Share News

నిధులు మావే.. యజమానులమూ మేమే!

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:08 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధులు ఇస్తున్న యజమానిగా అధికారమంతా కేంద్రానిదేనని.. పనులు పూర్తిచేస్తానని అంగీకరించిన కాంట్రాక్టు సంస్థగా బాధ్యతంతా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. 2014 తర్వాత పోలవరం నిర్మాణానికి

నిధులు మావే.. యజమానులమూ మేమే!

మా అధీనంలోనే పోలవరం ప్రాజెక్టు: పీపీఏ

సకాలంలో పూర్తిచేసే బాధ్యత మాత్రం మీదే

రాష్ట్ర ప్రభుత్వానికి అథారిటీ స్పష్టీకరణ

పనులు సొంతంగా చేపడతామంటే కుదరదు

కేంద్ర సంస్థలు ఆమోదించిన డిజైన్లను కాంపోనెంట్‌ వారీగా అమలు చేయాలి

పనులన్నీ వాప్కోస్‌ పర్యవేక్షణలో సాగాలి

నాణ్యతపై పర్యవేక్షణకు క్వాలిటీ కంట్రోల్‌ లేబొరేటరీ

భూసేకరణ, పునరావాసం బాధ్యతా రాష్ట్రానిదే

నిర్వాసితుల వినతులు ఎలా పరిష్కరించారో కేంద్రానికి నివేదించాలి

తేల్చిచెప్పిన ప్రాజెక్టు అథారిటీ

ఈ షరతులకు అంగీకరిస్తే ఒప్పందంపై సంతకం చేయాలని సూచన

అది జరిగాకే పనులు ముందుకు కదులుతాయని స్పష్టీకరణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధులు ఇస్తున్న యజమానిగా అధికారమంతా కేంద్రానిదేనని.. పనులు పూర్తిచేస్తానని అంగీకరించిన కాంట్రాక్టు సంస్థగా బాధ్యతంతా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. 2014 తర్వాత పోలవరం నిర్మాణానికి సంపూర్ణంగా నిధులు మంజూరు చేస్తున్నందున యాజమాన్య హక్కులన్నీ తనవేనని తేల్చిచెప్పింది. పనులు పూర్తిచేసే బాధ్యతను చేపట్టినందున.. నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును పూర్తిచేసి అప్పగించే బాధ్యత మాత్రం రాష్ట్రానిదేనని తెలిపింది. పలు షరతులు విధిస్తూ అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) ప్రతిని రాష్ట్ర జలవనరుల శాఖకు రెండ్రోజుల కిందట పంపింది. షరతులను పరిశీలించి ఆమోదయోగ్యమైతే సంతకాలు చేసి పంపాలని పేర్కొంది. అంతే కాకుండా ప్రాజెక్టును నిర్మించే క్రమంలో భూసేకరణ, నిర్వాసితులకు సహాయ పునరావాసం, నష్ట పరిహారం చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. ‘సహాయ పునరావాసానికి సంబంధించి ప్రజల నుంచి వస్తున్న వినతులను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. భూసేకరణ, సహాయ పునరావాసానికి సంబంధించి ప్రజా వినతులు ఎలా పరిష్కరించారో పీపీఏ ద్వారా కేంద్రానికి వివరించాలి. ప్రాజెక్టు నిర్మాణ పనులు రాష్ట్రప్రభుత్వమే సొంతంగా చేపడతామంటే కుదరదు. నిర్మాణ సంస్థ డిజైన్లను రూపొందించి పీపీఏకు పంపించాలి. అథారిటీ.. ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర సంస్థతో, కేంద్ర జల సంఘంతో, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతుంది. ఈ సంస్థలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన డిజైన్లను.. కాంపోనెంట్‌ వారీగా రాష్ట్రం అమలు చేయాల్సిందే. ఈ పనులన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ పర్యవేక్షణలో సాగాలి. అలాగే పనుల నాణ్యతపై పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్‌ లేబొరేటరీని ఏర్పాటు చేయాలి’ అని పేర్కొంది. వీటికి అంగీకరిస్తే తక్షణమే ఎంవోయూపై సంతకాలు చేసి పంపాలని పీపీఏ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం జరిగాకే.. పోలవరం పనులు ముందుకు సాగుతాయని తెలిపింది.

రాష్ట్ర షరతుల తోసివేత..

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో ఏర్పడిన పీపీఏ.. తన పరిధి ఏమిటో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు ఏమిటో 2016లోనే ఎంవోయూ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు ప్రాజెక్టు కీలక దశకు చేరుకున్న తరుణంలో ఎంవోయూ చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే రాష్ట్రప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఇందులో ప్రధానమైనది.. పోలవరం ప్రాజెక్టు అంతా రాష్ట్రం అధీనంలోనే ఉండాలని.. కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు ప్రాజెక్టు క్షేత్రంలోకి వెళ్లాలంటే ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే పీపీఏ వీటిని పూర్తిగా తోసిపుచ్చింది. తన షరతులతో ఎంవోయూ ప్రతిని రాష్ట్రానికి పంపింది.

అంతేలేని అంచనా కథ

జగన్‌ గద్దెనెక్కి ఐదేళ్లు సమీపించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నా.. పోలవరం అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం లభించలేదు. అదో అంతులేని కథగా మారింది. గతేడాది జూన్‌ 5న పోలవరం నిర్మాణం కోసం రూ.12,911 కోట్లు, మరమ్మతుల కోసం వ్యయం చేసిన రూ.2,000 కోట్లను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ఆర్థికశాఖ నోట్‌ను విడుదల చేసింది. కానీ దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం కావాలని మెలికపెట్టింది. ఈ మధ్యలో జగన్‌ కనీసం నాలుగైదుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. ఈ నిధుల కోసం ఒత్తిడి చేసిన దాఖలాలే లేవు. కేంద్ర కేబినెట్‌ ఆమోదం తప్పనిసరని అవగాహన ఉన్నా మోదీని ఒప్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగినా పోలవరం ఫైలు దాని ముందుకు వెళ్లలేదు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ రానున్న నేపథ్యంలో ఇప్పట్లో కేంద్ర కేబినెట్‌ ముందుకు అది వెళ్లడం అనుమానమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Feb 28 , 2024 | 03:08 AM