Share News

ఐఐఎంకు శాశ్వత క్యాంపస్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:47 AM

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం (ఐఐఎంవి) శాశ్వత క్యాంపస్‌ సిద్ధమైంది. నగర శివారున ఆనందపురం మండలం

ఐఐఎంకు శాశ్వత క్యాంపస్‌

విశాఖ క్యాంపస్‌ భవనాలు పూర్తిస్థాయిలో సిద్ధం

నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం (ఐఐఎంవి) శాశ్వత క్యాంపస్‌ సిద్ధమైంది. నగర శివారున ఆనందపురం మండలం గంభీరంలో 241.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ క్యాంప్‌సను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఇతర అధికారులు కూడా వర్చువల్‌ విధానంలోనే పాల్గొంటారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖకు ఐఐఎంను కేటాయించింది. భవనాల నిర్మాణానికి అవసరమైన రూ.472.61 కోట్లను కేంద్రం మంజూరు చేయగా, గత తెలుగుదేశం ప్రభుత్వం ఆనందపురం మండలంలోని గంభీరంలో 241.5 ఎకరాలు కేటాయించింది. శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి 2015 జనవరి 17న అప్పటి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భూమి పూజ నిర్వహించారు. ఈ పనులు పూర్తికావడంతో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. శాశ్వత క్యాంప్‌సను 62,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. దీనిలో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌, క్రికెట్‌ మైదానం, ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌కు అనుగుణమైన సదుపాయాలు, జిమ్‌, యోగా, మెడిటేషన్‌ సెంటర్లను ఏర్పాటుచేశారు. 1500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుచేశారు. కాగా, గత తొమ్మిదేళ్ల నుంచి ఏయూలోని తాత్కాలిక క్యాంప్‌సలో ఐఐఎం తరగతులు నిర్వహిస్తున్నారు. తొలిబ్యాచ్‌ 2015లో ప్రారంభమైంది.

Updated Date - Feb 20 , 2024 | 07:17 AM