Share News

పెద్దిరెడ్డి ఇలాకా ప్రమాదకరం!

ABN , Publish Date - May 03 , 2024 | 04:08 AM

వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి పోటీ చేస్తున్న తంబళ్లపల్లి, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు మోహిత్‌ రెడ్డి పోటీలో ఉన్న చంద్రగిరి స్థానాలు అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాల జాబితాలో ఉన్నాయి.

పెద్దిరెడ్డి ఇలాకా ప్రమాదకరం!

పుంగనూరు, చంద్రగిరి, తంబళ్లపల్లి సహా 11 స్థానాలు అత్యంత సమస్యాత్మకం

పెద్ద ఎత్తున ఘర్షణలు, అల్లర్లకు అవకాశం

ఆ నియోజకవర్గాల్లో 100ు వెబ్‌క్యాస్టింగ్‌

రాష్ట్ర వ్యాప్తంగా 64 పోలింగ్‌ కేంద్రాల్లో 374 ఎమ్మెల్యే, 64 మంది ఎంపీ అభ్యర్థులకు భద్రత

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి పోటీ చేస్తున్న తంబళ్లపల్లి, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు మోహిత్‌ రెడ్డి పోటీలో ఉన్న చంద్రగిరి స్థానాలు అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాల జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు మరో 11 స్థానాలు కూడా సమస్యాత్మక నియోజకవర్గాలుగా రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు గుర్తించారు. ఆయా స్థానాల్లో పోలింగ్‌ ప్రక్రియను 100 శాతం వెబ్‌క్యాస్టింగ్‌ చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా గురువారం వెల్లడించారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను భారీ సంఖ్యలో మోహరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. వీటిలో 12,438 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్టు తెలిపారు. కాగా, ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.203 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. జనవరి నుంచి ఎన్నికల ప్రకటన వరకు రూ.179 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 374 మంది ఎమ్మెల్యే, 64 మంది ఎంపీ అభ్యర్థులు భద్రత కావాలని కోరినట్టు తెలిపారు. వారి అభ్యర్థనలను డీజీపీకి పంపామన్నారు. సీవిజిల్‌ కింద 16 వేల ఫిర్యాదులు వచ్చాయన్నారు. కోడ్‌ అమల్లో ఉన్న కాలంలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఇద్దరు మరణించారని, 156 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది మాత్రమే ఇంటి నుంచి ఓటు వేసేందుకు అంగీకరించారని తెలిపారు. ఈ ఓటింగ్‌ ప్రక్రియ గురువారం ప్రారంభమైందన్నారు.

‘గాజు గ్లాసు’ అక్కడ ఉండదు

జనసేన కు కేటాయించిన ఎన్నికల గుర్తును ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం లేదని మీనా తెలిపారు. జనసేన పోటీ చేస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోను, అదేవిధంగా జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల పరిధిలోని లోక్‌సభ అభ్యర్థులకు కూడా గ్లాసు గుర్తును ఇవ్వలేదని తెలిపారు.

మీనా చెప్పిన మరిన్ని విషయాలు

సామాజిక పెన్షన్ల పంపిణీపై ఏప్రిల్‌ 30న కమిషన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. అకౌంట్లలో జమచేయాలని పేర్కొంది. అకౌంట్స్‌ లేని వారికి నేరుగా ఇవ్వాలని చెప్పింది.

అభ్యర్థులు పెరిగిన కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్‌ యూనిట్లను తెప్పించాం. విశాఖ పార్లమెంటులో 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించనున్నాం.

నెల్లూరు, కోనసీమ, కాకినాడలో వెలుగు చూసిన గోవా లిక్కర్‌ డంపుల వెనుక ఉన్నవారిని హైదరాబాద్‌లో గుర్తించాం. ఒకచోట హరియాణ లిక్కర్‌ కూడా దొరికింది.

ఇవి.. యమ డేంజర్‌!

మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్‌, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లి.

Updated Date - May 03 , 2024 | 07:18 AM