విష ప్రచారం సరికాదు: మంత్రి కొలుసు
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:25 AM
విజయవాడ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా వరదల ఉపద్రవం ముంచుకొచ్చింది. దానిని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంది.
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘విజయవాడ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా వరదల ఉపద్రవం ముంచుకొచ్చింది. దానిని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంది. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే పనిలో ఉంటే... వైసీపీ నేతలు పనిగట్టుకుని బురద జల్లేలా విమర్శలు చేయడం సరికాదు’ అని మంత్రి కొలుసు పార్థసారఽథి ఖండించారు. సోమవారం ఆయన విజయవాడలోని జిల్లా కలెక్టరు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు అందించాలి. అలాకాకుండా తమ సొంత పత్రికలో విషం కక్కుతూ వార్తలను ప్రచురిస్తూ విషప్రచారం చేయడం సరికాదు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రస్తుత విపత్తు దాపురించింది. గతఐదేళ్లూ కాలువల్లో తీసిన పూడిక మట్టిని కూడా వైసీపీ నాయకులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. వరద నష్టం అంచనా వేయడానికి 1,700 ఎన్యూమరేషన్ బృందాలను ఏర్పాటు చేశాం. ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించాం. 5 వేల మంది సిబ్బందితో విజయవాడ ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి’ అని మంత్రి కొలుసు వివరించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఇనుప బోట్లు ఢీకొన్న ఘటన కచ్చితంగా విద్రోహ చర్యేనని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం ఏలూరు జిల్లా నూజివీడులో వరద బాధిత గ్రామాల సర్పంచ్‌లకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రకాశం బ్యారేజీ గేట్లను ఇనుప బోట్లు ఢీ కొట్టడం, నిజంగా కుట్ర అయితే.. వారి కుతంత్రం నెరవేరి వరద మరింత పెరిగితే కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని అనేక గ్రామాలు కనుమరుగయ్యేవి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. దోషులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదు’ అని మంత్రి తెలిపారు.