 03:24 AM
ఉద్యోగ, ఉపాధ్యాయుల ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.సంపత్‌బాబు, గౌరవాధ్యక్షుడు పమ్మి
నరసరావుపేట టౌన్, ఫిబ్రవరి 27: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.సంపత్‌బాబు, గౌరవాధ్యక్షుడు పమ్మి వెంకటరెడ్డి మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేటరూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణను చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారని, నరసరావుపేటలో జరిగిన మొదటి తాలూకా స్థాయి ఉద్యమంలో ఆయన స్వయంగా పాల్గొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత రెండు వారాలుగా అనేక వ్యయప్రయాసల కోర్చి ఉద్యమ కార్యాచరణలో భాగంగా చలో విజయవాడను నిర్వహించాల్సిన సమయంలో చైర్మన్ బండి శ్రీనివాసరావు మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకపోయినా, భాగస్వామ్య సంఘాలతో ఎటువంటి చర్చలూ లేకుండానే అర్ధంతరంగా రాత్రికిరాత్రి ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు.