Share News

మెగా డీఎస్సీ సాధనకు 36 గంటల దీక్ష భగ్నం చేసిన పోలీసులు

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:14 AM

తక్షణమే డీఎస్సీ విడుదల చేసి టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, సంఘం నేతలు స్థానిక ధర్నాచౌక్‌లో 36గంటల దీక్షకు దిగారు.

మెగా డీఎస్సీ సాధనకు 36 గంటల దీక్ష భగ్నం చేసిన పోలీసులు

విజయవాడ (ధర్నాచౌక్‌), జనవరి 27: తక్షణమే డీఎస్సీ విడుదల చేసి టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, సంఘం నేతలు స్థానిక ధర్నాచౌక్‌లో 36గంటల దీక్షకు దిగారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ఈ దీక్షను ప్రారంభించారు. నాడు-నేడు నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్‌ ఈ ఐదేళ్లలో టీచర్‌ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. నూతన విద్య విధానం సాకుతో తెలుగు మీడియం పాఠశాలలను తీసివేశారన్నారు. మెగా డీఎస్సీ విడుదల చేసి 50 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని జగన్‌ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మాట్లాడుతూ బీఈడీ, టీటీసీ పూర్తి చేసినవారు రాష్ట్రవ్యాప్తంగా పది లక్షలకు పైగా ఉన్నారన్నారు. వీరంతా రెండేళ్ల క్రితమే టెట్‌ రాసి డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాగా, ఈ దీక్షను అనుమతి లేదనే కారణంతో సాయంత్రం 5గంటలకు పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో సంఘం నేతలు వాగ్వాదానికి దిగారు.

Updated Date - Jan 28 , 2024 | 07:34 AM