Share News

జనం డబ్బు జగన్‌ డప్పు!

ABN , Publish Date - Mar 13 , 2024 | 04:05 AM

అటు సొంత మీడియాకు, ఇటు బాకా ఊదే కూలి మీడియాకూ జనం సొమ్మును దోచిపెడుతున్నారు. అసలు లక్ష్యాలు, ఉద్దేశాలు ఏవైనా జగన్‌కు భజన చేయడం, వైసీపీకి బాకాలూదడం, ప్రత్యర్థులను ట్రోల్‌ చేయడం కోసమే ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ (ఏపీడీసీ) ఏర్పాటు చేశారు.

జనం డబ్బు జగన్‌ డప్పు!

డిజిటల్‌ కార్పొరేషన్‌కు సొమ్ములు కుమ్ముడు

ఒకే పథకానికి ఏడాదిలో నాలుగుసార్లు బటన్‌ నొక్కి... నొక్కిన ప్రతిసారీ ప్రకటనల రూపంలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సొంత రోత పత్రికకు కుమ్మరించడం... ఒక స్కామ్‌!

‘ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌’ పేరుతో ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ‘పేటీఎం’ బ్యాచ్‌కు జనం సొమ్ము పందేరం చేయడం మరో స్కామ్‌!

ఈ ఏడాది ఇప్పటికే రూ.100 కోట్లు

మరో రూ.40 కోట్లు కావాలన్న ఎండీ

వెంటనే రూ.20 కోట్లు ఇచ్చేసిన సర్కారు

ప్రభుత్వ సంస్థగా ‘డిజిటల్‌ కార్పొరేషన్‌’

చేసేది జగన్‌ భజన, విపక్షాలపై దూషణలు

పేటీఎం బ్యాచ్‌, కూలి మీడియాకు

ఇక్కడి నుంచే సొమ్ములు

ఇక్కడా వైసీపీ సోషల్‌ మీడియా ఉద్యోగులే!

ప్రభుత్వ ధనంతో వైసీపీ ప్రచారం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అటు సొంత మీడియాకు, ఇటు బాకా ఊదే కూలి మీడియాకూ జనం సొమ్మును దోచిపెడుతున్నారు. అసలు లక్ష్యాలు, ఉద్దేశాలు ఏవైనా జగన్‌కు భజన చేయడం, వైసీపీకి బాకాలూదడం, ప్రత్యర్థులను ట్రోల్‌ చేయడం కోసమే ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ (ఏపీడీసీ) ఏర్పాటు చేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్‌గా పేరొందిన వారందరికీ ఈ సంస్థ ద్వారానే జీతాలు, ప్రకటనల రూపంలో సొమ్ములు అందుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఈ కార్పొరేషన్‌ ద్వారా రూ.100 కోట్లు పంచిపెట్టారు. ఎన్నికలు ముంచుకొస్తున్నందున ధాటిగా పేటీఎం బ్యాచ్‌ మరింత ‘కష్టపడాల్సి’ ఉందని మళ్లీ జనం సొమ్ముకు టెండర్‌ పెట్టారు. తమకు మరో రూ.40 కోట్లు ఇవ్వాలని ఏపీడీసీ వీసీ, ఎండీ ప్రభుత్వాన్ని అడగడమే ఆలస్యం... రూ.20 కోట్లు ఇచ్చేశారు. దీనిపై జీవో కూడా వచ్చేసింది. అంటే... డిజిటల్‌ మీడియా కార్పొరేషన్‌కు రూ.120 కోట్లు ధారపోశారన్న మాట! అంత డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలకు ఏం ఒరగబెట్టిందో... చూద్దామంటే మచ్చుకు ఒక్క మేలూ కనపడదు. టీడీపీ హయాంలో ప్రభుత్వ శాఖలకు కంటెంట్‌ ఇవ్వడానికి ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠను పెంచేందుకు అవసరమైన సమాచారం, సదస్సులు, సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాల వివరాలను ‘కంటెంట్‌ కార్పొరేషన్‌’ అన్ని శాఖలకు అందించేది. దీనినే 2020లో జగన్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌గా మార్చేశారు. దీని ద్వారా అన్ని జిల్లాల్లో డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని 2021లో ప్రకటించారు. ఇప్పటి దాకా కడపలో నమూనా డిజిటల్‌ లైబ్రరీ మాత్రమే ఏర్పాటు చేశారు. అంతకుమించి ఒక్క అడుగూ పడలేదు. మరి వందల కోట్ల డబ్బును డిజిటల్‌ కార్పొరేషన్‌ ఏం చేస్తున్నట్టు?

బాకా ఊదడం.. బురద చల్లడం!

ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌లో సుమారు 150 మంది పని చేస్తున్నారు. ప్రతినెలా వీరికి రూ.30వేల నుంచి లక్షన్నర దాకా చెల్లిస్తున్నారు. వీళ్లకు ఇచ్చేది జనం డబ్బులు. చేయించుకునేది సొంత పని! జగన్‌ భజన చేయడం, విపక్షాలపై బురదచల్లడం, విపక్షాలను సమర్థించే వారిని ట్రోల్‌ చేయడం! దీంతోపాటు... ‘కూలి మీడియా’లా పని చేసే యూట్యూబ్‌ చానళ్లకు కూడా డిజిటల్‌ కార్పొరేషన్‌ ద్వారానే డబ్బులు అందుతాయి. జగన్‌కు బాకాలూదే ప్రైవేట్‌ వెబ్‌సైట్‌లు, యూట్యూబ్‌ చానళ్లకు యాడ్స్‌ రూపంలో కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారు. నిజానికి... వైసీపీ సోషల్‌ మీడియా, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌... రెండు కలగాపులగంలా కలిసిపోయాయి. అక్కడ పని చేసే వారే ఇక్కడా పని చేస్తారు. జగన్‌ సొంత మీడియా ఉద్యోగులు కొందరు సమాచార, పౌరసంబంధాల శాఖలో పాగా వేసినట్లు బలమైన ఆరోపణలున్నాయి. వీళ్లు కూడా ప్రభుత్వ ధనం తీసుకుంటూ... ‘రోత పత్రిక’ కోసం పని చేస్తుంటారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ సంస్థ అయిన డిజిటల్‌ కార్పొరేషన్‌ను పూర్తిస్థాయిలో వైసీపీ సోషల్‌ మీడియా కోసం పనిచేసే వారితో నింపేశారనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల నేపథ్యంలో జగన్‌ భజన, విపక్షాలపై ట్రోలింగ్‌ మరింత దూకుడుగా చేయాల్సి ఉందంటూ... ఇటీవల డిజిటల్‌ కార్పొరేషన్‌లో పనిచేసే సిబ్బంది జీతాలు బాగా పెంచారు. చెల్లింపులూ పెరగనున్న నేపథ్యంలోనే రూ.40 కోట్లు కావాలని కోరినట్లు తెలిసింది.

సొమ్ముల కోసం సాకులు

ఈ ఏడాది డిజిటల్‌ కార్పొరేషన్‌కు ఇచ్చిన వంద కోట్లలో రూ.18 కోట్లు సమాచార శాఖ పంపిన బిల్లులు చెల్లించడం కోసం వాడినట్టుగా జీవోలో చెప్పారు. ఈ బిల్లులు వైజాగ్‌లో జగన్‌ సర్కార్‌ నిర్వహించిన జీఐఎస్‌ సదస్సువని తెలిపారు. ఆ సదస్సు ద్వారా రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాకపోగా ఖర్చుల పేరుతో ఖజానా నుంచి వందల కోట్లు మాయం చేశారు. సమాచార శాఖ, డిజిటల్‌ కార్పొరేషన్‌ పేరు ఏదైనా సొమ్ములు మాత్రం జనానివి. ప్రచారం మాత్రం వైసీపీకి!

అడ్డగోలు దోపిడీ

ఐడ్రీమ్‌ యూట్యూబ్‌ చానల్‌ యజమాని చిన్న వాసుదేవరెడ్డిని డిజిటల్‌ కార్పొరేషన్‌కు అధిపతిగా నియమించారు. ఒక ప్రభుత్వ సంస్థకు, అదే రంగంలోని ప్రైవేటు వ్యక్తిని అధిపతిని చేయడమంటే ప్రభుత్వ సంస్థను అణగదొక్కడమే. వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్‌ను పొగిడేందుకు ఏపీడీసీ ప్రైవేట్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకులను 2022 ఫిబ్రవరిలో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరీ ఆహ్వానించింది. మీ వెబ్‌సైట్లలో ప్రభుత్వ విజయాలు ప్రచురిస్తే, యూనిక్‌ కస్టమర్‌ బేస్‌ ఆధారంగా ఫీజు చెల్లిస్తామని చెప్పింది. పదుల సంఖ్యలో వైసీపీ అనుకూల వెబ్‌సైట్‌లు, యూట్యూబ్‌ చానళ్లకు కాంట్రాక్టులు ఇస్తూ ఎంప్యానెల్‌ చేసుకుంది. ప్రభుత్వ యాడ్స్‌ ముసుగులో అస్మదీయులకు ప్రజల సొమ్మును వెదజల్లుతోంది.

Updated Date - Mar 13 , 2024 | 04:05 AM