Share News

ఒకటో తేదీనే ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:08 AM

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వచ్చే నెల ఒకటో తేదీనే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్డీయే కూటమి బృందం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

ఒకటో తేదీనే ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వాలి

వలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోనీయొద్దు.. సీఈవోను కోరిన ఎన్డీయే బృందం

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వచ్చే నెల ఒకటో తేదీనే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్డీయే కూటమి బృందం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. టీడీపీ లోగో, చంద్రబాబు ఫొటోతో టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కడప వైసీపీ కార్యకర్త మన్విత్‌ కృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. వలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోనీయొద్దని సూచించింది. సర్వేపల్లిలో దొరికిన 4,500 మద్యం సీసాల ఘటనపై విచారణ జరపాలని కోరింది. పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పోసాని కృష్ణమురళి, వాసిరెడ్డి పద్మ, సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర సీఈవో మీనాకు కూటమి బృందం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేసింది. టీడీపీ తరఫున పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకరరావు, బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్‌ ఈ వినతిపత్రాలు అందజేశారు. తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 07:01 AM