Share News

పెద్దిరెడ్డి ‘పవర్‌’!

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:17 AM

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ‘పవర్‌’ చూపించారు. తన సభకు కార్మికులను పంపేది లేదన్న పరిశ్రమలపై ఆయన అధికారాన్ని ప్రయోగించి..

పెద్దిరెడ్డి ‘పవర్‌’!

మంత్రి సమావేశానికి కార్మికులను పంపాలని పరిశ్రమలకు హుకుం

ససేమిరా అన్న యజమానులు

పరిశ్రమలకు విద్యుత్‌ ఆపేసిన అధికారులు

చేసేదిలేక 3 బస్సుల్లో కార్మికుల తరలింపు

హిందూపురం, జనవరి 8: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ‘పవర్‌’ చూపించారు. తన సభకు కార్మికులను పంపేది లేదన్న పరిశ్రమలపై ఆయన అధికారాన్ని ప్రయోగించి.. దారికి తెచ్చుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని తూముకుంట పారిశ్రామికవాడలోని పరిశ్రమలపైనే ఒత్తిళ్లు తెచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి హిందూపురం మండలంలో నిర్వహిస్తున్న పంచాయతీ స్థాయి సమావేశాలకు జనం రాకపోవడంతో వైసీపీ నాయకులు పారిశ్రామిక వాడపై పడ్డారు. పరిశ్రమలకు సెలవు ప్రకటించి, మంత్రి సమావేశాలకు కార్మికులను పంపాలని హుకుం జారీ చేశారు. దీనికి పరిశ్రమల యజమానులు ససేమిరా అన్నారు. దీంతో పరిశ్రమల శాఖాధికారిపై వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారు. అయితే, అవి ప్రైవేటు పరిశ్రమలని, తాను ఏమీ చేయలేనని చెప్పుకొచ్చారు. కానీ, తాము చెప్పినట్లు చేయకపోతే సస్పెండ్‌ చేయిస్తామని బెదిరించారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులు రాకపోవడంతో ఏకంగా పరిశ్రమలకు విద్యుత్‌ కట్‌ చేశారు. చేసేదిలేక పరిశ్రమల యజమానులు.. మహిళా కార్మికులను ప్రత్యేక బస్సుల్లో మంత్రి పెద్దిరెడ్డి సమావేశాలకు పంపారు. మంత్రి కాన్వాయ్‌ వెంటే మహిళా కార్మికులు బస్సుల్లో పలు గ్రామ పంచాయతీలకు తిరిగి.. సమావేశాలకు హాజరయ్యారు. ఇలా సోమవారం రోజంతా మంత్రి వెంటే వారు వెళ్లాల్సి వచ్చింది. కాగా, వైసీపీ నాయకుల తీరుపై పరిశ్రమ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

విధిలేక తరలింపు

హిందూపురం మండలం చౌళూరులో సోమవారం మంత్రి పెద్దిరెడ్డి సమావేశాలను ప్రారంభించారు. ఆ పంచాయతీలో కొంతమంది జనం వచ్చారు. పరిశ్రమలకు పవర్‌ కట్‌ చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ఓ పరిశ్రమ నుంచి 3 బస్సుల్లో మహిళా కార్మికులను తూముకుంట, గోళ్లాపురం, సంతేబిదునూరు, కొటిపి పంచాయతీ సమావేశాలకు పంపించారు. బస్సుల్లో మహిళా కార్మికులను తరలిస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పంచాయతీలకు మంత్రి

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీలో తొలి నుంచీ విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను తప్పించి, దీపికను వైసీపీ నియమించింది. అయితే, దీపికకు కూడా అసమ్మతి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో విభేదాలను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి నిర్ణయించారు. సమావేశాలకు జనం రారని ముందస్తుగా గ్రహించిన వైసీపీ నాయకులు.. హిందూపురం మండలంలోని తూముకుంట పారిశ్రామిక వాడలోని పరిశ్రమలపై కన్నేశారు. ఓ పరిశ్రమకు వెళ్లి మంత్రి సమావేశానికి కార్మికులను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు ఆదివారం పరిశ్రమల యాజమానులను కలిసి.. మంత్రి వస్తున్నారని, కార్మికులను పంపించాలని వైసీపీ నాయకులు హుకుం జారీ చేశారు. దీనికి యాజమాన్యం ససేమిరా అంది. దీంతో సంబంధిత శాఖకు చెందిన ఓ జిల్లాస్థాయి అధికారికి వైసీపీ ముఖ్య నేతలు ఫోన్‌చేసి, మహిళా కార్మికులను పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు. అది ప్రైవేటు పరిశ్రమ కాబట్టి వారిపై తమ అజమాయిషీ ఉండదని ఆ అధికారి తేల్చిచెప్పారు. అయినా నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆయన స్పందించారు.

ఇలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదేమో!

కార్మికులను పంపాలని పరిశ్రమ యజమానులకు జిల్లాస్థాయి అధికారి, వైసీపీ నాయకులు హుకుం జారీ చేసినా వారు ఖాతరు చేయలేదు. కార్మికులను పంపలేదు. దీంతో ఉన్నట్టుండి పారిశ్రామిక వాడకు పవర్‌ కట్‌ చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని యజమానుల గ్రూపులో ఆ శాఖ ఉద్యోగి మెసేజ్‌ పోస్టు చేశారు. నిబంధనల ప్రకారం పరిశ్రమలకు పవర్‌ కట్‌ చేయాలంటే 2 రోజుల ముందే సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా ఉన్నట్టుండి మరమ్మతుల పేరుతో పవర్‌ కట్‌ చేయడంతో పరిశ్రమ యజమానులు కంగుతిన్నారు. దీనిపై ఓ పరిశ్రమ యజమాని మాట్లాడుతూ, మూడు దశాబ్దాల కాలంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని, ఇలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదేమోనని అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 09 , 2024 | 04:17 AM