ప్రాణాలు తీస్తున్న ఫార్మా!
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:45 AM
రాష్ట్రంలో ఫార్మారంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.
నిత్యం ప్రమాదాలు, మరణాలు
యాజమాన్యాలకు పట్టని నిబంధనలు
ఉమ్మడి విశాఖలో 2019 నుంచి
119 ప్రమాదాలు..120 మరణాలు
అధికారుల పర్యవేక్షణ పూజ్యం
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సెల్ఫ్
సర్టిఫికేషన్‌తో ఉద్యోగులకు ముప్పు
ఉమ్మడి విశాఖలో ఏటా ప్రమాదాలు
తెలంగాణలో వందలాది ఫార్మా కంపెనీలు
ఏపీతో పోలిస్తే ప్రమాదాలు చాలా తక్కువ
ఎసెన్షియా విషాదంపై సీఎస్,
డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
రెండువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఫార్మారంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం వారి కోసం కొత్తగా ఫార్మాసిటీలు నిర్మిస్తోంది. భారీ ఎత్తున మందులు తయారీ చేస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఫార్మా కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ అక్కడ ప్రమాదాల సంఖ్య చాలా తక్కువ. మరణాల రేటూ స్వల్పమే. ఇక్కడ మాత్రం ఫార్మా కంపెనీలు నిత్యం మండుతూనే ఉన్నాయి. విశాఖ పరిసరాల్లోని పరవాడ, అచ్యుతాపురం, నక్కపల్లిని ఫార్మా క్లస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటా కనీసం ఐదుకు తక్కువకాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. పది మందికిపైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. నాలుగేళ్ల క్రితం విశాఖలో జరిగిన ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదంలో 12మంది చనిపోయారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే మృతుల సంఖ్య అధికంగా ఉంటోంది. అదే తెలంగాణలో స్వల్పంగా ఉంటోంది. ఇందుకు కారణం ఏంటి? ఎక్కడ లోపం ఉంది? అనేదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బల్క్ డ్రగ్స్ తయారీలోనే ఎక్కువ
ఫార్మా కంపెనీలు రెండు రకాలు. ఒకటి బల్క్ డ్రగ్స్ తయారు చేసేవి. మరొకటి ఫార్ములేషన్స్ తయారు చేసేవి. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఫార్ములేషన్స్ అంటే మాత్రలు, ఆయింట్‌మెంట్లు, ఇంజక్షన్లు వంటివి తయారు చేస్తాయి. వీటికి రియాక్టర్లు అవసరం లేదు. ముడి పదార్థాలు తెచ్చుకొని వాటిని కలిపి, మందులు తయారు చేసుకుంటాయి. ఇక్కడ ప్రమాదాలు జరగడానికి అవకాశం లేదు. ఏదైనా జరిగితే ప్రాసె్‌సకు సంబంధం లేనివే ఉంటాయి. తెలంగాణలో ఎక్కువ శాతం ఫార్ములేషన్స్ కంపెనీలే. అందుకే అక్కడ ప్రమాదాలు తక్కువ. ఇక బల్క్ డ్రగ్స్ అంటే... రసాయనాలు, సాల్వెంట్స్, పౌడర్లు పెద్దఎత్తున తయారు చేస్తారు. వీటికి రియాక్టర్లు అవసరం. ఫార్ములేషన్స్‌కు అవసరమైన ముడి పదార్థాలన్నీ ఇక్కడే తయారవుతాయి. బల్క్ డ్రగ్స్‌ను తయారు చేయకపోతే పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. వీటిలో రియాక్టర్లు, ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. వీటితో జాగ్రత్తగా వ్యవహరించకపోతే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయి.
‘సెల్ఫ్ సర్టిఫికేషన్’తో తంటాలు
ఫార్మా కంపెనీల్లో జగన్ ప్రభుత్వం ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ విధానం తీసుకు వచ్చింది. ఏదైనా కంపెనీ ఏర్పాటు చేసినపుడు అక్కడ భద్రతాపరంగా కొన్ని ప్రమాణాలు పాటించాలి. వాటిని అధికారులు తనిఖీ చేసి సర్టిఫై చేయాలి. కానీ జగన్ ప్రభుత్వ విధానం వల్ల అధికారులు తనిఖీ చేయకుండా.. ఏ సంస్థకు ఆ సంస్థ ‘మేము అన్నీ చేసేశాం’.. అని ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ చేసి ఒక పత్రం పడేస్తే ఉత్పత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. దానివల్ల పలు కంపెనీలు ఖర్చును తగ్గించుకోవడానికి భద్రత ఏర్పాట్లు చేయకుండా మమ అనిపిస్తున్నాయి. అటువంటి చోట్ల ప్రాణనష్టం అధికంగా ఉంటోంది.
శిక్షణ కూడా పూజ్యమే
ఫార్మా కంపెనీలో నైపుణ్యం గల వారిని నియమించుకోవాలి. వారికి రసాయనాలు, పౌడర్లు, అక్కడ ఉండే యంత్రాలపై అవగాహన ఉండాలి. ప్రమాదకర పరిస్థితులు వస్తే ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వాలి. వాటిపై రెగ్యులర్‌గా మాక్‌డ్రిల్ నిర్వహించాలి. ఇది నిత్యం జరగాలి. ఇవన్నీ ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’లో ఉంటాయి. కానీ చాలామంది వీటిని పాటించడం లేదు. అందువల్లే ప్రమాదాలు జరిగినపుడు ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. డిగ్రీ చదివిన యువతను రూ.15వేల జీతానికి తీసుకువచ్చి పనులు చేయించుకుంటున్నారు. అధిక లాభాలు సంపాదించాలనే ఆశతో నిబంధనలు పాటించడం లేదు. కొత్తగా వస్తున్న కంపెనీలన్నీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి. వాటిని తనిఖీ చేసి సర్టిఫై చేసే పరిజ్ఞానం ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అధికారుల్లో చాలామందికి లేదు. థర్డ్ పార్టీతో తనిఖీలు చేయించి నివేదికలు తీసుకుంటున్నారు. తనిఖీలకు వచ్చే థర్డ్ పార్టీలను ఫార్మా యాజమాన్యాల్లో కొందరు లోబరుచుకొని తప్పుడు నివేదికలు ఇప్పించుకుంటున్నారు. ఇది కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఎసెన్షియా విషయానికి వస్తే రెండేళ్ల క్రితమే థర్డ్ పార్టీ తనిఖీ చేసి లోపాలను నివేదించింది. కానీ వారు దానిని పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
విశాఖపట్నం పరిసరాల్లోని పరవాడలో 90, అచ్యుతాపురంలో 208, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో 40 ప్రమాదకరమైన ఫార్మా కంపెనీలు ఉన్నాయి.
2019 నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఫార్మా కంపెనీల్లో 119 ప్రమాదాలు జరగగా, 120 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఎసెన్షియా బాధితుల పరామర్శ
సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు
ఫార్మా రంగం అంటే... జబ్బులను నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడేదే. కానీ రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు వరస ప్రమాదాలతో ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్నాయి. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో ఉద్యోగులు మృత్యువాత పడుతున్నారు. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడం, ఉద్యోగులకు కనీస అవగాహన కల్పించకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే ప్రమాదాలకు కారణాలని తెలుస్తోంది.
బజరింగ్ సిస్టమ్ పాటించాలి
రియాక్టర్లు ఉపయోగించే పరిశ్రమలతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న అన్ని కంపెనీల్లో బజరింగ్ విధానం అమలు చేయాలి. రియాక్టర్లలో నిర్ణీత ఉష్ణోగ్రత దాటితే అవి పేలిపోతాయి. అలా జరగకుండా ఆటోమేటిక్ స్విచ్చాఫ్ సిస్టమ్ పెట్టుకోవాలి. దానివల్ల ప్రాసెస్ ఆగిపోతుంది. ప్రమాదం తప్పుతుంది. అనుకోనిది ఏదైనా జరిగితే అలారమ్ మోగించే విధానం ఉండాలి. అంతా అప్రమత్తమై బయటకు వెళ్లిపోవచ్చు. ఎసెన్షియాలో ఇలాంటి ఏర్పాట్లు లేకపోవడం వల్ల భారీ ప్రాణనష్టం జరిగింది. ముందుజాగ్రత్తగా మాక్ డ్రిల్స్ చేయించాలి. పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో 30 పడకల ఆస్పత్రులను నిర్మించాలి.
- దాడి మోహన్‌రావు, వైస్ ప్రెసిడెంట్,
ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్