నవంబరు నుంచి పోలవరం పనులు!
ABN , Publish Date - Jul 03 , 2024 | 04:41 AM
మీరు అనుమతులు ఇస్తే పోలవరం నిర్మాణ పనులు ఈ ఏడాది నవంబరు నుంచి ప్రారంభించాలని భావిస్తున్నాం’
ఎంత త్వరగా నిర్మిస్తే రాష్ట్ర ప్రజలకు అంత మేలు
అంతర్జాతీయ నిపుణులకు తెలిపిన మంత్రి నిమ్మల
డిజైన్లు, నిర్మాణాలను అధ్యయనం చేస్తామన్న నిపుణులు
మూడోరోజు మట్టి నమూనాల పరిశీలన, ఇంజనీర్లతో సమీక్ష
రోజంతా నిర్మాణ సంస్థల నుంచి అభిప్రాయాల సేకరణ
నేడు ప్రాథమిక అభిప్రాయాన్ని వెల్లడించనున్న నిపుణులు?
అత్యంత కీలకమైన రోజుగా భావిస్తున్న జల వనరుల శాఖ
అమరావతి-ఆంధ్రజ్యోతి/పోలవరం, జూలై 2: ‘మీరు అనుమతులు ఇస్తే పోలవరం నిర్మాణ పనులు ఈ ఏడాది నవంబరు నుంచి ప్రారంభించాలని భావిస్తున్నాం’ అని అంతర్జాతీయ నిపుణులకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ‘ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి. దీన్ని ఎంత త్వరగా నిర్మిస్తే.. ప్రజలకు అంత మేలు జరుగుతుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలు ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్‌ను దేవుడిగా కొలుస్తారు. ఇప్పుడు అమెరికా, కెనడాల నుంచి వచ్చిన మిమ్మల్ని కూడా అదే రీతిన గుర్తుంచుకుంటాం’ అన్నారు. అంతర్జాతీయ నిపుణులు మూడో రోజైన మంగళవారం.. దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్, సీపేజీకి గురైన ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, వైబ్రో కంప్రెషన్ తదితర అంశాలపై రోజంతా సమీక్షించారు. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు క్షేత్రానికి వచ్చిన మంత్రి నిమ్మల.. ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణ సంస్థలతో సమీక్షిస్తున్న అంతర్జాతీయ నిపుణులను పలకరించారు. రాష్ట్రం అదృష్టం బాగుండి వారు నాలుగు రోజుల ముందే వచ్చారని, లేకపోతే వరద వస్తున్నందున క్షేత్రస్థాయి అధ్యయనం సాధ్యమయ్యేది కాదని వ్యాఖ్యానించారు. మూడు రోజుల అధ్యయనంలో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి బుధవారం ప్రాథమికంగా ఒక అభిప్రాయాన్ని వెల్లడించాలని నిపుణులను అభ్యర్థించారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. సాధ్యమైనంత వరకూ మంగళవారం రాత్రి నిర్మాణ సంస్థల నుంచి సేకరించిన సమాచారం, క్షేత్రస్థాయిలో గుర్తించిన కట్టడాల లోపాలు అధ్యయనం చేస్తామని వెల్లడించారు.
బావర్, కెల్లర్, మేఘాతో నిపుణుల సమీక్ష..
డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మిచిన బావర్, కెల్లర్ సంస్థలతోపాటు మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో నిపుణులు సమీక్షించారు. నిర్మాణ సంస్థలు వెల్లడించిన అభిప్రాయాలు, ఇచ్చిన నివేదికలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాక వాటిపై బుధవారం ప్రాథమికంగా ఒక అభిప్రాయాన్ని నిపుణులు వెల్లడించనున్నారు. కేంద్ర జల సంఘానికి ప్రాథమిక నివేదికనూ ఇస్తారని జల వనరుల శాఖ భావిస్తోంది. అయితే,పోలవరం ప్రాజెక్టు వద్ద నాలుగు రోజుల పాటు జరిపిన సమీక్షలు, చేసిన అధ్యయనంపై ప్రాథమిక నివేదికను సీడబ్ల్యూసీకి ఇవ్వడానికి తమకు మరింత సమయం కావాలని అంతర్జాతీయ నిపుణులు కోరితే పరిస్థితి ఏమిటన్న ఆందోళన జలవనరుల శాఖలో నెలకొంది. దీంతో బుధవారం చాలా ముఖ్యమైన రోజుగా అధికారులు చెబుతున్నారు.
పోలవరం మట్టి నమూనాల పరిశీలన
ఎగువ కాఫర్ డ్యాం వద్ద సేకరించిన మట్టి నమూనాలను మంగళవారం అమెరికా, కెనడా నిపుణులు జియాన్ ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్ బెర్గర్, డేవిడ్ బి పాల్, రిచర్డ్ డొనెల్లీ ల్యాబ్ వద్ద పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ, డయా ఫ్రం వాల్ పునర్నిర్మాణం తదితర అంశాలపై, గతంలో దశల వారీగా జరిగిన పనులు, ఎదురైన అవాంతరాలు, సవాళ్లను ఎదుర్కొనడానికి, సమస్యలను పరిష్కరించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఎస్‌ఈ నరసింహమూర్తి, సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ అశ్విన్‌కుమార్, సీఎ్‌సఎంఆర్‌ఎస్ సైంటిస్ట్ మనీశ్ గుప్తా, పీపీఏ సీఈ రాజేశ్‌కుమార్, ప్రపంచబ్యాంకు, ఆఫ్రి, ప్రుగ్యో కన్సల్టెన్సీల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.