Share News

తాగునీటి సమస్యకు రూ.1500 కోట్లతో శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:04 AM

‘‘జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా 12 జిల్లాలను ఎంపిక చేస్తోంది. రాష్ట్రంలో కృష్ణాజిల్లాకు అధిక ప్రాఽధాన్యత ఇచ్చి రూ.1500 కోట్లను మంజూరు చేయిస్తా. మిగిలిన మొత్తాన్ని ఏషియన్‌ బ్యాంకు ద్వారా రుణం తీసుకుని కృష్ణాజిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా’’ అని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చెప్పారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తాగునీటి సమస్యకు రూ.1500 కోట్లతో శాశ్వత పరిష్కారం

- జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా అందరికీ తాగునీరు

- ఏడాదిన్నరలో బందరు పోర్టు నిర్మాణం పూర్తి

- పోర్టుకు అనుబంధంగా 4 వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి

- మచిలీపట్నం-రేపల్లె మధ్య రైల్వేలైన్‌ను కలుపుతాం

- మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి):

‘‘జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా 12 జిల్లాలను ఎంపిక చేస్తోంది. రాష్ట్రంలో కృష్ణాజిల్లాకు అధిక ప్రాఽధాన్యత ఇచ్చి రూ.1500 కోట్లను మంజూరు చేయిస్తా. మిగిలిన మొత్తాన్ని ఏషియన్‌ బ్యాంకు ద్వారా రుణం తీసుకుని కృష్ణాజిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా’’ అని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చెప్పారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణాజిల్లాను యూనిట్‌గా తీసుకుని జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌లు ఇస్తామన్నారు. ఈ అంశంపై మంత్రి కొల్లు రవీంద్రతో కలసి ఇప్పిటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో చర్చించినట్లు తెలిపారు. ఈ పథకం అమలు కోసం రానున్న రోజుల్లో తన వంతుగా తగు చర్యలు తీసుకుంటానన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏటా 200 టీఎంసీల నీరు కృష్ణాడెల్టాకు అందుబాటులో ఉంటాయన్నారు.

క్యాపిటల్‌ పోర్టు సిటీగా మచిలీపట్నం

మచిలీపట్నం పోర్టు రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉండటంతో క్యాపిటల్‌ పోర్టు సిటీగా పిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాఽజధాని అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టుకు 40 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే రహదారుల నిర్మాణం భవిష్యత్తులో చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీని ఏర్పాటు చేయాల్సి ఉందని, సాల్ట్‌ భూముల్లో బీపీసీఎల్‌ ప్రాజెక్టు పెట్టడం కష్టమని నివేదికలు ఇచ్చిన కారణంతోనే ఈ ప్రాజెక్టు రామాయపట్నంకు తరలిపోయిందన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా 4 వేల ఎకరాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మంత్రి కొల్లు రవీంద్రతోపాటు జిల్లాకు చెందిన శాసన సభ్యులతో మాట్లాడి, ఈ విషయంపై సీఎం చంద్రబాబు ధృష్టికి తీసుకువెళ్లామన్నారు. క్యాపిటల్‌ సిటీ పోర్టులుగా సింగపూర్‌, ముంబయి, చెన్నై పోర్టులు ఉన్నాయని, మచిలీపట్నం పోర్టు కూడా ఈ కోవలోకి వస్తుందన్నారు. పోర్టుకు అనుబంధంగా రెండు, మూడు ఇండస్ర్టియల్‌ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. కంటెయినర్‌ కార్పొరేషన్‌తో మాట్లాడి కేపీఎఫ్‌జీ, డెల్లాయ్‌ వంటి కంపెనీలతో మచిలీపట్నంలో పరిశ్రమలను ఏర్పాటు చేయించి, రైల్వేలైన్‌, జాతీయ రహదారులను అనుంధానం చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు.

పెత్తనం చేసినా, ఎటకారం చేసినా ప్రజలు పక్కన పెడతారు

మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లలో పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో అధికారులు ఆయనకే అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎంపీ బాలశౌరి సమాధానమిస్తూ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సేవ చేయాలన్నారు. అలా కాకుండా ప్రజలపై పెత్తనం చేయాలని చూడటం, ఎటకారం, ఓవరాక్షన్‌ చేసిన కారణంగానే 53 వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థిని మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు ఓడించారని చెప్పారు. బియ్యం మాయం కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, త్వరలో ఈ అంశాన్ని సిట్‌కు ప్రభుత్వం అప్పగిస్తుందని తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికారులు వారే ఉంటారని, ప్రభుత్వం చెప్పినట్లుగానే నడుచుకుంటారని, కిందిస్థాయి అధికారుల పనితీరును పైఅధికారులు గమనిస్తూనే ఉంటారని ఎంపీ వివరించారు.

మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైన్‌ను కలుపుతాం

మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఏడాదిన్నర కాలంలో పూర్తవుతుందని, సరుకుల ఎగుమతులు, దిగుమతులు, రవాణా కోసం మచిలీపట్నం-రేపల్లె మధ్య రైలు మార్గం ఏర్పాటు చేస్తామని ఎంపీ తెలిపారు. ఇందుకు సంబంధించి సర్వే పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లను విడుదల చేసిందని, దీంతో పాటు బాపట్ల-తెనాలి రైలు మార్గాల అనుసంధానంపైనా సర్వే జరుగుతోందన్నారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి ఆరులేన్లుగా విభజించే అంశంపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. కత్తిపూడి నుంచి కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులను భవిష్యత్తులో చేయిస్తామని చెప్పారు. పామర్రు-చల్లపల్లి మధ్య రహదారి రాష్ట్ర రహదారిగా ఉందని, దీనిని జాతీయ రహదారిగా మార్పు చేసేందుకు ప్రధాన మంత్రి సంతకం చేయాల్సి ఉందని, దీంతో ఈ రహదారి అభివృద్ధిలో కొంతమేర ఆలస్యం జరుగుతోందన్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా తాను ఉన్నానని, ఈ ఆస్పత్రిలో తక్కువ ధరలకు అత్యున్నత వైద్యసేవలు అందుతున్నాయని, వీటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Updated Date - Dec 29 , 2024 | 01:04 AM