Share News

వైసీపీ ప్రభుత్వానికి 4న పెద్దకర్మ

ABN , Publish Date - May 22 , 2024 | 03:51 AM

‘రాష్ట్రంలో రానున్నది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే. వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. మే 13 నే మరణించింది.

వైసీపీ ప్రభుత్వానికి 4న పెద్దకర్మ

మే 13 నే మరణించింది

కూటమికి 120 - 125 సీట్లు ఖాయం: రఘురామరాజు

విజయనగరం(ఆంధ్రజ్యోతి), సీతమ్మధార(విశాఖపట్నం), మే 21: ‘రాష్ట్రంలో రానున్నది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే. వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. మే 13 నే మరణించింది. జూన్‌ 4న పెద్దకర్మ జరుగుతుంది’ అని ఉండి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం విజయనగరం వచ్చిన అయన పైడితల్లి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. తరువాత బంగ్లాలో అశోక్‌ గజపతిరాజు, అదితి గజపతిరాజుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం విశాఖ సీతమ్మధారలోని ఓ ఫంక్షన్‌ హాలులో విశాఖ ఉత్తర నియోజకవర్గ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ‘రిటర్న్‌ గిఫ్ట్‌ అందుకునేందుకు జగన్‌ సిద్ధంగా ఉండాలి. నేను పుట్టి పెరిగిన నేలకు నాలుగేళ్లపాటు రాకుండా నరకం చూపించారు. మా నాన్నమ్మ మరణించినపుడు కార్యానికి కూడా రానీయకుండా చేశారు. జగన్‌ ఓ ఉన్మాది. నన్ను అరెస్టు చేసిన రోజున పోలీసులు తాళ్లు తీసుకు రావటంతో ఉరి వేస్తారనుకున్నా. ఆరోజే నా పనిఅయిపోయిందని భయపడ్డా. ఆ తాళ్లతో నా రెండు కాళ్లూ కట్టేశారు.

నన్ను పోలీసులు కొట్టిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోను. విశాఖలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని జగన్‌ అంటున్నారు. అయితే అది పిచ్చాసుపత్రిలో అయి ఉంటుంది. వైసీపీ నిర్ణయించుకున్న ముహూర్తం భూస్థాపితం అయ్యేందుకే. ఇంతటి కక్షపూరిత ప్రభుత్వాన్ని నేనెన్నడూ చూడలేదు. వేల ఎకరాల ఆస్తులను దాన ధర్మాలు చేసిన అశోక్‌ గజపతిరాజు వంటి సౌమ్యుడైన నాయకుడిని సైతం అల్లరి చేసి వేధింపులకు గురిచేశారు. ఏపీ చరిత్రలోనే ఇటువంటి గొప్ప కుటుంబం ఉండదు. ప్రభుత్వాన్ని నడపటం ముళ్లమీద నడకే అయినా చంద్రబాబు సీఎం అయిన వెంటనే సంపదను సృష్టించి అభివృద్ధి పథాన నడిస్తారు. నేను, అదితి గజపతిరాజు అసెంబ్లీలో అడుగు పెడతాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 120 నుంచి 125 సీట్లు రావడం ఖయం. వైసీపీకి దేవుడు అతి తీవ్రంగా కరుణిస్తే 50 సీట్లు, లేదంటే 25 సీట్లు వస్తాయి. నాకు తెలిసి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కాలు పెట్టడు. ఎన్నికల సమయంలో చీఫ్‌ సెక్రటరీని సస్పెండ్‌ చేస్తే ఇంకా బాగుండేదన్నారు. తనకు తాను అతిగా ప్రేమించుకోవడం నార్సిజం వ్యాధి లక్షణం. ప్రస్తుతం జగన్‌ ఆ వ్యాధితో బాధపడుతున్నారు’ అని రఘురామరాజు అన్నారు. విశాఖ సమావేశంలో ఎమ్మెల్సీ రఘువర్మ, కూటమి నాయకులు ఎండీ నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 03:53 AM