Share News

Polavaram : పోలవరం నిరాశ్రయులపై నిర్దయ!

ABN , Publish Date - May 26 , 2024 | 01:51 AM

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టునే కాదు, ఆ ప్రాజెక్టు నిర్మాణంతో నిరాశ్రయులైన వారిని కూడా సీఎం జగన్‌ నిర్దయగా గాలికి వదిలేశారు. ప్రతిపక్షంలో ఉండగా పోలవరం నిర్వాసితులకు ముందస్తుగా సహాయ పునరావాస ప్యాకేజీని ఇవ్వాలంటూ ఆయన హూంకరించారు.

Polavaram : పోలవరం నిరాశ్రయులపై నిర్దయ!

గత ఏడాదంతా పరిహారమే చెల్లించలేదు

41.15 మీటర్ల కాంటూరుతో' భారీగా తగ్గిన నిర్వాసితులు

వారినీ ఆదుకోని ప్రభుత్వం

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టునే కాదు, ఆ ప్రాజెక్టు నిర్మాణంతో నిరాశ్రయులైన వారిని కూడా సీఎం జగన్‌ నిర్దయగా గాలికి వదిలేశారు. ప్రతిపక్షంలో ఉండగా పోలవరం నిర్వాసితులకు ముందస్తుగా సహాయ పునరావాస ప్యాకేజీని ఇవ్వాలంటూ ఆయన హూంకరించారు. అధికారం చేపట్టాక రివర్స్‌లో అటు ప్రాజెక్టును, ఇటు నిర్వాసితులను జగన్‌ ఎండబెడుతున్నారు. ఈ విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. వానలొచ్చినా .. వరదలొచ్చినా, నిర్వాసితులకు రేషన్‌ బియ్యంతోనే సరిపెట్టారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టి శాశ్వతంగా సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టలేదు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల జలాలను నిల్వ చేయాల్సి ఉంటే .. దానిని 41.15 మీటర్ల కాంటూరులో 115 టీఎంసీల నిల్వకే కుదించారు. 45.72 మీటర్ల కాంటూరులో గరిష్ఠ నీటి నిల్వకోసం 1,06,006 కుటుంబాలను తరలించాల్సి ఉంది. ఇందులో 12,060 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించారు. ఇంకా 94,946 కుటుంబాలకు సహాయ పునరావాసం కల్పించాల్సి ఉంది. కానీ.. దానిని 41.15 మీటర్ల కాంటూరుకు పరిమితం చేయడం ద్వారా పునరావాస కుటుంబాలను 20,946కు కుదించారు. ఇందులో 12,060 కుటుంబాలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించిన దరిమిలా, ఇక మిగిలింది 8,886 కుటుంబాలు. ఇంత భారీ సంఖ్యలో సాయం అవసరమైన కుటుంబాలను కుదించినా, వాటి పునరావాస కార్యక్రమాలను అమలు చేయడంపైనా జగన్‌ దృష్టి సారించలేదు.

అథారిటీ గణాంకాల ప్రకారం...

పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూరుకు పరిమితం చేస్తే 20,946 కుటుంబాలు ముంపునకు గురవుతాయని కేంద్రానికి రాష్ట్ర జల వనరుల శాఖ నివేదించింది. ఇందులో 12,006 కుటుంబాలను గతంలోనే పునరావాస కాలనీలకు తరలించారు. జగన్‌ వచ్చాక తరలించింది 791 కుటుంబాలను మాత్రమే. ఇలా ఇప్పటిదాకా 12,797 కుటుంబాలకు పునరావాసం అందింది. ఇక మిగిలిన 8149 కుటుంబాల తరలింపులో షెడ్యూల్‌ తేదీలను ఎప్పటికప్పుడు మార్చుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో 6,999 కుటుంబాలను .. మేనెలలో 1,554 కుటుంబాలను .. జూన్‌ నెలలో 556 కుటుంబాలను .. జూలైలో 160 కుటుంబాలను ..సెప్టెంబరులో 1,430 కుటుంబాలను .. అక్టోబరులో 855 కుటుంబాలను .. నవంబరులో 2,700 కుటుంబాలను .. డిసెంబరులో 4,733 కుటుంబాలను .. ఈ ఏడాది జనవరిలో 855 కుటుంబాలను .. ఫిబ్రవరిలో 2,700 కుటుంబాలను .. మార్చిలో 4,594 కుటుంబాలను .. ఏప్రిల్‌లో 855 కుటుంబాలను .. మేనెలలో మరో 2,700 కుటుంబాలను .. జూన్‌లో 4,594 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని లక్ష్యంగా జగన్‌ నిర్దేశించారు. కానీ, ఇవేమీ అమలు కాలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. సురక్షిత ప్రాంతాలకు తరలించనూ లేదు. మరోవైపు, సకాలంలో ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను నిర్మించకపోవడంతో, డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. ఈప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ నిర్మాణం పనులను రూ.1,558.13 కోట్లతో రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామంటూ ప్రాజెక్టును ఓ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. కానీ, అది ఆ ఒప్పందాన్ని అమలు చేయలేదు. హెడ్‌పర్క్స్‌ పనులు పూర్తి చేయడం మాటెలా ఉన్నా .. ప్రాజెక్టు పనుల కారణంగా నిరాశ్రయులైన వారినీ జగన్‌ పూర్తిగా వరదలకు వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 26 , 2024 | 01:52 AM