Pawan Kalyan : ఆకతాయిల వేధింపులపై పవన్ సీరియస్
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:24 AM
యువతులను, మహిళలను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారన్న ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియ్‌సగా స్పందించారు.

మహిళలను వేధిస్తున్నారని వెంకటగిరి వాసుల ఫిర్యాదు
వెంటనే తిరుపతి ఎస్పీకి డిప్యూటీ సీఎం ఫోన్
ఆకతాయిలను పట్టుకుని.. కేసు నమోదు
అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): యువతులను, మహిళలను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారన్న ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియ్‌సగా స్పందించారు. వెంటనే వారిని కట్టడి చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించిన తీరుపతి పోలీసులు.. ఆ ఆకతాయిలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. వివరాలివీ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనసేన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. శనివారం ఉదయం జనసేన కార్యాలయంలోనే ఫిర్యాదుల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా చదివారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్టీజలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్నీ అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించారు.
కాగా, తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియజేసిన సమస్య పవన్‌ను కదిలించింది. కొందరు యువకులు ప్రమాదకరంగా బైక్స్ నడుపుతూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపడుతున్నారని లేఖ రాశారు. యువతుల ఫొటోలు తీసి ఇంటర్‌నెట్‌లో ఉంచి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురిచేయడం వంటివి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకుల వివరాలు, బైక్స్‌పై ఫీట్‌లు చేస్తున్న ఫొటోలను, నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఒక మహిళా ఎస్సైను కూడా వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన పవన్.. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందించిన పోలీసు అధికారులు హుటాహుటిన వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్లి ఆకతాయిల వివరాలు ఆరా తీశారు. బైక్స్‌పై మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా సంచరిస్తూ వేధిస్తున్న పలువురి పట్టుకుని కేసులు నమోదు చేసి బైండోవర్ చేశారు.