Share News

జల్‌జీవన్‌ మిషన్‌ బకాయిలు రూ.650 కోట్లు చెల్లించండి

ABN , Publish Date - May 19 , 2024 | 03:10 AM

కేంద్ర ప్రాయోజిత పథకం జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటాగా భరించాల్సిన నిధులను తక్షణం జమ చేయాలని,

జల్‌జీవన్‌ మిషన్‌ బకాయిలు రూ.650 కోట్లు చెల్లించండి

మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ.750 కోట్లు జమ చేయండి

లేకపోతే పనులు నిలిచిపోయే ప్రమాదం

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీకి ఏపీ వాటర్‌ సప్లయ్‌ కాంట్రాక్టర్ల సంఘం లేఖ

విజయవాడ, మే 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రాయోజిత పథకం జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటాగా భరించాల్సిన నిధులను తక్షణం జమ చేయాలని, కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉంచిన రూ.650 కోట్లను విడుదల చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీకి ఏపీ నీటి సరఫరా కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రామాంజనేయులు శనివారం లేఖ రాశారు. జేజేఎం పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తన 50 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ను కూడా విడుదల చేస్తేనే.. రానున్న రోజులలో ఈ పథకం కొనసాగే అవకాశాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనుక తన మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయకపోతే కేంద్రం మలివిడత నిధులను ఆపివేసే ప్రమాదముందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన మ్యాచింగ్‌ గ్రాంట్‌ను జమ చేయకపోవటం వల్ల ఇప్పటికే పనులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయని తెలిపారు. ఈ పనులను పూర్తి చేయాలంటే జేజేఎం పథకానికి నిధుల విడుదల కోసం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఫైనాన్స్‌-ప్లానింగ్‌ విభాగాలకు తక్షణం లేఖలు రాయాలని ఈఎన్‌సీకి రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తన మ్యాచింగ్‌ గ్రాంట్‌గా రూ.750 కోట్లను విడుదల చేయాల్సి ఉందన్నారు. తన వాటా నిధులను విడుదల చేయకపోతే భవిష్యత్తులో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

Updated Date - May 19 , 2024 | 08:10 AM